Sammeta

Sammeta - Sampeta. కాపు బలిజలలో సమ్మెట, సంపెట వంశీయుల గురించి తెలుసుకోండి. కాపుల గురించి మరింత సమాచారం కోసం kapucommunity.com

Sammeta

సమ్మెట వారు

సాహితీ సమరాంగన సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద కావ్యం రచించారు. ఆయన తుళువ వంశీయుడనని, ఆయన కన్నడ రాయడనని చెప్పాడు. మనుచరిత్రను రాయలు వారికి అంకితమిచ్చిన అల్లసాని పెద్దనామాత్యుడు. కృష్ణదేవరాయలు నిర్యాణం అనంతరం తాను చెప్పిన ఒక చాటు పద్యం ప్రచారంలో ఉంది.

గజపతులు రాయలతో ఓటమి నంగీకరించారు. తమ బిడ్డ నిచ్చి తాము కోల్పోయిన ప్రాంతాలను తిరిగి తీసుకొని రాయలకు కప్పము కడుతున్నారు. వారు ఓడిపోయిన దానికి రాయలు మరణానంతరమైనా సరే! విజయనగరము మీద కసి తీర్చుకోవడానికి దండు కదిలించారు. రాయలు మరణించిన వేదనతో కుమిలిపోతున్న అల్లసాని పెద్దన మనస్సు చలించింది. గజపతుల వైఖరిని "ఛీ" అనిపించింది. కవి హృదయం మేల్కొంది. ఆయన వ్రాసిన పద్యము ఇది.

సీ|| రాయరాహుత మిండ రాచయేనుగు వచ్చి
ఆరట్ల కోట గోరాడు నాడు
సంపెట నరపాల సార్వభౌముడు వచ్చి
సింహాద్రి జయశీలజేర్చునాడు
సెలగోలు సింహంబు చేరి ధికృత గంచు
తల్పుల గరులు ఢీకొల్పు నాడు
ఘనతర నిర్భర గండపెండెర మిచ్చి
కూతురాయలు కొడ గూర్చునాడు.

తే॥ ఒడలెరుంగవొ చచ్చితో ఉర్విలేవొ
చేర జాలక తలచెడి జీర్ణమైతొ
కన్నడం బెట్లు సొచ్చెదు గజపతీంద్ర
తెరచినిలు కుక్కసొచ్చిన తెరగు దోప!

ఈ పద్యాన్ని వ్రాసి పెద్దనామాత్యుడు గజపతులకు చేరవేశాడు. వారీ పద్యాన్ని చదువుకొని సిగ్గుపడ్డారు. వెనక్కి తిరిగి వెళ్లారు.

రాయలు మరణించిన తర్వాత కటకం రాజు వీరభద్ర గజపతి విజయనగర సామ్ర్యాజ్యం మీదికి దాడికి వచ్చి ఒక వెలి గుడారంలో బస చేసివున్నప్పుడు రాయలువారి శౌర్య ప్రతాపాలను వర్ణిస్తూ అల్లసాని పెద్దన ఓ తాటాకుమీద పై పద్యం వ్రాసి గజపతికి పంపాడు. దీని అర్థము రౌతు వీరుడైన రాయలు పట్టపు ఏనుగు వచ్చి "ఆరట్లకోట”లో కోరాడే రోజు నీవెక్కడున్నావు (ఆరట్లకోట - తూ॥గో॥జిల్లా - తుని దగ్గర తాండవ నదికి అవతల ఈనాడు విశాఖ జిల్లా పాయకరావుపేట మండలంలో ఉంది) అది గజపతులకు ప్రతిష్టాత్మకమైన కోట (కోరాడడం అంటే గెలుపుకు సూచనగా గెలుపొందిన రాజు పట్టపు టేనుగు దంతాలతో యుద్ధములో ఓడినవారి కోటలోని నేలను దున్నడం) తూర్పు దిగ్విజయ యాత్రలో రాయలు ఈ కోట జయించాడు. సంపెట నరపాల సార్వభౌముడు అత్యంత ప్రతిష్టాకరమైన పుణ్యక్షేత్రమైన సింహాచలము దగ్గర పొట్నూరులో వేయించిన విజయ స్థంభం వేయించినపుడు నీవు ఎక్కడున్నావు? క్రిష్ణరాయలు అనే "సెలగోలు సింహం" నేరుగా నీ కటకానికి వచ్చి కోట ద్వారాలు తన ఏనుగులతో ఢీకొట్టించినప్పుడు నీవెక్కడున్నావు! కాలికి స్వయంగా గండ పెండేరము తొడిగి నీ తండ్రి తన కుమార్తెను రాయలకిచ్చి వివాహము చేసినపుడు నీవేమయ్యావు! అప్పుడు స్పృహలేదా? నీవు ఈ భూమి మీద లేవా? చచ్చిపోయావా? రాయలు మరణించిన తర్వాత తగుదునమ్మా అని వచ్చావా? కన్నడ దేశములోనికి ఎలా ప్రవేశిస్తావు గజపతీ! తలపులు తెరిచి ఉన్న ఇంట్లోకి కుక్క జొరబడినట్లు ఏమాత్రం సిగ్గు లేకుండా వచ్చావా? ఇది చదువుకున్న గజపతి సిగ్గుపడి వెనకకు తిరిగి వెళ్ళిపోయాడంట - దీనికే వెనుతిరిగిపోడు - కాని ఇది అందులో భాగము. రాయలు చనిపోయినా విజయనగరాన్ని జయించడం కష్టమని వెనుతిరిగాడు.

ఈ పద్యములో శ్రీకృష్ణదేవరాయలు సంపెట నరపాలు సార్వభౌముడని పెద్దన చేత కొనియాడ బడినాడు. రాయలు సంపెట వంశీయుడని ఈ పద్యము వలన తెలుస్తుంది. సంపెట అన్నది ఇంటిపేరుగా కనిపిస్తుంది. తెలుగువాడని తెలుస్తుంది. ఈ ఇంటిపేరు మునుపు పెద్దన చెప్పలేదు, నంది తిమ్మన అనలేరు. వరాహపురాణము రచయితలు వాడలేదు. శాసనాలలో గూడా లేదు. పెద్దన ఒక్కరే ఆ పద్యములో అన్నాడు. రాయలు వారు సార్వభౌముడిగా, సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా వెలుగొందుతున్న దశలో ఆయనను చక్రవర్తిగానే మన్నించారు. ఈ చాటు పద్యం చెప్పేనాటికి రాయలు లేరు. భువన విజయంలేదు, రాయలు వారిని తలుచుకుంటూ కాలము వెళ్లబుచ్చుతున్న పెద్దనామాత్యుడు రాయలు ఆయన పూర్వ వంశీయులు క్రమంగా చిన్న, చిన్న పదవులనుండి ఎదుగుతూ వస్తున్న క్రమాన్ని వింటూ, చూస్తూ వచ్చినవారు. మరియు వారు సంపెట వారని కూడా పెద్దనకు ముందే తెలుసు. చాలామందికి తెలిసే ఉంటుంది. చక్రవర్తికి ఇంటిపేరు అవసరమా? అనుకున్నారు. గజపతులవారు దండెత్తి వస్తున్నట్లు తెలుస్తూనే తోక త్రొక్కిన త్రాసైనాడు. తాను యుద్ధం చేస్తాడా? శత్రువులను తుద ముట్టిస్తాడా? చేయలేరు. తాను చేయవలసింది ఎదుటివాడిని మందలించడం అదేపని చేశాడు. తాటాకుమీద చాటుపద్యము వ్రాసి పంపారు. కత్తితో తీరనిది, కలంతో తీరింది. కలంతో “సంపెట” పోటు వేశాడు. గజపతులు వెనుతిరిగారు పెద్దనకు కావలిసింది ఇదే! చివరి రోజుల్లో కూడా పెద్దన ఇలాగ చక్రవర్తి ఋణం తీర్చుకున్నాడు.

రాయలు సంపెట వారిని, కమలాపురం దగ్గరున్న “సంబటూరు” సంపెట వంశీయులదని పద్మశ్రీ డా॥ పుట్టపర్తి నారాయణాచార్యుల వారు పేర్కొన్నారు. సంపెట ఇంటిపేరు. మరో రాజవంశీయుల ప్రస్తావన కడప జిల్లాకు చెందిన కైఫీయత్తులలో చూడ వచ్చును.

కడప శహరు వృత్తాంతములోనూ, సిద్ధవటం మాచుపల్లె, పేర్నిపాడు, పుత్తూరి పాలెం కైఫీయత్తుల్లోను సంపేటవారి ప్రస్తావన ఉంది. ఈ సంపేట వారు మొదట నెల్లూరును పాలించిన తెలుగు బలిజరాజు వీర సిద్ది దేవ చోడ మహారాజు దగ్గర సైనికాధికారిగా పనిచేశాడు. ఆ తరువాత తరంవారు క్రమంగా కడప ప్రాంతములో విస్తరించారు. కైఫీయత్తుల ప్రకారం సంపెట వెంకటరాజు ర్వాత లక్కరాజు, పిన్నయ దేవరాజు, గోప దేవరాజు, సంగమరాజు, చిన సంగమరాజు, శివరాజు పేర్లు ప్రస్తావనలో ఉన్నాయి. వీరు చోళరాజుల తర్వాత సంగమ, సాళువ, తుళువ వంశీయుల దగ్గర, కడప దాని చుట్టుప్రక్కల నాయకులుగా ఉంటూ మాచుపల్లి, పేర్నిపాడులలో కోటలు కట్టుకున్నారు. సంపెట గురువరాజు మాచు పల్లెలో కోట నిర్మిస్తే, సంపెట పిన్నయ దేవమహారాజు పేర్నింపాడులో కోట నిర్మించాడు. (పేర్నిపాడు కోట కథ ఈ సంపుటిలో ఉంది.

సంపెట వారు వేయించిన శాసనాలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. సంపెట కంపరాజు, పుష్పగిరి చెన్నకేశవస్వామి దేవాలయానికి మరమత్తులు చేయించి శాసనం వేయించాడు. సంపెట తిరుమల రాజు శాసనము క్రీ.శ. 1445 నాటిది. కైఫీయత్తులో సూచింప బడినది. సంపెట గోపయ దేవరాజు వేయించిన శాసనం క్రీ.శ.1459 నాటిది. దువ్వూరు దగ్గర జిల్లెళ్ల గ్రామములో ఆంజనేయస్వామి గుడివద్ద ఉన్నట్లు కైఫీయత్ చెబుతున్నది. మరికొన్ని శాసనాలున్నాయి.

రాయలు తుళువ వంశీయులు కదా! తెలుగు వారెట్లు అయ్యారు అనవచ్చును. రాయలు ముత్తాత సంపెట తిమ్మానాయుడు తెలుగువాడే (పెనుగొండ) తుళు ప్రాంతాన్ని పాలించి తుళువారుగా పిలువబడినారు. తెలుగు చోళులు ఒకప్పటి వరయూరు పురాదీశ్వరులు (తమిళనాడులో పరయూరు పురమును పాలించిన తెలుగు చోళ బలిజ రాజులువారు) అలాగే తుళువవారు (తెలుగు ప్రాంతము నుండి వెళ్ళిన సమ్మెట వారు). తుళు ప్రాంతమునుండి వచ్చి తెలుగు ప్రాంతాలకు వచ్చి పాలకులై పూర్వ వంశాన్ని పొగొట్టుకోలేదు. రాయలు మరియు అతని తండ్రి నరసా నాయకుడు, తల్లి నాగలాంబ జన్మించిన చంద్రగిరి రాజ్యములోనే! (యలమండ్యం, (గాజుల మండ్యం) అరగండాపురం, చిత్తూరు జిల్లాలో నివాసమున్నారు).

శ్రీకృష్ణదేవరాయలు సంపెట వారు, నెల్లూరు పాలకుడు వీరసిద్ది చోళ బలిజరాజు వద్ద నున్న సంపెట వెంకట్రాజు మొదలగు బలిజ నాయకులైన సంపెట వారు. వీరి దాయాదులౌతున్నారు. క్రిష్ణరాయలు మట్లవారితోను, ఆరవీటి వారితో, రాయలతాత ఈశ్వర నాయకుని కాలమునుండి బలిష్టమైన వైవాహిక సంబంధాలు పెంచుకొని రాజ్యాన్ని పటిష్టం చేసుకున్నారు. (వీరంతా ఈనాటి రాయలసీమలో జన్మించినవారే) కాని సంపెట వారితో ఎక్కువ బంధాలు పెంచుకోలేదు. దాయాదులైన కారణంగా కావచ్చు. కృష్ణరాయలు కాలానికి వీరు బీడవారై ఉండవచ్చును. దాయాదత్వమే బలమైన కారణం కావచ్చును. అందువలన ఈ సంపెటవారిని ఉదాసీనంగా తీసుకొని ఉంటారు.

క్రిష్ణరాయలు తాము చంద్రవంశీయులమని ప్రకటించుకున్నారు. ఈ సంపెట వారు. మాత్రము కొందరు సూర్యవంశీయులమని కొన్నిచోట్ల చంద్రవంశీయులమని ప్రకటించు కున్నట్లు కైఫీయత్తులలో వుంది. కాని శాసనాలలో (సూర్యవంశ) కశ్యపగోత్రీకులమని చెప్పుకున్నారు. మాచుపల్లె ప్రాంతములో రాజరికము చేసిన సంపెట వారు మా పూర్వీకులు అని చెప్పు కుంటున్న సూర్యవంశీయులు ఇప్పటికీ బద్వేలు, కడప, రాజంపేట, చిట్వేలి ప్రాంతాలలో బలిజలుగా ఉన్నారు ఈ సంపెట వారు. కొందరు సూర్య కొందరు చంద్ర వంశీయులుగా చెప్పుకొనుటకు కారణముంది. 10 శతాబ్దములో రాజమహేంద్రవరమును పాలించిన రాజరాజ నరేంద్రుడు తండ్రి చంద్రవంశం, తల్లి సూర్యవంశం తర్వాత ఆయన కుమారుడు కుళుత్తోంగ చోళుడు తన తాత రాజ్యము కంచిపురము రాజ్యమునకు రాజయి సూర్యవంశంగా ప్రకటించు కున్నాడు. తండ్రి రాజరాజ నరేంద్రుడు చంద్ర వంశంగా ప్రకటించుకున్నాడు. తర్వాత ఈ కుటుంబము నాలుగు తరాలు ఈవిధంగా వివాహ సంబంధము లందుకొని సూర్య వంశీయులైన చోళ బలిజరాజులు చంద్ర వంశీయులైన తూర్పు చాళుక్య బలిజ రాజులు కలిసి పోయి చోళ రాజులుగానే ప్రకటించుకున్నారు. ఇదికూడా అలాగే జరిగింది. కడప జిల్లాలో సంపెట వంశీయులకు చెందిన గ్రామం ఒకటుంది. దానిపేరు సంపెటూరు. కాలక్రమములో ఆ గ్రామం సంబటూరుగా మిగిలింది సంపేటవారు కూడా సంబెట వారు అని కైఫీయత్తులో ప్రస్తావించబడినారు. సంబెటూరు కడప జిల్లాలోని కమలాపురం సమీపంలో ఉంది. క్రిష్టరాయలు నుండి అగ్రహారంగా స్వీకరించిన “కోకట" గ్రామానికి (అల్లసాని పెద్దన) ప్రక్క గ్రామమే ఈ సంబెటూరు. ఇక్కడ చెన్నకేశవాలయం ఉంది. ఈ సంపెట వారు శ్రీకృష్ణ దేవరాయలు ముత్తాత సంపెట తిమ్మానాయకుడు భార్య దేవకీదేవి పెనుగొండవారే. కాబట్టి వీరంతా రాయలసీమలో జన్మించారు. వీరంతా దాయాదులే! అల్లసాని పెద్దన జన్మస్థలము కమలాపురం దగ్గర కోకట గ్రామం. (రాయలు ఇచ్చిన అగ్రహారం) ప్రక్కనే పెద్దనపాడు అని కొందరి అభిప్రాయం, కాని 4-5-1509 సం॥ శుక్లనామ సం|| వైశాఖ శుద్ధ పౌర్ణమి శుక్రవారం నాటి శాసనం అనంతపురం అనే ప్రతి నామంగల "చౌడూరి స్థితా శేష విద్వన్మహాజనాలు” అప్పటికే ఆ గ్రామములో 42 వృత్తులుగల వారున్నారు. అందులో ఎనిమిదవ పేరు అల్లసాని నారాయణమ్మ. అంటే అల్లసాని వారి కుటుంబీకురాలు ఈ గ్రామములో ఉన్నది. మూడవపేరు పెద్దన, ఆయనగూడా అల్లసాని వారయి ఉండవచ్చును. కాబట్టి అల్లసాని పెద్దనా మాత్యుని స్వగ్రామము చౌడూరు అని తెలుస్తుంది.

సంపెట వారు

క్రీ.శ.1522 మే 13వ తేదీ మంగళవారం గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంత కుందుర్రు గ్రామములో పొలము, దానం చేసిన శాసనము పురుషోత్తమ దేవుని శిధిలాలయములోని నాగస్థంభ శాసనము. శ్రీకృష్ణదేవరాయలు, విజయనగరాన్ని పాలిస్తున్నపుడు శ్రీ మహామండలేశ్వర సంపెట ఆలమందల యర్రయ్య దేవ చోడ మహారాజు కొడుకు సర్వయ్య దేవ మహారాజు కశ్యపగోత్రీకుడు వేసిన శాసనము కలదు. వీరు కశ్యప గోత్రీకులు, చోళులు - సూర్యవంశం - బలిజ నాయుడు కులం.

క్రీ.శ. 1426 రెండవ దేవరాయలు విజయనగరాన్ని పాలిస్తున్నపుడు పులివెందుల ఉల్లనెల్లి గ్రామ చెన్నకేశవాలయములో సంపెట బొమ్మయ్య దేవమహారాజు తండ్రి లక్ష్మయ్య దేవ మహారాజు కొడుకు రాయదేవుడు వేసిన దాన శాసనం కలదు.

క్రీ.శ. 1426 రెండవ దేవరాయలు కాలంలో రాజంపేట పొత్తపినాడు లోని గుండ్లూరు సీమ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో మహామండలేశ్వర సమ్మెట రాయదేవ మహారాజుల తండ్రి లక్కయ్య దేవమహారాజు వేసిన దాన శాసనము కలదు.

సూర్యవంశ కశ్యప గోత్రీకులయిన చోళరాజులు చంద్రవంశ ఆత్రేయ గోత్రికులు అయిన తూర్పు చాళుక్యులు 10శ॥ తర్వాత తరతరాలుగా (రాజరాజ నరేంద్రుని కాలం నుండి) వివాహ సంబంధములందుకొని ఒక్కటయిపోయారు.

చాళుక్యుల పూర్వ గోత్రము - మానవ్య గోత్రం (మనువు గోత్రం) తర్వాత ఆత్రేయ గోత్రం - శ్రీనాధ మహాకవి వ్రాసిన "పలనాటి వీరచరిత్ర"లో మలిదేవరాజు యోధులలో “సమ్మెట నారన్న” ఒకరు.

వెలుగోటివారి వంశావళిలో సంపెట కొండరాజు 14 శతాబ్దములో జల్లిపల్లి యుద్ధములో ఓడించబడినాడు. సమ్మెట నాగరాజు మిట్టపాలెం పాలకుడు 1614సం|| తోపూరు యుద్ధంలో పాల్గొన్నారు.

నందూరుపాటి యర్రయ్య (యర్రాపాత్రుడు) కొండవీటి గ్రామాధికారిగా సమ్మెట కోనప్ప ఉండేవారు. గుర్రం బలభద్రయ్య (బలభద్రపాత్రుడు) కొండవీటి కైఫీయత్తు 56 పేజి (తెలగాలు).

క్రీ.శ.1361 సం॥లో సమ్మెట కొండ్రాజు అనే వీరుడున్నాడు (వెలిగోటివారి వంశావళి) 1361లో ఇనుకుర్తి వద్ద జరిగిన యుద్ధంలో రావు లింగయ నాయకుని కుమారుడు అనుపోతు నాయకుని చేతిలో మరణించాడు. క్రీ.శ.1417 ప్రాంతంలో కడపజిల్లా పేర్నిపాడును పాలించిన సమ్మెట సోమనృపాలుడు. రెండవ దేవరాయల సామంతుడు.

కం॥ సమ్మెట సోముని సరెపతి
తిమ్మని నల కొండవీటి దిక్కున మెరయన్
దమ్మటం వేసి గెలిచితి
వమ్మక్కారాయరావు అనపోతాంకా!

తా॥ సమ్మెట సోమరాజును, సర్వేపల్లి తిమ్మడిని, కొండవీడు సమీపంలో తమటం (డప్పు లేక భేరి) వేసి మరీ గెలిచావు. చాలెంజ్ చేసి యుద్దములో గెలిచావు. ఔరా రాయరావు అనపోతాంకా!

రెండవ దేవరాయలకు - లింగమ నాయకుని కుమారుడు అనపోతా నాయకుని
ఓడించిన పిన్నమ నాయకుడు సామంతుడు. తర్వాత సమ్మెట సోమనృపాలుని కుమారుడు | పిన్నమ నాయకుడు అనే వీరుడు పేర్నిపాడు పాలకుడని, రెండవ దేవరాయల | సామంతుడని పేర్నిపాడు లోకల్ రికార్డులు - 14వ పేజి-412 నందు కలదు. కొండవీటి కరణాలుగా సంపెట కోనప్ప ఉండేవారు.

సమ్మెట వారు

తలమంచి పట్టణం కోటలో ఆంజనేయస్వామి దేవళం వద్ద (గండికోట రాజ్యం). శాలివాహన విశ్వావసునామ సం॥ బాద్రపద, శుద్ధ ౧౪లు సదాశివ రాయలు రాజ్యము చేయుచుండగాను గండికోట సీమలోని గ్రామము చలమర్ధి గండ పట్టణము. సంపేట లింగరాజుగారు, శ్రీమహామండలేశ్వర జగతాప్తి (గుత్తి) కంచిరాజు సోమదేవచోడ మహారాజుల కొమారుడు ఓబళరాజ దేవమహారాజులుగారు పట్నం మాధవాపురము హనుమంత రాయని కిన్ని అవసరము సాగించి దేవునకి కట్టడకు నడిచేటట్టుగాను, కట్టడ చేసినది, క్రితానభి …… రాజుకు తెలుగార్ణాయని లింగానాయకునికి దారబోసిన చేను ౧౨ న్ను వరిమడి ౧౨ న్ను, జుమాలా ౧౩, ఆగంగరాజు చేత క్రయానికి పుచ్చుకొని యిస్తిము.

పేరనిపాడు కోట - సమ్మెట వారు

సంపేట రాజులు కడప జిల్లాలో మాచుపల్లె, పేరనిపాడు ప్రాంతాలను ఆసరా చేసుకొని రెండు మూడు శతాబ్దాలు రాజ్యము చేశారు. విజయనగర సామ్రాజ్యము సార్వభౌమాధికారాన్ని మన్నిస్తూ వచ్చారు. శాసనాల్లో సంబెటవారు చంద్రవంశీయులని, సూర్య వంశీయులని ఉన్నట్లు కైఫీయత్తులు తెలుపుతున్నాయి. సంపెట రాజుల్లో పిన్నయదేవ మహారాజొకరు ఈయన తల్లి తిప్పలదేవి, తండ్రి సోమరాజు. వీరికి బెజవాడ (విజయవాడ) వైపు బంధుత్వముంది. ఆ బంధువుల కన్యను వివాహమాడాలని సంపెట పిన్నయ దేవ మహారాజు బయలుదేరాడు. నల్లమల అడవులలో ప్రయాణము చేస్తున్నారు. ఆ రాజుకు ఆయనవెంట నడుస్తున్న వారికి దప్పిక అయింది. సమీపంలో మంచినీరు దొరుకుతుందే మోనని వెతుకు తున్నారు. అలా వెతుకుతూ ఉన్నవారికి బురదలో పొర్లి దారివెంట వెళుతున్న కుక్క కనిపించింది. దానివెంట వెళితే దప్పిక తీరే మార్గం దొరుకు తుందని ఆ కుక్కననుసరించి వెళ్ళారు.

ఆ కుక్క గొర్రెలు మేపుకుంటున్న పేరయ్య, లోకయ్యల దగ్గరకు వెళ్లింది. రాజు మనుషులు వారిద్దరిని తమ దాహం తీర్చే మార్గం చెప్పమన్నారు. వాళ్లు సమీపంలో ఉండే నీటి బుగ్గను చూపించారు. రాజు ఆయన పరివారము దప్పిక తీర్చుకున్నారు. అక్కడే మర్రిచెట్టు క్రింద విశ్రాంతి తీసుకున్నారు. రాజ సేవకులు అందించిన తాంబూలాలు రాజు, పేరయ్య, లోకయ్యలు నములుతున్నారు (వారు పట్రా కులస్థులు) ఆ మర్రిచెట్టు మీద రెండు పక్షులున్నాయి. అవి పైడికంటి పక్షులు తమ భాషలో మాట్లాడుకుంటున్నాయి.

(1) ఈరాజు ఒక చిన్నదాని నిమిత్తము వెళుతున్నాడు. ఆ చిన్నది ఇప్పటికే మూడు మాసాలు గర్భిణి. (2) ఈ రాజు వలన ఈ భూమి కొన్నాళ్ళు పాలించబడుతుంది. (3) ఈ స్థలంలో నిక్షేపము ఉంది.

పైడికంటి పక్షులు మాట్లాడుకున్న ఈ మూడు వాక్యాలను విని పేరయ్య లోకయ్యలు నవ్వుకున్నారు. కాని వాటి అర్థము బయటకు చెప్పలేదు. రాజు ఆ ఇద్దరిని ప్రశ్నించారు. చెట్టుపైకి చూస్తూ ఆ పక్షుల శబ్దాలు విని నవ్వారు. కారణం ఏమిటి అని పేరయ్య, లోకయ్యలు పక్షి భాష తెలిసి వాటి భాషలోని భావం. బయట పెట్టడానికి సంకోచించారు. అయినా ఆడుగుతున్నది రాజు కాబట్టి బయట పెట్టక తప్పలేదు. అది విని రాజు ఆశ్చర్యపోయాడు. రాజు బెజవాడ ప్రాంతం వెళ్ళారు. బట్టలు ఉతికే వాళ్ళను రహస్యంగా విచారించారు. వాస్తవాన్ని తెలుసుకున్నారు. పైడికంటి పక్షులు మాట్లాడిన మొదటి వార్త నిజమని తేలింది. ఇక్కడ నిక్షేపం ఉన్నది అని పక్షులు అన్నాయి గదా అని నిక్షేపం కోసం శోధించారు.

అక్కడ నిక్షేపం బయటపడింది. నిక్షేపం అంటే వెండి, బంగారం, రత్నాలు, వజ్రాలు వంటి విలువైన కుప్ప పక్షులు చెప్పినట్లు వివాహం ఆగిపోయింది. నిక్షేపం దొరికింది. ఇక కోట కట్టవలసిందే ననుకున్నారు. అక్కడే నిర్మాణం చేసారు.

పిన్నయదేవ మహారాజు జీవితంలో ఇదే కీలకమైన ఘట్టము వివాహం కోసం ప్రయాణమైన రాజుకు అది మానుకొని ఇక్కడ కోట కట్టాడు. ఈ పరిణామానికి కారణం పేరయ్య నాయకుని పేరుమీద పేరయ్య నాయునిపేట అని నామకరణం చేశారు. అదే పేరనపాడుగా మిగిలిపోయింది.

పేరనిపాడు కోట మూడు ప్రాకారాలతో నిర్మాణం జరిగింది. కోటలో వీరభద్రుడు, ఆంజనేయుడు, ఈశ్వరుడు దేవస్థానాలు నిర్మించాడు. వారివద్ద జైన ముకుంద శెట్టి కుమారుడు హెగ్గడు. దళవాయిగా ఉండేవాడు. కోటకు సమీపంలో పేట కట్టించాడు.

గగ్గితిప్ప అనే కొండకు పశ్చిమంగా భైరవ ప్రతిష్ట చేశాడు. ఈ భైరవ దేవస్థానము దగ్గర పొడవైన రాతిమీద శాసనముంది. ఆ శాసనము శాలివాహన శకం 1350 (క్రీ.శ.1428) నాటిది. అప్పటి కీలకనామ సం|| శ్రావణ పౌర్ణమినాడు ఈ శాసనం వేయించారు.

ఈ శాసనంలో విజయనగరాన్ని పాలిస్తున్న రెండవ దేవరాయ మహారాయలను ప్రస్తావించారు. ఈయన అప్పటి సంగమ వంశ చక్రవర్తి, సంబెట పిన్నయ దేవ మహారాజు పేరనిపాడును పాలిస్తున్నట్లుంది. ముకుంద శెట్టి కుమారుడు హెగ్గడన్న, గగ్గి తిప్పకు పడమర తోట వేయించాడు. మామిడి, జువ్వి, చింత, మర్రిచెట్లు వేయించాడు. ఇదంతా భైరవ దేవాలయం కోసమే! భైరవునికి పూజ చేసేందుకు మైదుకూరునుండి బద్వేలు పోవు మార్గంలో జాండ్లవరం సమీపంలోని అడవిలో పేరనిపాడు ఉండేది. (ఆధారం యం.ఓ.ఎల్. - 313, పేరనిపాడు నందెలంపేట యొక్క పూర్వోత్తరము)

కడపజిల్లా పేర్నిపాడు కోటను పాలించిన సంపెట పిన్నయ దేవమహారాజు కుభందువులు విజయవాడ ప్రాంతములో వున్నారు. గుంటూరు జిల్లా కొండవీడు సంపెట వారు పాలకులుగా ఉన్నట్లు శాసనాలున్నాయి. గుంటూరు జిల్లా కొండవీటి కైఫీయత్తులో సంపెట వారు కొండవీటి కరణాలుగా ఉన్నారని తెలుస్తుంది. విజయవాడ దగ్గర మచలీపట్నంలోనూ, ముక్కోల్లు గ్రామములోను, సంపెటవారి కండ్రిక గ్రామంలోనూ, సంపెట వారు తెలగాలుగా ఉన్నారు అనేక కుటుంబాలున్నారు. కడపలోనూ అనంతపురంలోను సంపెట వారు బలిజ కుటుంబాలుగా ఉన్నాయి.

సంపేట పిన్నయ దేవ మహారాజు వారికి బెజవాడ, మచిలీపట్నం, కొండవీడు ముక్కోలు ప్రాంతములలో బంధుత్వము ఉందని చెప్పారు.

గాబట్టి సమ్మెట వారు కురు రాజ్యము (ఉత్తరప్రదేశ్) నుండి క్రమేణా అనేకమంది రాజులవద్ద సైనికాధికారులుగా వుంటూ దక్షిణా పదానికి వచ్చారని తర్వాత క్రిష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, కొండవీడు తర్వాత కడప జిల్లా, పెనుగొండ, అనెగొంది, హంపి చేరి విస్తరించారు.

మాచుపల్లి కోట - సంపెట గురవరాజు

కడపజిల్లా సిద్దవటం సమీపంలో మాచుపల్లె అనే గ్రామం ఉంది. మాచుపల్లె దగ్గర కోట నిర్మించుకొని సంపెట గురవరాజు రాజ్యము చేస్తున్నాడు. సంపెట వంశీయులు కడప జిల్లాలో అక్కడక్కడ రాజ్యము చేసారు. పేరనిపాడు రాజధానిగా కూడా సంపెట వంశీయులు పాలించారు.

సంబెట గురవరాజు చాలాకాలం రాజ్యంచేశాడు. అందుచేత ఈయనను తాత గురవరాజు అని పిలిచేవారు. గురువరాజుకు మగ సంతానం లేదు. ఇద్దరు అమ్మాయిలు పొన్నాదేవి, చిన్నాదేవి అనువారు. ఒక గ్రామం అరణంగా ఇచ్చి పొన్నాదేవికి పెండ్లి చేశాడు. పొన్నా పేరులో ఆ గ్రామం పొన్నవోలు అని పిలుస్తున్నారు. చిన్నా అనే రెండవ అమ్మాయిని మాచుపల్లెకు పడమర ఆమడ దూరంలో ఉన్న మాచనూరు గ్రామంలో ఇచ్చారు. పెండ్లి అయిన కొన్ని దినాలకు చిన్నాదేవి భర్త మరణించాడు. చిన్నాదేవి యుక్తవయస్సులో ఉన్న కారణంగా వేరే పురుషునితో సంబంధం పెట్టుకొని గర్భవతి అయింది. ఈ సంగతి గురవరాజుకు తెలిసింది. తన బిడ్డకు శిరచ్చేదనం చేయవలసినదిగా ఆజ్ఞాపించాడు. (బలిజ, తెలగ, కులస్థులకు, భర్త చనిపోతే స్త్రీకి పునర్వివాహము లేదు - ఇతర కులాలలో వివాహం చేసుకోరు) తండ్రి ఆగ్రహం తెలుసుకున్న చిన్నాదేవి స్వస్థలము విడిచి ఎటో పారిపోయి హసనాపురం చేరుకుంది. కడప రాయచోటి మధ్యలో ఉన్న రామాపురానికి సమీపంలో ఈ హనానాపురం వుంది. ఆ గ్రామంలో చిన్నాదేవి రహస్యంగా దాగివుంది. ఒకే కాన్పులో ఆమెకు ఇద్దరు కుమారులు కలిగారు. చిన్నాదేవి ఆమె కుమారులు అక్కడే పెరుగుతున్నారు. పిల్లలిద్దరూ రూపలావణ్యాలతో గుణ విశేషాలతో వృద్ధి వృద్ధి పొందుతూ వున్నారు. ప్రజలు వారిని సూర్య కుమారులని పిలుస్తున్నారు. (తండ్రి ఎవరో తెలియకుండా ఆమె సంతానాన్ని కన్నది. అందుకని ఆ కుమారులిద్దరికి ప్రజలు సూర్యకుమారులన్నారు).

కొన్నేండ్ల తర్వాత సంపెట గురవరాజుకు ఈ సంగతి తెలిసిపోయింది. వారిద్దరిని చంపివేయవలసిందిగా కొంతమంది సైనికులను పంపాడు. ఈ వార్త స్థానికులకు తెలిసింది. సూర్యకుమారుల మీద పెంచుకున్న అభిమానంతో వాళ్లు ఆగ్రహం చెందారు. అందరూ ఏకమై హసనాపురం దిన్నెపాటికి వాయువ్యదిశలో రెండు పరుగుల దూరంలో కొండదగ్గర గురవరాజు సైనికులనెదిరించి పోరాడారు. గురవరాజు సైన్యాన్ని విరగబొడిచారు. ఈ వార్త సంపెట గురవరాజుకు తెలిసింది. మరికొంత సైన్యాన్ని వెంటబెట్టుకొని గురువరాజే స్వయంగా వచ్చాడు. హసనాపురం వారికి గురవరాజు సైన్యానికి యుద్ధం జరిగింది. ఆయుద్ధంలో గురవరాజు తనను ఎదిరించిన వారిని హతమార్చడమే గాక సూర్యకుమారులు తలలు గూడా నరికాడు. గురువరాజు సూర్యకుమారులు తలలు నరికివేసిన కనుమను సూర్యకుమారుల కనుమ (సారె కనుమ అంటున్నారు. కడపనుండి రాయచోటి వెళ్లాలంటే ఈ కనుమ దాటాలి).

సంపెట గురవరాజు పన్ను రాబట్టేటపుడు దారుణంగా వ్యవహరించేవాడు. ఆదేశాలు జారీచేసి ప్రకటించిన సమయంలోగా సుంకం చెల్లించక పోతే తన ఆగ్రహాన్ని అమలు జరిపేవాడు. ప్రజలకు అసాధారణ శిక్షలు వేస్తుండేవాడు. ఇంటి యజమాని సొమ్ము చెల్లించక పోతే ఆయింటి స్త్రీలను బయటకీడ్చేవాడు. ఆడవాళ్ల స్థనాలకు చిరతలు (క్లిప్పుల వంటివి) తగిలించేవాడు. ఆ స్త్రీలను మానభంగము చేయకుండా చిరతలు తగిలిస్తే కలిగే బాధ కూడా అధికంగా ఉండేది. భర్త, ఆ కుటుంబసభ్యులు ఆ అవమానం భరించలేక సుంకం చెల్లించడానికి ఆర్థిక స్థోమత లేక విలవిల్లాడిపోయేవారు. ఆ కుటుంబం ఉరేసుకొని చనిపోవడమో, ఊరు విడిచి వెళ్ళిపోవడమో జరిగేది. ఇలాంటి పద్ధతులతో సుంకం వసూలు చేసేవాడు. గురవరాజు పాలన నరకాసురుడిని గుర్తుకు తెస్తుంది.

ఇలాఉండగా కూచిపూడి గ్రామమునుండి భాగవతులు హంపి, విజయనగరమునకు వెళ్తూ మార్గ మధ్యములో ఆయా గ్రామాల్లో ప్రదర్శనలిచ్చి వెళు తూండేవారు (భరతనాట్యం ఆధారంగా పుట్టిన శాఖ కూచిపూడి, భరతనాట్యం, సిద్దేంద్రయోగి ఈ కూచిపూడి భరత నాట్యానికి కర్త, భామా కళాపం వంటి నృత్య ప్రదర్శనలు చేసి కూచిపూడి భాగవతులు ప్రజలను అలరిస్తూ ఉంటారు. నృత్యం, గానం, సమపాళ్లల్లో సాగుతూ ఉంటుంది. ఈ కూచిపూడి భరతనాట్యం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకత సాధించుకుంది).

విజయనగర రాజధాని హంపిలో దసరా సమయములో మూడు నెలలపాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. ఈ కార్యక్రమాలలో కూచిపూడి బాగవతులకు గూడా అవకాశముండేది.

ఈ కూచిపూడి భాగవతులు సంపెట గురవరాజు రాజ్యంలో వెళుతూ ఆ రాజు సుంకం వసూలు చేసే దారుణాన్ని చూశారు. విజయనగరము వెళ్ళి ఒకనాటి సాయంకాలం కూచిపూడి భాగవతం ప్రదర్శనకు అనుమతి తీసుకున్నారు. అప్పటి విజయనగర చక్రవర్తి (కఠారి) సాళువ నరసింహరాయలు, బాగవతుల ఆట చూడడానికి అంతఃపుర స్త్రీలతో బాటు చక్రవర్తి గూడా ఉన్నాడు. బాగవతులు ఆనాడు తాము పరంపరగా ప్రదర్శించే భాగవతం ప్రదర్శించలేదు. ఒకడు గురవరాజు వేషం వేసుకొన్నాడు ఇద్దరు బంట్రోతు వేషంలో వచ్చారు. మరొకడు స్త్రీ వేషములో వచ్చారు. సంపేట గురవరాజు వేషములో నున్నవాడు ఆసనంపై కూర్చుండి ఉన్న సమక్షంలో ఆ స్త్రీ స్థనాలకు చిరతలు పట్టించి సొమ్ము చెల్లించమని బలవంతం చేస్తున్నట్లు పాట అందుకున్నారు. గురవరాజు బాగవతుల ఆట ముగిసింది. సాళువ నరసింహరాయలు ఇదేమిటని ఆటలోని ముఖ్యులను పిలిచి అడిగాడు. ఈ సమయం కోసం ఎదురుచూస్తున్న కూచిపూడి భాగవతులు మాచుపల్లెలో జరుగుతున్న దారుణాన్ని వివరించాడు.

మరుసటి రోజు ఉదయం కొలువు కూటములో కూర్చుని ప్రదానులతో చర్చించి గురవరాజును శిక్షించడానికి చక్రవర్తి నిర్ణయించాడు. ఇస్మాయిల్ ఖాన్ అనే సర్దారుని సైన్యముతో వెళ్లి మాచుపల్లికోటకు పడమర బండి కనము మీద నున్న చౌకీదారును విరగ బొడిచారు. సంపెట గురవరాజు యుద్ధానికి సిద్ధమయ్యాడు. గురవరాజును పట్టుకొని గొంతు కోశారు. ఆ తలను ఇస్మాయిల్ తీసుకెళ్లాడు. అంతటితో పీడ విరగడయ్యింది - మాసుపల్లి కైఫీయత్ ఎం.ఓ.ఎల్. 364.

మాచుపల్లి రాజు సంపెట గురవరాజు సోదరిని నల్ల తిమ్మరాజుకు ఇచ్చి వివాహం చేశాడు. నల్లతిమ్మరాజు కుమారుడు నల్లా గురవరాజు రాయవేలూరు పాలకుడు. ఇతని కుమార్తె క్రిష్ణమాంబను శ్రీ కృష్ణదేవరాయలు వివాహమాడారు. ఈ నల్లావారు ఈనాడు అమలాపురంలో ప్రముఖులుగా ఉన్నారు. కీ.శే. నల్లారెడ్డి నాయుడు (1952) ఎం.పి., కీ.శే. నల్లా సత్యనారాయణ, చెన్న మల్లేశ్వర కళాపరిషత్ వ్యవస్థాపకులు, ఎ.ఎం.సి., మాజీ చైర్మన్. సురబి వనారస గోవిందరావు అవార్డు గ్రహీత - మాజీ మున్సిపల్ చైర్మన్, నల్లా విష్ణు (అమలాపురం). కీ.శే. నల్లా సూర్యచంద్రరావు (రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి కన్వీనర్).

సమ్మెట వంశీయులు

సమ్మెట వారు వరలక్ష్మి గోత్రీకులుగా, కశ్యప గోత్రీకులుగావున్నారు. విజయవాడ, ముక్కొల్లు, మచిలీపట్నం, సమ్మెటవారి కండ్రిక గ్రామాలలో దాదాపు ఐదు వందల కుటుంబాలున్నాయి. ముక్కొల్లు గ్రామం చరిత్ర ప్రసిద్ధిగాంచినది. ఇక్కడ తవ్వకాలలో బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ మత, విగ్రహాలు వెయ్యి సంవత్సరాల నాటివి బయట పడినవి. శ్రీ కృష్ణదేవరాయలు కాలము నాటి జనార్ధన స్వామి దేవాలయము - విశ్వేశ్వరస్వామి దేవాలయము, శివాలయము - కలవు - హిందూ దిన పత్రిక - సండే - మే - 24 తేది - 2015 - విజయవాడ కనెక్టు దినపత్రికలో వచ్చినవి.

సమ్మెట వారి కుల గురువులు అహోబిల లక్ష్మినరసింహస్వామి గుడి నందు గల వరలక్ష్మి నరసింహ కుమార తాతాచార్యులు వారియొక్క "వరలక్ష్మి గోత్రమును వారికి ప్రదానము చేయుట జరిగింది.

క్రీ॥శ॥ 1400 సం॥లో కడప జిల్లా - పేరని పాడుకోటను పాలిస్తున్న సంపెట సోమరాజు కుమారుడు పిన్నయ దేవ మహారాజు గారి చరిత్రలో వారికి బెజవాడలో బంధువులున్నారని తెలిపారు వారే. ఈ విజయవాడ ప్రాంత సమ్మెట వారిని తెలుస్తుంది. సమ్మెట కోనయ్య గారు కొండవీటి కరణాలుగా ఉన్నారు.

క్రీ॥శ॥ 1505 సం॥ తుళువ వీరనరసింహరాయులు (విజయనగర సామ్రాజ్యాధీశు డు) వేసిన గౌరి బిడనూరు తాలూకా శాసనం. ఎఫిగ్రాఫియా కర్నాటికా - వ్యాల్యూం - 10, శాసనం నెం - 77, పేజి నెం: 278 - 281, 228 - 229 పేజీలలో గల శాసనములో మేము, యయాతి మహారాజు సంతతి వారమని పూర్వం కురుదేశం నుండి దక్షిణాదికి వచ్చి కిష్కిందలో అనెగొంది ప్రాంతములో సుగ్రీవునిచే పూజించబడిన శ్రీరామచంద్ర మూర్తిని కొలిచినవారమని, చెప్పుకున్నారు.

దీనిని బట్టి, చంద్రవంశ యయాతి కుమారుడు తుర్వసుడు సంతతిలోని కురురాజు, దుష్యంతుడు, భరతుడు, పాండవ మధ్యముడు అర్జునుడు సంతతిలోని చాళుక్యులు సంతతివారు అనెగొందిరాజు జంబుకేశ్వరరాయులు కుమారుడు బుక్కరాజు అతని కుమారుడు సమ్మెట తిమ్మానాయుడు సంతతివారు సమ్మెట వారు - అన్నయగారు - దళవాయి వారు ఇంటిపేర్లుగా వికసించారని తెలుస్తుంది.

  1. సమ్మెట అక్కయ్య నాయుడు - ముక్కొల్లు జమీందారుగా ఉండేవాడు. వైష్ణమతస్థులు, శైవ మతస్థులుగా మారిన కారణంగా వారి గురువులు శాపము కారణంగా క్రమేణా వారి ఆస్తులు హరించుకుపోయి నవి అని చెబుతారు.
  2. ముక్కాల్లులోని యీనాంభూములు, మాన్యభూములు గలవు - సమ్మెట వారు వేణుగోపాలస్వామి గుడి - తోట్లవల్లూరు వెంకటాచలస్వామి దేవస్థానం - గూడూరు ఉభయ నాగేశ్వర స్వామి దేవస్థానం - పిల్లలంక గ్రామం, 92 దేవాలయాలకు భూములు ఇచ్చారు.
  3. డోకిపర్రు గ్రామ భూములు - వేణు గోపాల స్వామిగుడి - మచిలీపట్నం 100 ఎకరాలు వేణుగోపాలస్వామి గుడి - తోట్లవల్లూరు 30 ఎకరాలు ఇచ్చారు.
  4. కలపటం గ్రామం : మాధవస్వామి గుడి - తరకటూరు - రాచమలింగేశ్వర : స్వామి గుడి, చెన్నకేశవ స్వామి దేవస్థానం - మచిలీపట్నం - 43 ఎకరాలు

ముక్కొలు గ్రామం :

  1. సమ్మెట చిట్టెయ్య కుమారుడు ఆచార్యులు సెల్ : 9390261390) సమ్మెట అప్పారావు గారి మనుమడు. సమ్మెట క్రిష్ణగారి కుమారుడు. అంజనేయస్వామి సమ్మెట సుబ్బారావు (మాజీ మునసబు) గారి కుమారుడు రోమల్నాయుడు వీరి పూర్వులు క్రిష్ణరాయలు దిగ్విజయ యాత్రలో అనెగొంది నుండి ఇక్కడికి వచ్చినామని చెప్పేవారిని చెబుతారు.
  2. సమ్మెట నారాయణ (మునసబు), సమ్మెట పార్ధసారధి. (మైనరుబాబు) సమ్మెట క్రిష్ణయ్య. క్రీ॥శే॥ సమ్మెట రామశాస్త్రులు నాయుడు గారు, కాశీనాథుని నాగేశ్వరావు పంతులుగారు - వారణాసి (కాశి) యూనివర్శిటిలో కలిసి చదువుకున్నారు) కాశీనాధుని వారు ఎలకూరు గ్రామం. సమ్మెట వారి కులగురువులు.
  3. సమ్మెట వెంకటరాయలు, S/o శంబయ్య, సమ్మెట వెంకటరాయలు S/o గోపాలరావు
    గారి కుటుంబాలు
  4. జనార్ధనస్వామి గుడికి ద్వజస్థంభము సమ్మెట పోతురాజు S/o ముత్యాలు గారు. సమ్మెట నాంచారయ్య గారు నిర్మించారు. ద్వజస్థంభం ఇత్తడి తొడుగు సమ్మెట సత్యనారాయణ గారు, సమ్మెట క్రిష్ణమూర్తి సమ్మెట కొండలరావు గారు చేయించినారు.
  5. విశ్వేశ్వర స్వామి గుడి ద్వజస్థంభం | సమ్మెట కృష్ణయ్య గారి కుమారులు కుటుంబరావు, సమ్మెట రామశాస్త్రులు ప్రతిష్టించారు శిధిలమైన తర్వాత సమ్మెట పార్ధసారధి గారు కుమారులు శివరామ శాస్త్రులు నాయుడు, సుబ్బారావుగార్లు నూతన ద్వజస్థంభం ప్రతిష్టించారు. ఇత్తడి తొడుగు సమ్మెట కుటుంబరావు గారి కుమారులు సమ్మెట కృష్ణయ్య, శ్రీరామమూర్తి (రాంబాబు) గార్లు చేయించారు.
  6. జనార్ధనస్వామి గుడికి సమ్మెట రామయ్యకు కుమారుడు శివశంకర్ ట్రస్టు బోర్డు చేర్మేన్ ప్రహరీ గోడ కట్టించారు.
  7. గంగా అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి గుడికి 1965లో కట్రెడ్డి రామశాస్త్రి నాయుడు ప్రహరీ కట్టించారు.
  8. ముక్కొల్లు మహంకాళి అమ్మవారి గుడికి సమ్మెట పేరయ్య గారి కుమార్తె చందన కోటమ్మ W/o పట్టాభిరామయ్య - 1994లో కట్టించారు.
  9. విశ్వేశ్వరస్వామి ఆలయ మండపం 1931లో చందన అబ్బన్న కుమారుడు శ్రీరాములు గారి భార్య శాంతమ్మ (సమ్మెట జగ్గయ్య కుమార్తె) నిర్మించారు.
  10. కృష్ణజిల్లా గూడూరు మండలం ముక్కొల్లు సమ్మెట రాయుడు భార్య రంగమ్మ చెరువు నిర్మించినది - దానిలో జలస్థంభం - సమ్మెట రాయుడు వారసులు - సుబ్బారావు మనమడు - నారాయణరావు కుమారుడు సమ్మెట చంద్రశేఖర్ శ్రీమతి లక్ష్మి దంపతులు - 2014లో ప్రతిష్టించారు.

ముక్కొల్లు గ్రామంలో స్వాతంత్ర సమర యోధులు 9 మంది కలరు

  1. సమ్మెట అక్కయ్య నాయుడు
  2. సమ్మెట సత్యనారాయణ
  3. సమ్మెట జగన్నాధరావు.
  4. సమ్మెట వెంకట్రామయ్య (గోరిపోతు) రెడ్డమ్మగారు
  5. సమ్మెట భద్రయ్యగారు (రెడ్డమ్మగారి)
  6. సమ్మెట వెంకటరత్నం గారు
  7. పూసా నాంచారయ్య గారు.
  8. సమ్మెట రాధాకృష్ణయ్య
  9. దేవరకొండ శాస్త్రులు (బ్రాహ్మణుడు) - కలరు.

సమ్మెట రంగయ్య నాయుడు ( సమ్మెట వెంకయ్యనాయుడు రెసిడెన్సీ బజారు హైద్రాబాద్).

సమ్మెట అంబాప్రసాద్, వెంకట్రావు, వెంకట రమణ, శ్రీనివాస్ అన్నదమ్ములు వీరిలో సమ్మెట అంబాప్రసాద్ భార్య కృష్ణమాంబ - సినీ నటులు రాజనాల నాగేశ్వరరావు సోదరి. ఇతను ప్రఖ్యాత హర్మోనిస్టు - 1974 లో తెలుగు ప్రపంచ మహాసభలలో ఇతని చేతికి “స్వర్ణ కంకణం" బహూకరించారు - తెలుగు - వెలుగు మాస పత్రికలో ఆర్టికల్ వచ్చింది. వీరి తండ్రి రంగయ్యనాయుడు గారు "శ్రీదుర్గాదేవి పూజా కల్పమ్ అనే పుస్తకం వ్రాశారు.

సేకరించిన వారు :

  1. కట్రెడ్డి సుబ్రహ్మణేశ్వర రావు - ఎం.కాం. 9246228589 - ముక్కోలు గ్రామం గూడూరు (మం) కృష్ణా జిల్లా
  2. సమ్మెట రాఘవయ్య మచిలీపట్నం- సమ్మెట నరేంద్రముక్కొట్లు సమ్మెట ఆంజనేయ స్వామి ముక్కొలు గ్రామం.
  3. సమ్మెట అక్కయ్య నాయుడు వంశీయులు సమ్మెట పార్ధసారధి. జింజేరు గ్రామం పెడన మండలం కృష్ణజిల్లా సమ్మెట దాసేశ్వరావు.
  4. సమ్మెట నాగేశ్వరరావు S/O ఎర్రయ్య (పెడన ల్యాండ్ మార్కెటింగ్ బ్యాంకు ఉద్యోగి) (ముక్కొల్లు).

- భట్టరుశెట్టి పద్మారావు రాయలు

Sammeta

Sammeta - Sampeta. కాపు బలిజలలో సమ్మెట, సంపెట వంశీయుల గురించి తెలుసుకోండి. కాపుల గురించి మరింత సమాచారం కోసం kapucommunity.com

sammeta family history telugu | sammeta vamsam | sammeta surname history | sammeta clan | araveeti vamsham | saluva balija rajula vamsham | sangama vamsa balija kshatriyulu | Kapu Community