శ్రీకృష్ణ దేవరాయల కుటుంబము
క్రీ.శ.1465 సం|| విజయనగర సామ్రాజ్యాన్ని పాలిస్తున్న సంగమ వంశ విరూపాక్ష రాయలు రాజప్రతినిధిగా తుళువ నరసింహనాయుడు పెనుగొండ రాజ్యపాలకునిగా వుండేవాడు. అతనివద్ద పెద్ద భార్య తిప్పమాంబ ఆమె కుమారుడు వీరనరసింహ రాయలుండే వారు. రెండవ భార్య నాగలాంబ ఆమె కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు చంద్రగిరి రాజ్యంలో గాజుల “యలమండ్యం” గ్రామంలో వుండేవారు.
సంగమవంశ రాజుల పాలన అనంతరం సంగమ వంశ ప్రౌఢ దేవరాయలు సోదరి హరిహరమ్మ కుమారుడు చంద్రగిరి రాజు (కఠారి) సాళువ నరసింహరాయలు ఆయన బావమర్ధి విజయనగర సర్వ సైన్యాధిపతి తుళువ నర్సానాయకుడు సహాయముతో విజయనగర సింహాసనమదిష్టించాడు.
ఆ సందర్భములో పెనుగొండ పాలకునిగా తుళువ నర్సానాయకుని తమ్ముడు దళవాయి తిమ్మానాయకుని నియమించాడు. వీరిని తుళువ దొరలు అని విజయనగర సామ్రాజ్యమున, పెనుగొండ సంస్థానమున పిలువబడేవారు. ఇతనికి మొదటి భార్య లక్ష్మమాంబ ద్వారా తుళువ క్రిష్టప్ప రాజు నాయనివారు. ద్వితీయ భార్య తిరుమలాంబ ద్వారా తుళువ ఎల్లప్పరాజు నాయనివారు. తుళువ రంగప్పరాజు నాయనిగారు, తుళువ నరసప్ప నాయనిగారు అని నలుగురు కుమారులు కలిగి విజయనగరాన గొప్ప గొప్ప దళ నాయకులుగా ప్రసిద్ధి చెందారు.
తుళువ తిమ్మానాయుడు పెద్ద కుమారుడు తుళువ క్రిష్టప్ప రాజనాయంగారు గొప్ప వీరుడు. భార్య కొండమాంబ ఈమె శ్రీరంగపట్నం రాజు గంగరాజు కుమార వీరయ్య పెద్ద కుమార్తెను వివాహమాడారు. తన పినతండ్రి కుమారుడు తనకన్నా వయస్సులో పెద్దవాడు. వరుసకు అన్నగారయి కుటుంబ మర్యాదలు తెలిసినవాడు కాబట్టి శ్రీకృష్ణదేవరాయలు గౌరవముతో అన్నయ్యగారు అని పిలిచేవారు. అప్పటినుండి పెనుగొండ సంస్థానాదీశులైన తుళువ క్రిష్టప్ప రాజనాయనిం గారి వంశీయులు అన్నయ్యగారి వంశీయులుగా పిలువ బడినారు. తర్వాత కాలములో ఈ దళవాయి వారు అనెగొంది సంస్థానమును పాలిస్తున్న అరవీటి వంశీయులకు సంతానం లేని కారణంగా వారికి దత్తత వెళ్లి అరవీటి వారుగా పిలువబడ్డారు. ఈనాటి అనెగొంది ప్రస్తుత సంస్థానాదీశులుగా ఉన్నారు.
తుళువ నర్సానాయకుడు మొదటి భార్య తిప్పమాంబ ఈమె సాళువ వీరనరసింహ రాయలు. విజయనగర సామ్రాజ్యాధీశుడు “యాదవవంశ క్షత్రియ బలిజ” కులస్థుడు (గృహనామము కఠారి వారు) సోదరి. ఈమె కుమారుడు భుజబలరాయ తుళువ వీర నరసింహ రాయలు భార్య వెంగమాంబ, పట్టపు రామరాజు, తిమ్మమాంబ గారి మనుమరాలు. కశ్యప గోత్ర కరికాలాన్వయ వరయూరు పురాదీశ్వర తెలుగు చోళ బలిజ వంశీయులు శ్రీ పగడాల మల్లప్ప రాజు కుమారుడు ణివప్పరాజు కుమార్తె. వీరి బంధువులు హంపి విజయనగరము రాజ వీధులలో అపార రత్న రాశులతో 56 దేశాలలో, 9 ఖండాలలో విస్తారంగా వ్యాపారము చేయు పగడాలవారు, పట్టపువారు, కంచివారు, పోలిశెట్టివారు బంధువులు (పోలిశెట్టి రత్నావళి గ్రంథం ఆధారం).
తుళువ వీర నరసింహరాయలు భార్య వెంగమాంబ దంపతుల కుమారుడు తిరుమల దేవరాయలు 27 సంవత్సరాలు జీవించాడు (చంద్రగిరి) తుళువ వీర నరసింహరాయలు తండ్రి మరణాంతరము 1503 నుండి 1509 వరకు విజయనగర సామ్రాజ్యమును పాలించాడు.
తుళువ నర్సానాయకుడు రెండవ భార్య నాగలాంబ. ఈమె గరికపాటి (గాజుల) వీరరాఘవులు నాయకుడు అలివేలమ్మ దంపతుల కుమార్తె (గాజుల బలిజ కులస్థులు) రత్నాల వ్యాపారి. అరికందాపురం, (తిరుపతి దగ్గర పిచ్చాటూరు సమీపంలో ఈనాటి నాగులాపురం) నాగలాంబ కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు – ఆయన తాతగారి ఇంటివద్దనే జన్మించారు. క్రీ.శ.1474 – ఫిబ్రవరి 16 తేది జన్మదినం. తన అన్న తుళు వ వీర నరసింహరాయలు మరణాంతరము క్రీ.శ.1509సం|| విజయనగర సామ్రాజ్య పట్టాభిషిక్తుడయ్యాడు.
తుళువ నర్సానాయకుని మూడవ భార్య ఓబులాంబ కుమారులు రంగరాయలు, అచ్యుత దేవరాయలు, శ్రీరంగరాయలు కుమారుడు సదాశివరాయలు. విజయనగర సామ్రాజ్యమును మహా వైభవోపేతంగా పరిపాలించిన ఆదర్శ సార్వభౌముడు అను కీర్తి దిగంతాలకు వ్యాపింపచేసిన శ్రీకృష్ణదేవరాయలుకు పండ్రెండు మంది భార్యలుండిరని తెలుస్తుంది. వారిలో తిరుమల దేవి మరియు చిన్నాదేవి అనువారు తను ఇష్టపడే దేవేరులని, పట్టపు రాణులని తెలియుచున్నది.
పోర్చుగీసు యాత్రికులలో మొదటివాడు డొమాంగో పెయిస్, రెండవవాడు ఫెర్నో న్యూనిజ్, పెయిస్ క్రీ.శ.1520-22 నాటి వ్రాతలలో ఈ రాజుకు శాస్త్రోక్తంగా పెండ్లి అయిన భార్యలు పండ్రెండుగురు కలరు. వీరిలో ఒకామె ఒరియా దేశపు రాజుకూతురు. రెండవ ఆమె రాయల సామంతరాజయిన శ్రీరంగ పట్టణ ప్రభువు కుమార్తె. మరొకామె వేశ్యాంగన కలదు (పేరు చెప్పలేదు) కళింగయుద్ధం క్రీ.శ.1514 సం|| నుండి 1516 డిసెంబరు వరకు సాగినది. కావున కళింగరాజు కుమార్తె వివాహము 57 సం॥ జరిగి ఉండవచ్చును.
శ్రీకృష్ణ దేవరాయలు పట్టాభిషేకము క్రీ.శ.1509 సం|| జరిగినది. (హంపి విరూపాక్ష దేవాలయ శాసనం) కావున పట్టాభిషేక సమయములో రాయలతోపాటు రత్న సింహాసనముపై కూర్చుండి యుండిన రాణులు ఇద్దరేనని తిరుమలదేవి, చిన్నాదేవి అని అల్లసాని పెద్దన మను చరిత్రలో చెప్పియున్నాడు. కావున ఆ సమయంలో ఇరువురు రాణులు అతని ధర్మ పత్నులుగా ఉండిరి.
దసరా పండుగ వేళలలో క్రిష్ణరాయలు సింహానముపై కూర్చుండిన పిదప తన కులమునకు చెందినవారును, తనకు కుమార్తెలనిచ్చినవారునూ అగు ముగ్గురు లేక నలుగురు తన చెంత కూర్చుండ బెట్టుకొను చుండెననియు వారిలో ముఖ్యుడైన శ్రీరంగపట్నంరాజు సింహాసనమునకు ముందువైపు కూర్చుండును అతని పేరు కుమార వీరయ్య అతని రాజ్యము పడమర మలబార వరకు వ్యాపించియుండెను. తిరుమలదేవి ఈ వీరయ్య కుమార్తె ఇంతేగాక అతడు రాయలు కులమునకు చెందినవాడని గంగరాజు కుమార వీరయ్య క్షత్రియ కులమునకు చెందిన వాడని డామెంగో పెయిస్ వ్రాశారు, న్యూనిజ్ కూడా వ్రాశారు.
అరగ రాజ్యము :
క్రీ.శ. 14వ శతాబ్దములో శివమొగ్గ మండల ప్రాంతము విజయనగర రాజులు. మొదటి హరిహర రాయలు, మొదటి బుక్కరాయలు, రెండవ హరిహర రాయలు కాలములలో వారి ప్రతినిధులుగా రాజకుటుంబాలకు చెందిన వారు ఈ ప్రాంతం పాలించిరి. విజయనగర రాజులుకు ముందు ఈ ప్రాంతమును మల్లెరాజ్యమని పిలుచు చుండిరి. “అరగపురం” దీనికి రాజధానిగా యున్నది కాని విజయనగర రాజులు అరగపట్టణము రాజధానిగా అరగ రాజ్యము నేర్పాటు చేసిరి (నేడు అరగపురం తీర్ప హళ్ళి తాలూకాలో ఉన్నది నేడు కుగ్రామం) ఈ అరగ రాజ్యములో కొంత భాగమును రెండవ దేవరాయలు కాలములో మొదటి గంగరాజు వీరయ్య నాయకుడు పాలించు చుండెను. తర్వాత అతని మనుమడు కుమార వీరయ్య నాయకుడు. తుళువ నర్సానాయకుడి వద్ద సైన్యాధిపతిగా ఉండెను. తర్వాత శ్రీకృష్ణ దేవరాయల వద్ద సైన్యాధిపతిగా ఉండెను. ఈ అరగ రాజ్యములోని కొంత భాగము తుళువ ప్రాంతమున దేవకీపురం రాజధానిగా క్రిష్ణరాయలు ముత్తాత తుళువ తిమ్మా నాయుడు పాలించాడు.
విజయనగర చక్రవర్తియైన సాళువ (కఠారి) నరసింహరాయలు కాలములో తుళు వ నర్సానాయకుడు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. విజయనగర రాజ్యముపై శ్రీరంగపట్టణం పాలకుడు హోయసల రాజు హఠాత్తుగా దాడి చేయగా నరసా నాయకుడు అతనిని జయించి అతనిని శ్రీరంగపట్టణము నుండి తరిమి కొట్టి ఆ రాజ్యము నాక్రమించెను. ఆ సమయములో విజయనగర చక్రవర్తి సాళువ నరసింహరాయలు నరసా నాయకుని శ్రీరంగపట్నం రాజ్యమునకు రాజ ప్రతినిధిగా నియమించెను. అపుడు గంగరాజు కుమార వీరయ్య మంచి యోధుడిగా ఉండి నర్సానాయకుని వద్ద దండనాధుడిగా ఉండెను. శ్రీరంగపట్నంలో రెండు కుటుంబాల వారు ఉన్నందున ఒకే కులము వారయినందున 1495 సం॥లో క్రిష్ణరాయలుకు శ్రీరంగపట్నంలో తిరుమల దేవితో వివాహము జరిగినది ఆమెకు 17 సం॥ వయస్సు వున్నది. తర్వాత రెండు సంవత్సరములకు తల్లియై ఆమె తిరుమలాంబకు జన్మనిచ్చింది. తర్వాత తుళువ శ్రీకృష్ణదేవరాయలు తిరుమలదేవి అనంతపురం జిల్లా హిందూపురం దగ్గర చోళ సముద్రంలో నున్న చౌడాంబికాదేవిని పూజించగా తిరుమల దేవికి మగబిడ్డ జన్మించాడు. పేరు తిరుమల రాయలు. ఆ బిడ్డకు 6 సం|| వయస్సులో పట్టాభిషేకం జరిపించారు (క్రీ.శ.1524 సం||) తిరుమలరాయలు జన్మించినది 1518. మైసూరు మండలం గుండ్లుపేట తాలూకా భీమనబీడు. కన్నడ శాసనం – మహామంత్రి తిమ్మరుసు అతని సోదరుడు గోవిందరాజు వేయించారు. బహుదాన్య నామ సం|॥ శ్రావణ శుద్ధ ద్వాదశి 1518-జూలై-19 తేది సోమవారం తిరుమలదేవి శ్రీరంగపట్టణంలో తన పుట్టినింటనే ప్రసవించింది 1520 సం|| క్రిష్ణరాయలు శాసనం.
శ్రీ కృష్ణదేవరాయలు చిత్రవాటిక (చిత్రవాది) రాజధాని హంపికి దగ్గరలో విజయ నగరం నొక భాగమునకు తిరుమలదేవి పట్టణము అని పేరు పెట్టెను. అదే ఈనాటి హోస్పేట.
తిరుమలదేవి :
1530 వ సంవత్సరంలో రాయలు చనిపోయాడు. తర్వాత కుమారుడు అంతఃపుర కుట్రకు చనిపోయాడు. తిరుమలదేవి, చిన్నాదేవి, సహగమనము చేయలేదు (తుళువ నర్సానాయకుడు చనిపోయి నపుడు అతని భార్యలలో మూడవ భార్య, పెద్ద భార్య సహగమనము చేసారు) శ్రీ కృష్ణ దేవరాయలే అప్పటి విజయనగర పరిస్థితులను రాచనగరు (అంతఃపురం) పరిస్థితులు గమనించి సహగమనం చేయవద్దని భార్యలకు చెప్పియుండును. కాని కొందరు రాణులు సహగమనం చేశారు. ఇంతేగాక రాయల కుమార్తె తిరుమలాంబ భర్త అళియరామరాయలు, ఆప్త బంధువులను, రాణులను ప్రార్థించి సహగమన ప్రయత్నము నుండి వారిని విరమింప చేసి యుండును. రాయలు మరణానంతరం రాణులు జీవించి ఉండినచో అళియ రామరాయలకు అంతఃపురముతో సంబంధముండును. రాజ్యంపై హక్కు ఉండదు. వారు సహగమనం చేసినచో సంబంధం పూర్తిగా అంతరించును మరియు అళియరామరాయలు భార్య తిరుమలాంబకు పుట్టింటి ఆశ అదృశ్యమగును వారు సహగమనము చేసినచో చరిత్ర వేరొకరకంగా ఉండేది. తిరుమలదేవి అచ్యుత దేవరాయలు మరణం తర్వాత దాదాపు మూడు సంవత్సరాలు జీవించి యుండినది (హండే-అనంతపుర చరిత్ర ఆధారం)
అళియరామరాయలు భార్య తిరుమలాంబ (రాయలు కుమార్తె) దంపతులకు ఇద్దరు కుమారులు జన్మించారు. (1) శ్రీకృష్ణ దేవరాయలు (ఇతను తాతను బోలియుండును), (2) పెద తిమ్మరాజు 1530 సం|| క్రిష్ణ రాయలు చనిపోయిన తర్వాత వీరు జన్మించారు. వీరు పెనుగొండ, రాయచూరు ప్రాంత పాలకులుగా స్థిరపడ్డారు.
చిన్నాదేవి :
పోర్చుగీసు యాత్రికుడు న్యూనిజ్ వ్రాతలు శ్రీ కృష్ణదేవరాయలు బాల్యమందు ఒక వేశ్యతో సంబంధముందని ఆమె పేరు చిన్నాదేవిడి అని అది గమనించిన తిమ్మరసు సాళువ నరసింహరాయలు సంతతికి చెందిన మిక్కిలి అందగత్తె అయిన కన్యను తెచ్చి రాయలుకు పెండ్లి గావించెను. ఆ వేశ్యను కూడా ఒక భవనమందుంచెను. ఆమె వివాహమైన భార్య కాదు. ఆజన్మాంతరం ఉంపుడుకత్తె.
పెయిన్ ఆమె పేరు చెప్పలేదు ఎవరి కుమార్తె అని చెప్పలేదు. కాని ఆమె శాస్త్రోక్తంగా పెళ్లాడిన భార్య అని చెప్పాడు. రాయలు ముగ్గురు భార్యలలో ఒకామె వేశ్యాంగన అని మాత్రమే చెప్పాడు.
చిన్నాదేవి ఉంపుడుగత్తె అయితే రాయలు పట్టాభిషేకం నాడు పట్ట మహిషియైన తిరుమల దేవితోపాటు విజయనగర పూర్వీకులు కూర్చున్న రత్న సింహాసనముపై కూర్చుండ బెట్టుకొనునా? ఎంతటి మహారాజుకయినా అది సాధ్యమగు కార్యమా? ఉ త్తమ క్షత్రియ కులసంజాతుడు, ఒక రాజ్య పాలకుడు, మహావీరుడు, కవి, ధర్మము తెలియదా? కుమార వీరయ్య కుమార్తె తిరుమలదేవి సమ్మతించునా? మహామంత్రి తిమ్మరసు అంగీకరించునా? కొటికంవారు, ఆరవీటివారు, జౌకువారు, నంద్యాలవారు, వెలిగోటివారు, పౌరుషవంతులైన సామంత రాజులు అంగీకరింతురా? ప్రజలు అంగీకరింతురా? అల్లసాని పెద్దన మనుచరిత్రలో చిన్నాదేవి ధర్మపత్ని అని చెప్పారు.
పట్టాభిషేకమునాడు తిరుమలదేవితో పాటు ప్రాచీన పవిత్ర రత్న సింహాసముపై కూర్చుండి గౌరవించబడిన చిన్నాదేవి మరియు పట్టాభిషేకము జరిగిన పిదప పరిణయ మాడక అంతఃపురమునకు రప్పింపబడి ఉంపుడు గత్తెగానే యుంచుకొనబడిన చిన్నాదేవి ఒక వ్యక్తి కాదు వారు భిన్న వ్యక్తులు.
హిందువులు పద్దతులు సాంప్రదాయాలు తెలియని పెయిస్, న్యూనిజ్ వ్రాసిన వ్రాతలలో కొంత పొరపాట్లు దొర్లినవి. క్రిష్ణరాయలు కులమునకు చెందినవారును, మరియు తనకు మామగార్లును అగు ముగ్గురు లేక నలుగురు తనతో సమానంగా దసరా పండుగ సమయంలో కూర్చుండబెట్టుకొను చుండెడివాడు. వారందరు రాజులుగా ఉ ండిరి. దీనిని బట్టి రాయలు మామగార్లు క్షత్రియ వంశీయులని తెలుస్తుంది. రాయలు మామగార్లు, క్షత్రియులైతే, చిన్నాదేవి (ముద్దుల భార్య) క్షత్రియ వంశీయురాలు కాదా? దీనిని బట్టి ఆమె తండ్రి ఒక ప్రాంత పాలకుడిగా నుండెనని కూడా తెలియుచున్నది. పైన చెప్పిన కారణముల వలన పట్టాభిషేక సమయములో తిరుమలదేవితోపాటు రత్న సింహాసనముపై కూర్చున్న చిన్నాదేవి క్షత్రియకాంతయే అని నిశ్చయముగా తెలుస్తుంది. అల్లసాని పెద్దన మహా కవి గూడా ఆ చిన్నాదేవి ధర్మపత్ని అని చెప్పియున్నాడు.
చిన్నాదేవి అనే వేశ్యను ఆయన పెండ్లి చేసుకోలేదు. ఉంపుడుగత్తెగా అమెను అంతఃపురములో ఉంచాడు. రాయలు తండ్రి నర్సానాయకుడి తర్వాత వీరనరసింహ రాయలు రాజ్యానికి వచ్చాడు. అతను మరణించిన పిదప అతని కుమారుడు తిరుమలదేవ రాయలుకు (తగిన వయస్సు లేనందున) రాజ్యం సంక్రమించాలి తన అన్న చనిపోతాడని, రాజ్యము తనకు వస్తుందని రాయలు ఊహించను గూడా లేదు. కలలో కూడా ఊహించలేదు.
రాయలు హిందూ మతాభిమాని, వర్ణాశ్రమ ధర్మాలయందు నమ్మకము గలవాడు. ఆ ధర్మమును రక్షించుటకు కంకణము కట్టుకున్నాడు. పరమ దైవ భక్తుడు, పాపభీతి గలవాడు, సకల శాస్త్ర పారంగతుడు. ఇట్టి సుగుణవంతుడు అయిన రాయలు ఒక వేశ్యాంగనను భార్యగా చేసుకొనుటకు మనసురాదు. చక్రవర్తి అయినంత మాత్రాన, సాంఘిక ధర్మములు ఉల్లంఘించుట వీలుకాదు. వారకాంత మహాదేవి కాజాలదు. వేశ్య అయిన చిన్నాదేవి రాయలకు దేవేరి కాజాలదు. రాయలు తల్లిపేరు నాగాలాంబ పేరున నాగులాపురం, హంపి దగ్గర నిర్మించారు. తర్వాత అరిగిండాపురమును నాగలాపురంగా తల్లిపేరు మీద మార్చారు.
మైసూరు శాసన సంపుటి – నలంజి గ్రామ శాసనం – ఈ శాసనము వేయించిన వారు – రాయదుర్గం ఆదిత్య దేవర మనుమలు – నలంజి గ్రామ వాస్తవ్యులు దేవయ్య, ఓదపయ్యయనువారు. ఈ దేవయ్య సోదరుల పితామహుడైన ఆదిత్య దేవరకు – విజయనగర సామ్రాజ్యము పాలించిన 1424-1446 సం॥ పాలించిన ఇమ్మడి (రెండవ) దేవరాయలు “నలంజి అనే గ్రామము” (హసన్ జిల్లా) ను అగ్రహారంగా దానమిచ్చాడు. కాని కాల క్రమమున ఆ గ్రామం శిధిలమై పోయినందున క్రిష్ణరాయలు రాజ్యము చేయుచున్నప్పుడు పైన చెప్పిన సోదరులు రాయలు భార్య చిన్నా మహాదేవిగారిని ఆశ్రయించి ఆమెద్వారా రాయలకు విన్నవించిరి. ఆమె వారి విషయము శ్రద్ధ వహించి రాయలుకు సిఫారసు చేసింది. రాయలు ఆమె మాట అంగీకరించి ఆ గ్రామం మరలా వారికి వ్రాసి ఇచ్చెను.
ఈ శాసనమును బట్టి ఆ సోదరులు, వారి పూర్వులు, ఆమె జన్మస్థలం నుండియో, లేక దాని ప్రక్క గ్రామం నుండి వచ్చియుండును. ఇంతేగాక చిన్నాదేవి తల్లిదండ్రులతో మంచి పరిచయముగల వారై యుందురు పుట్టింటి వైపు గ్రామము వారుగదా అందువలన వారిపై మంచి అభిమానం కలిగి యుండుట సహజము. దీనిని బట్టి చిన్నాదేవి హసన్ మండలము బేలూరు ప్రాంతానికి చెందినదని ఆమె పుట్టిల్లు ఇచటనే యుండినట్లు తెలుస్తుంది. ఆ ప్రాంత పాలకుల కుటుంబీకురాలని తెలుస్తుంది.
బేలూరు ప్రాంతమును సంగమవంశ హరిహర రాయలు కాలమునుండి
పాలకులుగా యర్రా క్రిష్ణమ నాయుడు వంశీయులు పాలకులుగా యున్నారు. నర్సానాయకుడి కాలములో గూడా వారి బంధువులు బేలూరు సీమను పాలించినారు. నర్సానాయకుని మరణానంతరము, సంతె బేలూరు ప్రాంతమును పాలిస్తున్న చిన్న అధికారి ఆ గ్రామములో వీర నారాయణ స్వామి ఆలయమున తన స్వామి నర్సానాయకుని సంస్కరణార్థము – నందా దీపం వెలిగించి నిత్యనైవేద్యాలు ఏర్పాటు గావించాడు.
క్రీ.శ.1512లో వేద వేదాంగ వేత్తయగు శ్రీనివాసాద్వరిని, బేలూరు తాలూకాలో నుండిన “కడంక” గ్రామమునకు “చిన్నాదేవిపురం” అని ప్రతినామ మొసగి క్రిష్ణ రాయలు దానమొనర్చెను. దీనిని బట్టి చిన్నాదేవి పుట్టింటికి సమీపముందున్న గ్రామమునకే కొత్త నామకరణ మొసగి యిచ్చినాడని తెలుస్తుంది.
తుళవ వంశ రాజులకు బేలూరు చెన్నకేశవస్వామి కులదేవతగా నుండెనని రాయలు అధికారి ఆ దేవాలయమున వేయించిన కన్నడ శాసనం వలన తెలుస్తుంది. ఈ శానసము వేయించినవారు జక్కన నాయకుని కుమారుడు భసప్ప నాయకుడు. 1524-7-6 సం|| వేయడమయినది.
అందువలన రాయలు బేలూరు ప్రాంత బలిజ క్షత్రియుల కన్య చిన్నాదేవిని వివాహ మాడెనని తెలుస్తుంది. ఆమె యర్రావారి ఆడపడుచు అని నా అభిప్రాయము. రాయలు తన రాజ్యమందు ఒక్కొక్క ప్రాంతమందు ఒక్కొక్క కన్యను వివాహమాడెనని తెలుస్తుంది. శ్రీరంగపట్నం ప్రాంతము నుండి తిరుమలదేవి, బేలూరు ప్రాంతమునుండి చిన్నాదేవి ఒరియా దేశం (కళింగ) నుండి గజపతి కుమార్తె సుభద్రను పెండ్లి చేసుకున్నాడు.
రాయలు అంతఃపురములో ఇద్దరు చిన్నాదేవులుండిరి. అందులో ఒకామె రాయలు ధర్మపత్ని, ఇంకొకామె రాయలు ఉంపుడుగత్తె, రాయలు పట్టాభిషేకం నాటికి చిన్నాదేవితో రాయలుకు వివాహము జరిగి రత్నసింహాసనముపై కూర్చున్నది.
చిన్నమహాదేవికి రాయలుతో వివాహము 1494లో జరిగింది. తిరుమలదేవి వివాహము 1497లో జరిగింది. శాసనాల ప్రకారం నలంజీ శాసనంలో చిన్న మహాదేవి అని పేర్కొంది.
అళియ రామరాయలు వివాహం తిరుమలాంబతో 1517లో జరిగింది. చిన్న మహాదేవి కుమార్తె వెంగలాంబ భర్త అరవీటి తిరుమలరాయలు వివాహము 1519లో జరిగింది. రాయలు మూడవ కుమార్తె క్రిష్ణవేణిని – మట్లె వరదరాజుకిచ్చి వివాహము చేశాడు. 1520 సం॥ వివాహం జరిగింది.
చిన్నాదేవి పేరే అన్నపూర్ణ అని వీరేశలింగం పంతులుగారు వ్రాశారు. చిన్నాదేవికి చిన్నతనంలో అన్నపూర్ణాదేవి అని పేరు పెట్టి ఉండవచ్చును. ఆమె చాలా అల్లారు ముద్దుగా పెరిగినందువలన తల్లిదండ్రులు బంధువులు, ఇరుగుపొరుగువారు “చిన్నా” అని ముద్దుగా పిలిచియుందురు. యౌవ్వనంలో చిన్నమ్మ అయినది. రాణి అయిన తర్వాత చిన్నాదేవి అయినది. తల్లి అయిన తర్వాత చిన్న మహాదేవి అయినది.
1513 సం|| హోయసల దేశంలోని బేలూరు దగ్గర “కడంక” గ్రామమునకు చిన్నాదేవి పురం అని పేరుపెట్టి రాయలు దానం చేశాడు ఆ గ్రామం ప్రస్తుతం “తూముకూరు” జిల్లాలో ఉంది. క్షత్రియ బలిజ కుటుంబీకుడైన గంగరాజు కుమార వీరయ్యగారికి అదే ప్రాంతము బేలూరు సీమ పాలకవర్గములోని క్షత్రియ బలిజులైన చిన్నాదేవి కుటుంబానికి బంధుత్వము ఉండవచ్చును. తూముకూరు జిల్లా పావుగడి మునిసిపల్ చైర్మన్ వంచగారి గురప్ప – బలిజ కులస్థుడు.
బేలూరు బలిజనాయక వంశం
కర్ణాటకలోని దక్షిణ మైసూరు ప్రాంతమునకు, బేలూం, బాలం ప్రాంతములకు “ఎర్రా” వారిని రాజ ప్రతినిధులుగా శ్రీకృష్ణదేవరాయలు ఐగూర్ (మంజురాబాద్) రాజధానిగా ఉన్న ప్రాంతమునకు “ఎర్రా” క్రిష్ణమనాయుడిని నియమించారు. వీరిది “బలిజ” కుటుంబము.
ఆధారము : మైసూరు క్యాస్ట్ & ట్రైబ్స్ ఎల్. కృష్ణ అనంత క్రిష్ణ అయ్యర్ (దివాన్ బహుదూర్) గారు వ్రాసినది.
ఎర్రా బయ్యప్ప నాయకుడు (వెంకటాద్రి నాయకుడు)
⬇️
భార్య కొండమ్మ
⬇️
ఎర్ర క్రిష్ణమ నాయకుడు
⬇️
ఇతను “బేలూరు” సీమను ఆక్రమించాడు. ఆ సీమకు రాజప్రతినిధిగా “క్రిష్ణరాయలు”
నియమించాడు. తుళువ సదాశివరాయలు కాలం వరకు కొనసాగారు. ఈయన
బేలూరు సిద్దేశ్వరాలయము నిర్మించాడు.
⬇️
1524 – 1570
⬇️
ఎర్ర వెంకటప్ప నాయుడు
⬇️
1570 – 1580
⬇️
ఎర్ర క్రిష్ణమనాయుడు – 2
⬇️
1580 – 1625 (సిద్దేశ్వరాలయము పూర్తి చేశాడు).
యర్రా వంశీయులు 1693 వరకు బేలూరు సీమను పాలించారు. Indian History నోబూరు కరిష్మాగారు – వీరు తెలుగు “బలిజ” కుటుంబము అని వ్రాసారు.
ఈ “యర్రా” కుటుంబీకురాలే “శ్రీకృష్ణ దేవరాయలు సతీమణి” చిన్న మహాదేవి గారు – “ఆదర్శ సార్వభౌముడు – శ్రీకృష్ణదేవరాయలు గ్రంథం రచయిత ప్రొఫెసర్ డా॥ కె.ఎస్. కోదండరామయ్య (ఎం.ఎల్.ఎ) హోసూరు -1985-తమిళనాడు.
శ్రీ కృష్ణదేవరాయలు కుమార్తె క్రిష్ణమాంబ :
మట్ల చెన్నమరాజు కుమారుడు వరదరాజు క్రిష్ణరాయలు కుమార్తె క్రిష్ణమాంబను వివాహము చేసుకున్నాడు వారు సూర్యవంశ చోళ బలిజరాజులు. ఈ వంశమూల పురుషుడు బొమ్మరాజు అతని కుమారుడు సోమరాజు ఇతనికి ఐదుగురు కుమారులు. అందు పెద్దవాడు పోతరాజు. అతనికి ఇరువురు భార్యలు (1) చిన్నమ్మ, (2) రామాంబా అనువారు. చిన్నమ్మకు ఇరువురు పుత్రులు (1) వరదరాజు, (2) వయ్యారి రాజు అనువారు. చిన్నమ్మ కుమారుడు ఈ వరదరాజు క్రిష్ణమాంబ భర్త వీరి కుమారుడి పేరు వయ్యారిరాజు. (ఈనాటికి వయ్యారివారు బలిజలుగా ఉన్నారు). పోతరాజువారు బలిజలుగా ఉన్నారు.
ఈ వరదరాజుకు కావేరి వల్లభ, కటక సురాహార, గజసింహ బిరుదములు గలవు. క్రిష్ణ రాయలు కాలములో పెద్దల్లుడైన అళియ రామరాయలును, వరదరాజు చేసిన వీరోచిత కార్యక్రమములు తిరుపతి దేవాలయ శాసనకర్త నివేదిత కార్యకర్త తెలిపారు. వరదరాజు పాలించిన కాంచీపురంలో స్వామివారి సేవ గావించినట్లు శాసనంద్వారా తెలుస్తుంది.
రాయలు పూర్వ దిగ్విజయ యాత్రలో కొండపల్లి నుండి కటకం వరకు రాయలు సాధించిన మహా రణరంగంలో వీరు రాయలుకు తోడ్పడి తమ బలపరాక్రమములు చూపి అతనిని మెప్పించి ఉంటారని చెప్పవచ్చును. మట్ల వరదరాజుది ఉన్నత వంశం, పరాక్రమము, విధేయత, రూపురేఖలు మొదలగు వాటిని సంతసించియే రాయలు వీరికి తన కుమార్తె నిచ్చి వివాహము చేసి ఉండవచ్చును.
ధర్మపురి జిల్లా హోసూరు తాలూకా పై భాగమున, వరదాపురం. క్రిష్ణమ్మ కొత్తూరు అను రెండు గ్రామములు కలవు. ఇది ప్రక్క పక్కనే గలవు. దీనిని బట్టి క్రిష్ణరాయలు వరదరాజును ఈ ప్రాంత పాలకుని నియమించి ఉండవచ్చును.
క్రిష్ణరాయలుకు క్రిష్ణమాంబ అను భార్య కలదు. ఆమె రాజధానియందే వేరొక భవనములో నుండెనని “న్యూనిజ్” వ్రాతలను బట్టి తెలుస్తుంది. తక్కిన రాణులు కూడా వేరువేరు భవనములలో నివసిస్తుండేవారు. ఆమె సాళువ (కఠారి) వారి ఆడపడుచు. ఆమెది “రాయల వెల్లూరు” పట్టణం.
రాయలు భార్యలలో కొండమాంబ అనునామె “అళియపడైతాంగి” అను పట్టణమందు నివసిస్తుండెనని తెలియుచున్నది. రాయలుకు మోహనాంగి అను కుమార్తె ఉండెను. ఆమె గొప్ప విదుషీమణి, మరియు కవయిత్రి “మారీచి పరిణయ”మను గ్రంథము వ్రాసెను. ఆమెకు సంతానము లేదు. నిండు యౌవ్వనంలో వైవిధ్యం సంభవించినది. భర్తతో సహగమనం చేసినది – ఒకసారి తన గ్రంధమును రాయలు నిండు కొలువులో సమీక్ష జరుపుతుండగా అచట మారు వేషములోనున్న తెనాలి రాలింగ కవి ఆమెను పరిహసించెను. అవమానంతో ఆమె సభనుండి వెళ్లిపోయెను. రాయలు కోపించి అతనికి మరణదండన విధించెను. రామలింగకవి రాయలు పాదములపై పడి చరణు జొచ్చెను. క్షమించి తన ఆస్థానంలో చేర్చుకొనెను.
రాయలు భార్య సుభద్ర (ప్రతాపరుద్ర గజపతి కుమార్తె) :
గోపన్న మంత్రి కృష్ణరాయలు ప్రముఖ దండనాయకులలో ఒకడు. మహామంత్రి తిమ్మరసు కుమార్తెను పెండ్లాడిన నాదెండ్ల అప్పయ మంత్రి తమ్ముడు, కొండవీటి దుర్గమునకు అధికారి. సంస్కృతాంధ్ర కవి.
మంగళగిరి శాసనములలో గోపన్న గజపతి కుమార్తెను గురించి వ్రాసిన శ్లోకములో
శ్లో॥ ప్రతాపరుద్ర స్వగజాధిపస్య
పుత్రీ పవిత్రీకృత భూత ధాత్రీం
ప్రత్యగ్రహీద్యః ప్రకట ప్రతాపో
భద్రాం, సుభద్రా మివ పాండవేయః
పై శ్లోకములో గోపన పాండవ మధ్యముడైన అర్జనుడు సుభద్రను పెండ్లి యాడినట్లే క్రిష్ణరాయలు ఈ సుభద్రను పెండ్లి యాడెనని కవి చెప్పియున్నారు. చాలామంది కవులు ఆమె పేరు – తుక్కాదేవి, జగన్మోహిని, వరదరాజమ్మ, లక్ష్మి, లుక్కదేవి, సుభద్ర, భద్ర, అని పేర్లుండినట్లు చెప్పారు. కాని ఒకే మనిషికి ఇన్ని పేర్లు ఏ చరిత్రలోనూ, ఎవరికి లేవు.
కళింగయుద్ధము జరిగి, వివాహము ముగిసిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత కాపురము చేసుకుంటున్నప్పుడు గోపన మంత్రి ఆ శ్లోకము వ్రాశాడు. రాయలును ఇష్టపడి వివాహమాడిన గజపతి కుమార్తె గూడా ఇంకొకామె గలదు. మరి ఈ పేర్లలో ఆమెగూడా ఉందేమో తెలియదు. తుక్కాదేవి అయి ఉంటుంది.
ఒరిస్సా (కళింగ) దేశములోని “కటకం” పాలిస్తున్న సూర్యవంశ కపిలేశ్వర గజపతి కుమారుడు పురుషోత్తమ గజపతి తండ్రి అనంతరం క్రీ.శ.1470 నుండి 1497 వరకు రాజ్యమేలెను. బలపరాక్రమ సంపన్నుడు సంస్కృత భాషలో గొప్ప పండితుడు. కవి, రసికుడు కవి పండిత పోషకుడు. వీరు యింటిపేరు మిరియాలవారు (క్షత్రియబలిజ) విశ్వంబరుడు, కుమారులు గణపతి దేవుడు నరపతిదేవ, విశ్వంభరదేవ, బాల భాస్కర దేవ – కొండవీటి కైఫీయత్తు 26 పేజి వ్రాసిన వారు (పెదనాగదేవభట్టు).
ఒకప్పుడు కాంచీపురం పాలిస్తున్న చోళ బలిజరాజు కుమార్తె మహా సౌందర్యవతి అని విని పురుషోత్తమ గజపతి ఆమె తనకిమ్మని విలువగల కానుకలతో రాయబారులను పంపెను. దానికి కంచిరాజు నేను శైవుడను నీవు వైష్ణవుడవు అందునా మీ పూర్వులు పూరి జగన్నాథ దేవాలయములో ఊడ్చేవారు (పాకీవాడు) గా నుండి కాలము కలిసి వచ్చి రాజ్యపాలకులైనారు. కాబట్టి అన్యమతస్థులకు నేను మా అమ్మాయిని ఇవ్వనని కచ్చితంగా చెప్పాడు. అందుకు కోపించి పురుషోత్తమ గజపతి కంచి పైకి దండెత్తి ఓడిపోయాడు. తర్వాత మరలా దండెత్తి విజయం సాధించి కంచిరాజు కుమార్తె రూపవతీదేవిని బలవంతంగా ఎత్తుకొనివచ్చి తన మంత్రికి చెప్పి ఈమెను ఒక పాకీవానికిచ్చి చేయండని ఆజ్ఞాపించాడు. ఆవృద్ధ మంత్రి తెలివిగా వారింటిలోనే వుంచుకొని కాపాడుచుండెను. ఆ సంవత్సరం గడిచింది. మరుసటి సంవత్సర జగన్నాథ స్వామి రథోత్సవము వైభవంగా జరుగుచున్నప్పుడు తరతరాల వంశాచారము ననుసరించి పురుషోత్తమ గజపతి రధము ముందు సామాన్య సేవకుడి వలె నిలబడి రధము వెళ్లు వీధిని చీపురుతో ఊడ్చుచుండెను. అది తగిన సమయమని గ్రహించి ఆ మంత్రి ఇంట్లో ఉన్న సౌందర్యరాశియగు రూపవతిదేవిని తీసుకొని వచ్చి చక్రవర్తి ప్రక్కన నిలువబెట్టి, అతడు పాకీపని చేయుచుండినందున ప్రతిజ్ఞ ప్రకారము ఆమెను వివాహము చేసుకోండని ప్రార్థించాడు. పురుషోత్తమ చక్రవర్తి తన తప్పును తెలుసుకొని ఆమెను వివాహము చేసుకున్నాడు. ఆ దంపతులు కుమారుడే ప్రతాపరుద్ర గజపతి. ఈవిషయం ఒరిస్సా దేశపు చరిత్ర గ్రంథములో రసవత్తరంగా చెప్పబడింది. కొందరు పురుషోత్తమ గజపతి మరొక భార్య పద్మావతిదేవి కుమారుడై ఉండునని చెప్తారు. ప్రతాప రుద్ర గజపతి మొదటిపేరు ప్రతాప జనముని తర్వాత సింహాసనముకు వచ్చిన పిదప ప్రతాప రుద్ర చక్రవర్తి అయ్యెను.
క్రిష్ణరాయలు భార్య కొండమాంబ :
కీ.శే. మెకంజి దొర సేకరించిన “ముప్పిన తొట్టి కోయిల్ కైఫీయత్తు” అను గ్రంథమును టి.వి. మహాలింగంగారు ప్రకటించారు.
తెలుగు (కఠారి) సాంబవరాయలు పాలేటి గట్టుననుండు విరంచిపురము ముఖ్య పట్టణము. ఇది రాయవేలూరుకి పడమట ఎనిమది మైళ్ళ దూరమునందు కలదు. పడైవీడు ఆరాజులకు బలిష్టమయిన దుర్గము. ఇది “రాజగంభీర” మను పర్వతంపై కలదు. ఈ కైఫీయత్తులో క్రిష్ణరాయలుకు కొండమాంబ అను భార్య కలదని తెలుస్తుంది.
End
Sri Krishnadevaraya Family
Learn about Sri Krishnadevaraya Family History in Telugu, exploring his royal lineage, legacy, and contributions to the Vijayanagara Empire.
sri krishna devaraya family history in telugu | sri krishna devaraya history telugu | tuluva family history in telugu
Leave a Reply