తూర్పు కాపు దేవత సన్యాసమ్మ తల్లి కథ - Sanyasamma Katha

Explore the inspiring tale of Sanyasamma, a powerful Telugu story that highlights courage, sacrifice, and resilience rooted in cultural tradition.

తూర్పు కాపు దేవత సన్యాసమ్మ తల్లి కథ - Sanyasamma Katha
Sanyasamma Katha

తూర్పు కాపు దేవత సన్యాసమ్మ తల్లి కథ - Sanyasamma Katha

నాటి వుమ్మడి విశాఖ జిల్లా, ఎలమంచిలి తాలూకా, దివిలీపట్టణమందు ఆంగ్లేయ పాలకుల కాలంలో తూర్పు దేశం (ఈస్ట్ ఇండియా)లో భాగమైన నేటి ఉత్తరాంధ్ర లేదా కళింగాంధ్ర ప్రాంతంలో జరిగిన ఒక జానపద గాధ.
కాపు రాజులుగా, మాన్యరాజుల (గంగభూపతిలు) వారుగా కీర్తించబడిన, గోషగలిగిన గాజులుకాపు (గాజులవనిజులు) కులంలో 170 గ్రామాల మోఖాసాదారులైన గురి పెళ్ళ వారింట దాలినాయుడు, లక్ష్మీదేవి దంపతులకు ఏడుగురు అన్నల తోడ ఎనిమిదవ సంతానంగా సన్యాసమ్మ జన్మించినది. ఆమె జన్మించిన మూడు మాసములకు తల్లి అనారోగ్యంతో మరణించినది. తండ్రి మారుమనువు చేసుకుని సన్యాసమ్మను పట్టించుకోవడం మానివేశాడు. అది గమనించిన సన్యాసమ్మ పెద్దన రామినాయుడు, పాపమ్మ దంపతులు సన్యాసమ్మను కన్న కూతురివలె అల్లారుముద్దుగా పెంచసాగారు. వీరి మేనత్త దాలమ్మను అగ్రహారమున సానిపల్లి వారి ఇంట ఇచ్చి ఉన్నారు. ఆమెకు ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు కలరు. అందు పెద్దవాడు రామినాయుడుకు చిన్నవాడు అప్పన్నకు వివాహము జరిపించి ఉన్నది చాలమ్మ. నడిమి వాడు చెంచునాయుడు చదువు కొనసాగించుట చేత వివాహము జరుపలేదు. అయితే అగ్రహారమున కొందరు దిమిలికోట నందు బాలికగా ఉన్న సన్యాసమ్మను చూచిన వారు మాన్యాలు ఏలు మాన్యరాజుల వారింట పసిడి మేని చాయతో నిండు చంద్రుని పోలి బాల వున్నదని ఆ సన్యాసమ్మను గూర్చి వారు అనుకొనుచుండగా ఆ మాటలు విన్న చెంచునాయుడు, తల్లి దాలమ్మ వద్దకు వెళ్లి తన మేనమామ కూతురైన సన్యాసమ్మను వివాహమునకు నిశ్చయము చేసుకొని రమ్మంటాడు. అందుకు దాలమ్మ తన వదిన లక్ష్మీదేవి చనిపోయినప్పుడు వారు కబురు పంపినను వెళ్లని కారణంగా వారు ఈ వివాహమునకు అంగీకరింపరని నచ్చ చెప్పినను చెంచునాయుడు వినకుండుటతో తన పుట్టినిల్లు అయిన దిమిలికోటకు ప్రయాణమై వెళుతుంది. దిమిలికోటకు చేరిన దాలమ్మ తన అన్న దాలినాయుడు వద్దకు వెళ్లి తాను వచ్చిన విషయము తెలియజేయగా... అది విన్న దాలినాయుడు సన్యాసమ్మను తాను పెంచుట లేదని పెద్దకొడుకు రామినాయుడు పాపమ్మదంపతులు పెంచుకొనుచున్నారని వారినే వెళ్లి అడగమని చెప్పెను. అప్పుడు దాలమ్మ రామినాయుడు వద్దకు వెళ్లి అడగగా రామినాయుడు మొదట అంగీకరింపకున్నా.. చెంచునాయుడు మంచి గుణగణాలు కలవాడని, సంస్కారవంతుడని, పెద్దల యెడల గౌరవభావం కలిగిన వాడని విని ఉండుట చేత వివాహమునకు అంగీకరిస్తాడు. అయితే సన్యాసమ్మ బాలిక అయినందున ఆమెకు ఈడు వచ్చిన పిదప కాపురమునకు పంపేదమని ఒప్పందమున వివాహము జరిపించినారు.
కొన్ని రోజులకు మోఖాసాగ్రామముల నుండి లేఖలు రావడంతో రామినాయుడు తన ఆరుగురు తమ్ముళ్ళతో బయలుదేరి వెళుతూ తన భార్య పాపమ్మను పిలిచి తమ గారాల చెల్లెలు సన్యాసమ్మను జాగ్రత్తగా చూచుకొమ్మని చెప్పి వారంతా వెళ్ళిపోతారు.బాలిక అయిన సన్యాసమ్మ వీధిలో గంగిరెద్దులు ఆటలు జరుగుతుంటే వాటిని చూసేందుకు తన వదిన పాపమ్మను అడుగగా.. గోష గల మన ఇండ్ల ఆడవారు అంగళ్లకు పోరని మీ అన్నకు తెలిసిన మమ్ము బ్రతకనీయడని చెప్పినను వినకుండా వీధి అంగళ్ళకు నేను పోను మన ఇంటి అరుగుపై నుంచొని చూచెదనని బ్రతిమలాడి ఒప్పించి వెళుతూ తన పినతల్లి కొడుకు అయిన అప్పన్నను ఎత్తుకొని వెళ్ళి గంగిరెద్దులాటను చూస్తూ ఉంటుంది. గంగిరెద్దులను చూచి బెదిరిన అప్పన్న ఏడవడంతో అది విని పినతల్లి పరుగున వచ్చి సన్యాసమ్మ సంకన ఏడుస్తున్న బిడ్డను చూచి లాక్కుంటూ పెళైనదానవు మెట్టినింటకు పోక మాకు దాపురించినావని శాపనార్థలతో అనరాని మాటలు అంటూ తిడుతుంది. ఆ శాపనార్ధాలకు సన్యాసమ్మ బాధపడుతూ పుట్టింట ఉండబట్టే ఇటువంటి శాపనార్ధాలు పడవలసి వస్తుందని పెళ్లయిన దానను మెట్టినింట ఉండటమే మంచిదని భావించి మోకాసాల నుండి తిరిగి వచ్చిన తన పెద్దన్న రామినాయుడుకు తనను మెట్టినింట దిగనాడమని పట్టుబడుతుంది. ఏమి జరిగిందో వివరించమని ఎంత బ్రతిమాలి అడిగినా సన్యాసమ్మ చెప్పకపోవడంతో రామినాయుడు చేసేదేమీ లేక మెట్టినింటికి పంపేందుకు ఒప్పుకుంటాడు. ఏడువారాల బంగారు నగలు, 24 మోకాస గ్రామాల హక్కు పత్రాలును, రంగుకు ఏడు చొప్పున పట్టు చీరలు, నూరు బండ్ల సారి సామానులు ఇచ్చి సన్యాసమును వెంటబెట్టుకొని అగ్రహారమున మేనత్త దాలమ్మ ఇంటికి చేరుకుంటాడు.
సన్యాసమ్మ అగ్రహారమున ఒక మేడ కట్టించి ఇమ్మని అన్న రామినాయుడిని కోరగా... వెంటనే రామినాయుడు తన తమ్ముళ్ళకు కబురు పంపి కావలసిన ధనమును, నౌకర్లను తీసుకునిరమ్మనగా... వారు నౌకార్లను తీసుకుని వచ్చి దగ్గర ఉండి మేడ నిర్మాణము పూర్తయిన తర్వాత వారంతా దిమిలికోటకు వెళతారు. సన్యాసమ్మ మెట్టినింటికి వచ్చిన కొన్ని ఏండ్లకు చదువు పూర్తిఐన చెంచన్న తన సహచరులతో ఈస్ట్ ఇండియా కంపెనీ నందు కొలువు చేయాలనే కోరికతో మచిలీపట్నం బయలుదేరుతాడు. ఆ విషయం తెలుసుకున్న ఇంటిలోని వారంతా వేరొకరి వద్ద కొలువు చేయడం మన వంటి కాపురాజులకు తగదని నీ భార్య తీసుకువచ్చిన 24 మొఖాస గ్రామాల మాన్యాలను ఏలుకోమని అందరూ నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తారు. వారు ఎంత చెప్పినా వినకుండా కొన్ని రోజులు సరదాగా వెళ్లి కొలువు చేసి వస్తానని బయలుదేరి మచిలీపట్నం వెళతాడు. మచిలీపట్నంలో దొరలు చెంచన్నను చూచి నీవు ఎవరు? ఏ జాతి వాడు చట నుండి రాక? అని అడగగా..... అందుకు చెంచునాయుడు తాను అగ్రహారం నుండి వచ్చినానని గంగభూపతులు, కాపురాజులని పిలవబడు గాజులకాపు కులజడను, సానిపల్లి వారి ఇంట పుట్టితిని, మీ వద్ద కొలువు చేయ మక్కువతో వచ్చాను అని చెబుతాడు. అప్పుడు దొరలు చెంచన్నను వివిధ భాషల యందు, యుద్ధ విద్యల యందు పరీక్ష జరిపి అతని యొక్క నైపుణ్యమునకు సంతోషించి సైనిక పటాలమునందు పెద్ద బాజీ కొలువును ఏడు సంవత్సరములు చేయు విధముగా ఒప్పందము చేసుకుంటారు.
అగ్రహారమున కొన్ని ఏండ్లకు సన్యాసమ్మ ఈడేరుతుంది. అప్పటివరకు ఇంటిపని యందు వంతువేయని తోడుకోడళ్ళు సన్యాసమ్మకు వంతు వేయమని అత్త దాలమ్మను ఒత్తిడి చేస్తారు. అప్పుడు దాలమ్మ సన్యాసమ్మను పిలిచి నీ వంతు పని నీవు చేయమని చెప్పగా సన్యాసమ్మ చిన్ననాటి నుండి ఏ పనులు నేర్వని కారణంగా బాధపడుతూ తనకు ఆ పనులు చేతకావని, చేయలేనని తన అన్న రామినాయుడికి చెప్పి నౌకర్లను పంపించమంటానని అంటుంది. ఆ మాటకు అత్తదాలమ్మకు కోపం వచ్చి మాకంటే ధనవంతులు మీ పుట్టింటి వారని మమ్మలను అవమానిస్తున్నావా అని తెలియక అన్న చిన్న పిల్ల మాటలకు పగను పెంచుకుని నానా కష్టాలు పెడుతూ ప్రతి చిన్న విషయానికి అవమాన పరుస్తూ సాధించడం మొదలు పెడుతుంది. పాచి అన్నము, కూరలు పెడుతూ...సన్యాసమ్మ కట్టుకునే చీరలతోను, జడతోను ఇల్లును తుడిపిస్తూ... స్నానము చెయ్యనివ్వక పశువుల వద్ద కసువు తీయించుట చేత తన రూపలావణ్యములు కోల్పోతుంది సన్యాసమ్మ. ఇలా అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తూ... సన్యాసమ్మపై జాలితో సహాయము చేయ వచ్చిన వారిని కూడా ఇబ్బందులకు గురిచేస్తుంది దాలమ్మ. ఇలా జరుగుతుండగా ఒకనాడు మరిది అప్పన్నకు సన్యాసమ్మ ఎదురవడంతో వదినను చూసి ఆశ్చర్యపోయి ఏమి జరిగిందని అడిగి విషయము తెలుసుకుని బాధపడుతూ లోగిళ్ళకు పోయి బంగారు చెంబుతో పాలు తీసుకుని వచ్చి త్రాగమని వదినకు ఇస్తాడు అప్పుడు సన్యాసమ్మ నీ తల్లి చూచిన నన్ను ఎన్ని మాటలు అనునో వద్దని అంటుంది. అయినా అప్పన్న వినకపోవడంతో పాలు పుచ్చుకుంటుంది. త్రాగగా మిగిలిన పాలు పారవేస్తూ ఉండగా అప్పన్న పాలను వృధా చేయుట ఎందుకు తాను త్రాగేదనని అంటాడు. అందుకు సన్యాసమ్మ ఎంగిలి పాలు వద్దని చెప్పగా అప్పుడు అప్పన్న పెద్దవాని భార్యవు తల్లి సమము నీవు, మేనరికమున ఎంగిలి ఏమిటి వదినమ్మ అని మిగిలిన పాలు త్రాగి సన్యాసమ్మ మేడ నుండి బయటకు వస్తుండగా చూసిన దాలమ్మ అప్పన్నను పిలిచి ఆ మేడ యందు నీకేమీ పని వదినతో నీవు అక్రమసంబంధము నెరుపుతున్నావా అని నిందిస్తుంది. అప్పటికే వదిన పరిస్థితిని చూచి బాధతో ఉన్న అప్పన్నకు ఆ నింద విన్న వెంటనే కోపం పట్టలేక ములికర్రను చేత భూని తల్లిపై విరుచుకు పడడంతో తన అన్న రామినాయుడు వచ్చి అడ్డుకుంటాడు. అన్నదమ్ముల మధ్య వాగ్వాదము జరుగగా కొద్దిసేపటికి అప్పన్న కోపముతో గోశాలకు వెళ్ళిపోయేను. కొద్ది రోజులకు దాలమ్మ సన్యాసమ్మను సాధిస్తూ ఏలుతుంది అన్న విషయం ఊరి జనులందరికీ తెలుస్తుంది.
ఒకరోజు పార్వతీపురం సంతనందు అగ్రహారం గ్రామస్తులు కొందరు దారి యందు బస చేసి ఉన్న రామినాయుడిని చూసి 150 మొఖాసా గ్రామాల మాన్యాలు ఏలుతున్న గంగభూపతులు, మాన్యరాజుల వారు ఈ అన్నదమ్ములు, అట్టి వీరి తోబుట్టువును దాలమ్మ సాధిస్తున్నది అని అనుకుంటూ వెళుతుంటారు. అది విన్న రామినాయుని నౌకరు పరుగు పరుగున వచ్చి రామినాయుడుకు తెలియజేస్తాడు. పట్టలేనంతకోపంతో రామినాయుడు అన్ని గ్రామాల నాయుళ్లు(కాపులు), కరణాలను పిలిపించి తన చంద్రాయుధము చేతపట్టి తన తమ్ముళ్లతో అగ్రహారం బయలుదేరతాడు. అగ్రహారము ఏరు దాటిన పిదప నాయుళ్ళు, కరణాలు రామినాయుడుతో మనము ఇచ్చటనే ఉండి ఒకసారి నౌకర్లను పంపి విషయం తెలుసుకునుట మంచిదని లేదంటే మాట పడవలసి వస్తుందని చెప్పి నౌకార్లను పంపుతారు. విషయ సేకరణకు వెళుతున్న నౌకరులకు మార్గమధ్యలో తన రూపలావణ్యములు కోల్పోయిన సన్యాసమ్మ ఎదురవడంతో ఎవరో అని భావించి సన్యాసమ్మను గూర్చి ఆరా తీయగా తానేనని చెబుతుంది. వారు ఆశ్చర్యపోతూ సన్యాసమ్మను తీసుకొని రామినాయుడు వద్దకు వస్తారు. సన్యాసమ్మను చూచి మొదట పోల్చుకోలేకపోయిన అన్నలు పోల్చిన తదుపరి దుఃఖిస్తూ కోపముతో అగ్రహారమును తగలబెట్టి మీ అత్తింటి వారిని నరికి చంపుతామని వెళుతున్న అన్నలను ఆపి మీరు విన్నది అబద్ధము ఇంటి బాధ్యత అంతయు నాదై యుండుట చేత నేను ఇట్లా ఉన్నాను. నా మాటపై నమ్మకము లేక మీరు అగ్రహారమున అడుగుపెట్టిన తనను అవమానించినట్లేనని చెప్పి వారందరినీ సమాధానపరిచి తిరిగి పంపించి వేస్తుంది సన్యాసమ్మ. అంతటి మాట అన్న చెల్లెలు వైపు బాధతో చూచి రామినాయుడు చెల్లెలిపై ప్రేమతో తన మాట కాదనలేక వెనుతిరుగుతూ కొంత ధనమును ఇచ్చి తన పరివారంతో తిరిగి వెళ్ళిపోతాడు.
అన్నను పంపించి ఇంటికి చేరిన సన్యాసమ్మ చేతిలో ధనమును చూచి అత్తదాలమ్మ అక్రమ సంబంధంలను అంటగట్టి తిడుతుంది. అత్తతో పాటు ఆడపడుచులు పెద్ద తోటి కోడలు ఒక్కటై నిందించడంతో వారు పెట్టే ఆరళ్ళు ఇంకా ఎక్కువ కావడంతో తట్టుకోలేకపోయిన సన్యాసమ్మ తన అన్న కట్టించిన మేడకు వెళ్లి గది తలుపులు మూసుకొని తన ధ్యాన శక్తితో ఆత్మ రూపమున బందరు తన భర్త వద్దకు చేరి నిద్రిస్తున్న చెంచునాయుడుకి తన బాధను అంతా చెప్పుకోవడంతో నిద్ర నుండి తుళ్ళిపడి లేచిన చెంచన్న అది కలో నిజమో అర్థం కాక కలత చెంది మరునాడు దొరల వద్దకు వెళ్లి సెలవు తీసుకొని ఇంటికి బయలుదేరి వెళతాడు. ఇంటికి వచ్చిన చెంచన్నకు తల్లి దాలమ్మ సన్యాసమ్మ గురించి లేనిపోనివి చెప్పి ద్వేషం కలుగజేస్తుంది. అది విన్న చెంచునాయుడు కోపంతో సన్యాసమ్మ వద్దకు వెళతాడు. అక్కడ అందవిహీనంగా కురూపి వలే దీనావస్థలో ఉన్న సన్యాసమ్మను చూచి ఆశ్చర్యపోతూ అంతటి సౌందర్య రాసివి ఇటు లైతివేమని ప్రశ్నిస్తాడు. జరిగినదంతా చెప్పి సన్యాసమ్మ బోరున వినలపిస్తుంది. నిజము తెలుసుకున్న చెంచునాయుడు తన కొలువు సమయం తీరువరకు సన్యాసమ్మను కొన్ని రోజులు పుట్టింటికి వెళ్ళమని చెప్పగా తన పినతల్లి చేసిన అవమానం జ్ఞప్తికి వచ్చి తన ప్రాణమైన వదులుకొందును గాని పుట్టింటికి మాత్రం వెల్లబోనని అంటుంది. ఇక వేరు కాపురం పెట్టడం మంచిదని భావించిన చెంచునాయుడు తన వంతు ఆస్తిని పంచి ఇవ్వమని తన అన్న రామినాయుడు వద్దకు వెళ్ళి అడుగుతాడు. అయితే రామినాయుడు వాటా ఇవ్వనని చెప్పడంతో పంచాయతీ పెట్టిస్తాడు చెంచన్న. పంచాయతీలో వాగ్వాదము జరుగుతుండగా రామినాయుడు వుక్రోషంతో బారిక, దండాసి వాళ్ళని చెంచునాయుడు పై దాడి చేయమని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు చెంచునాయుడు తన వద్ద ఉన్న బాకును చేత భూమి అంతటి ధైర్యం గలవారు ముందుకు రావచ్చు అని అనగా జడిసిన భారిక, దండాసి వాళ్ళు అడుగు ముందుకు వేయక బిక్కచచ్చి వున్నచోటనే నిలిచి పోవుటతో రామినాయుడే చెంచన్న పై దాడి చేస్తాడు. అప్పుడు చెంచునాయుడు అన్నవైనా నీపై తిరిగి దాడి చేయ సంస్కారము అడ్డు వచ్చుచున్నది.
వీరులకు ప్రాణమనినా మక్కువ అనుకూంటివా ఇందరిలో నీవు చేసిన అవమానమునకు నా తెగువ చూడుము అని తన వద్ద ఉన్న కత్తితో పొడుచుకుని మరణిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సన్యాసమ్మ భర్త భౌతికకాయము వద్దకు చేరి ఎవరికోసం బతకాలో తెలియక బోరున విలపిస్తూ తన భర్తతోనే తానుకూడా సహగమనము చేయ నిర్ణయించుకుంటుంది. కానీ అట్టి ఆచారము నిషేధించి వుండుటచేత మరిది అప్పన్నను వెంటబెట్టుకొని మచిలీపట్నం దొరల వద్దకు వెళ్లి జరిగినది వారికి తెలిపి సహగమనం చేసుకునేందుకు గుండమునకు అనుమతి అడగగా అందుకు దొరలు ఈడు ఉన్నదానవు మారుమనువుకు వెళ్ళ వచ్చును కదా.. అని అంటారు. ఆ మాట విన్న సన్యాసమ్మ కోపోద్రేకంతో మా ఇండ్ల యందు అట్టి ఆచారము లేదు దొరగారు అని చెప్పి, మీ దొరలు చచ్చిన దొరసానులు ఏమి చేస్తారు దొరగారు ? అని ప్రశ్నిస్తుంది. అందుకు దొరలు తమకు ఏడు మనువులు చేయు ఆచారము కలదని, దొరలు చచ్చిన దొరసానులు మారుమనువు చేసుకొందురని సమాధానం చెబుతూ.... సహగమనం రద్దు చేసి ఉండుట చేత అనుమతి ఇవ్వడం కుదరదని అనుమతి కావాలన్నా తాము పెట్టిన పరీక్షలకు నీవు సత్యవంతురాలవై నిలవమని అప్పుడు తాము గుండమునకు అనుమతిస్తామని తెల్లదొరలు అంటారు. తన యొక్క పాతివ్రత్య శక్తులను ప్రదర్శించి వారు పెట్టిన పరీక్షల్లో నెగ్గి సహగమనం చేసుకునేందుకు అనుమతి పొంది దొరలను వెంటబెట్టుకుని తాను సహగమనం పొందు స్థలమునకు వచ్చి తనను చిన్ననాటి నుండి అల్లారుముద్దుగా పెంచిన వదిన పాపమ్మను పిలిపించి జరిగినదంతా చెప్పి తన అన్నకు ఈ విషయము తెలిసిన తట్టుకోలేడని కావున చెప్పవద్దని అంటుంది. కానీ ఈ విషయము ఆ నోట ఈ నోట రామినాయుడికి తెలుస్తుంది అది విన్న రామినాయుడు దుక్కిస్తూ గుండము వద్దకు చేరుకుంటాడు.
అప్పుడు రామినాయుడిని చూసిన సన్యాసమ్మ అన్నా, వదినలను ఓదారుస్తూ తాను గుండమునందు దూకిన ఏడు గడియలకు చెంచునాయుని బాకుని, తలపాగాను మీకు ఇచ్చెదనని వాటిని మీ పూజ గది యందు ఉంచి పూజింపమని ఆ పూజా ఫలము చేత తన భర్త చెంచన్న మీకు బిడ్డగా జన్మిస్తాడని చెబుతుంది. అదేవిధంగా మరిది అప్పన్న, సూరమ్మ దంపతులను పిలిచి పసుపు,కుంకుమతో నిండిన బరిణలనూ...,తన మైజారు వస్త్రమును ఇచ్చెదనని వాటిని పూజించగా ఆ పూజా ఫలము చేత మీ కడుపున నేను పుట్టేదనని, మీ ఇరు దంపతుల కడుపున మరుజన్మమున పుట్టిన మా ఇరువురికి వివాహము చేయమని మాట తీసుకుంటుంది. గ్రామ ప్రజలకు, దొరలకును అందరికీ నమస్కరించి గుండము నందు భర్తతో సహగమనము చేసిన ఏడు గడియలకు తను చెప్పిన విధముగా తన అన్న రామినాయుని దంపతులకు మరియు తన మరిది అప్పన్న దంపతులకు ఇచ్చెదనన్న వాటిని అందించింది సత్యవతి సన్యాసమ్మ. ఆ ఇరు కుటుంబములు వాటిని భక్తిశ్రద్ధలతో పూజించుచుండగా కొన్ని రోజులకు అన్నా వదినలకు మగ బిడ్డ పుట్టగా చెంచునాయుడని, మరిది అప్పన్న సూరమ్మ దంపతులకు ఆడబిడ్డ పుట్టగా సన్యాసమ్మ అని పేర్లు పెట్టుకుని వారిరువురికి అంగరంగ వైభవంగా వివాహం జరిపించి సకల సంతోషముతో శోభాయమానంగా వెలుగొందినారు. సన్యాసమ్మకు దిమిలి పట్టణమందు గుడిని నిర్మించి ప్రతి ఏడాది ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు.
ఒకప్పుడు సన్యాసమ్మ కధ ఎంతగా ప్రచుర్యంలో ఉండేదంటే ఉత్తరాంధ్రలో ప్రతీ ఇంటి నందు ఈ పుస్తకం వుండేది. అంతే కాకుండ ఆంధ్రదేశమంతటా ఈ కధ వ్యాప్తిలో ఉండేదని, కొన్ని గ్రామాలలో సత్యాసత్యముల నిర్ణయమునకు ఈ పుస్తకము పై ప్రమాణం చేయించేవారని అంతటి గొప్పదనం మరొక ఏ జనపద గాధకు లేదనడం అతిశయోక్తి కాదని, అంతటి భక్తి ప్రపత్తులు సన్యాసమ్మ పై ఆ నాటి ప్రజలు కలిగి ఉండేవారని ఈ గాద 1840-1845 మధ్య జరిగివుంటుందని జానపద గాదల పరిశోధకులు తెలిపారు.