Rajakiya Charitra Samajika Vishleshana

From 1931 to 2014, the major socio-political events were briefly summarized through a discussion and conversation between Chillagattu Sreekanth Kumar and Miriyala Venkata Rao.

Rajakiya Charitra Samajika Vishleshana
rajakiya charitra samajika vishleshana

రాజకీయ చరిత్ర - సామాజిక విశ్లేషణ

తెలుగునాట సామాజిక, రాజకీయ స్థితిగతులు మన సామాజిక వర్గ జీవన విధానాన్ని ప్రభావితం చేశాయి. కాపునాడు ఆవిర్భావానికి ఆ స్థితిగతులే ప్రధాన కారణమయ్యాయి. 1931వ సంవత్సరం నుండి 2014 వరకు జరిగిన సామాజిక రాజకీయ ముఖ్య సంగతులని మిరియాల వెంకట్రావుగారితో సంభాషిస్తూ, చర్చిస్తూ సంక్షిప్తం చేయడం జరిగింది. 2014లో వారి మరణానంతరం 2024 వరకు కూడా కొన్ని ముఖ్యాంశాలని పాఠకుల సౌకర్యార్థం ఒక సామాజిక రాజకీయ విశ్లేషకుడిగా నేను పొందుపరచడం జరిగింది. -చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్

1931వ సంవత్సరం నుండి నేటి వరకూ మొత్తం రాయలసీమ, తెలంగాణా, ఆంధ్రజిల్లాలన్నింటిలోను 100కి 32 మంది మన కులస్తులే ఉన్నట్లు 'జనాభా లెక్కలు' స్పష్టంగా తెలియజేస్తున్నాయి... “కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పుకాపు, మున్నూరు కాపు"లుగా ఆయా ప్రాంతాలలో వ్యవహరించబడే ఈ 'సామాజికవర్గం' యొక్క పేదరికాన్ని, వెనకబాటుతనాన్ని గుర్తించి 'బ్రిటిష్ ప్రభుత్వం' వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చింది, 'తెలుగు'లుగా వీరినందర్నీ ఒకే శీర్షిక క్రింద బి.సి. జాబితాలో చేర్చారు, ఆ విషయాన్ని 1915వ సం||లో “నోటి ఫికేషన్ నెం : 67"గా జారీ చేశారు. జారీ అయిన తేదీ 1915 జూన్ 15. 1919వ సంవత్సరం సెప్టెంబర్ 1వ తేది నుండి 'గ్రాంట్స్ ఇన్ ఎయిడ్' ఇస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.

1915వ సం|| నుండి 1950వ సం॥ వరకూ అంటే 35 సంవత్సరాల పాటు యావదాంధ్ర దేశంలోని కాపులు, తెలగలు, బలిజలు, తూర్పుకాపులు, మున్నూరు కాపులు 'వెనుకబడిన తరగతులు' గానే గుర్తించబడ్డారు... స్వాతంత్ర్యం వచ్చాక 'అధికారాన్ని' హస్తగతం చేసుకున్న అగ్ర కులాలు జనాభాలో అధిక సంఖ్యాకులుగా ఉన్న కాపు, తెలగ, బలిజల్ని ఆర్థికంగా, సామాజికంగా, పారిశ్రామికంగా, రాజకీయంగా ఎదగనీయకుండా అడ్డుకోవడంలో తొలి ప్రయత్నంగా భారతరాజ్యాంగం 1950వ సం||లో ఏర్పాటు కాగానే బి.సి. జాబితా నుండి మనల్ని తొలగించారు.

అంతే కాదు 1953 అక్టోబర్ 1వ తేదీన అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రు ఆంధ్రరాష్ట్రానికి ప్రారంభోత్సవం చేస్తే ప్రకాశంపంతులుగారు ముఖ్యమంత్రి, నీలం సంజీవరెడ్డి ఉపముఖ్యమంత్రికాగా తెన్నేటి విశ్వనాథం, ఎస్.బి.పి. పట్టాభిరామారావు, కడప కోటిరెడ్డి, దామోదరం సంజీవయ్య, పి.తిమ్మారెడ్డి మంత్రులుగా మంత్రి మండలి ఏర్పాటైంది. ఈ మంత్రి మండలిలో మనకు చోటు లేదు, తర్వాత జరిగిన 'మంత్రివర్గ విస్తరణ'లోనూ స్థానం లభించలేదు.

1952వ సం||లో అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నుండి రొక్కం లక్ష్మీ నరసింహందొర, పాతపట్నం నుండి లాపు లక్ష్మణదాసు, పెద్దాపురం నుండి తోట రామస్వామి, మదనపల్లె నుండి దొడ్డా సీతారామయ్య, ఆర్మూరు నుండి జి. రాజారామ్, పాలకొండ జనరల్ నుండి పాలవలస సంగం నాయుడు. అలంపురం నుండి పసల సూర్యచంద్రరావు వంటి దిగ్గజాలు గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

వీరిలో గడ్డం రాజారామ్ సోషలిస్ట్ పార్టీ అభ్యర్ధిగా, పసల సూర్యచంద్రరావు. కె. ఎం.పి. పార్టీ అభ్యర్థిగా, దొడ్డా సీతారామయ్య సి.పి.ఐ. అభ్యర్థిగా గెలవగా మిగతా వారంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా గెలిచినా వీరికెవ్వరికీ మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదు. 1955వ సం॥లో మధ్యంతర ఎన్నికలు జరిగి ప్రకాశం పంతులు స్థానే డా॥ బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రిగా, నీలం సంజీవరెడ్డి ఉపముఖ్యమంత్రిగా కళావెంకట్రావు, గౌతు లచ్చన్న, ఏ.బి. నాగేశ్వరరావ్, నీరుకొండ రామారావు ప్రభృతులు మంత్రులైనా 'కాపు'లకు మంత్రి మండలిలో చోటు కల్పించకుండా 'రొక్కం లక్ష్మీ నర సింహం దొర'ను మాత్రం శాసనసభ స్పీకర్ గా నియమించారు, లోగడ 1953 నుండీ 55 వరకూ సోషలిస్ట్ పార్టీ నేత అయిన పసల సూర్యచంద్రరావుని మాత్రం శాసనసభకు డిప్యూటీ స్పీకర్ గా నియమించారు.

1955వ సం॥ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రొక్కం లక్ష్మీనరసింహందొర, లుకలాపు లక్ష్మణదాసు, డి.వి. సుబ్బారావు, పర్వతగుర్రాజు, మల్లిపూడి పల్లంరాజు, జి. వెంకటరెడ్డి నాయుడు, ఎ. సత్యనారాయణమూర్తి, నాచు వెంకట రామయ్య, జవ్వాది లక్ష్మయ్య నాయుడు, కమ్మిలి అప్పారావు, పి. పమిడేశ్వరరావు, కె.వి. రమణయ్యనాయుడు, మేడూరి నాగేశ్వరరావు, పోతురాజు పార్థసారథి, పూల వెంకట రమణప్ప, బండారు రత్న సభాపతి, వంటి దురంధరులు గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టినా వీరిలో ఏ ఒక్కరికీ మంత్రి మండలిలో 'స్థానం' లభించలేదంటే ఆది నుండీ కాపు, తెలగ, బలిజ, తూర్పు కాపు, మున్నూరు కాపులకు జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకోవచ్చు.

తర్వాత డా॥ బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డిల మధ్య పోరు మొదలై నీలం సంజీవరెడ్డి 'ఆంధ్రప్రదేశ్'కు ముఖ్యమంత్రి కావడం జరిగింది, ఈయన మంత్రివర్గంలో ఒకే ఒక్క తెలగా కాపుకు మంత్రి పదవి లభించింది, ఆయన 'గ్రంథి వెంకటరెడ్డి నాయుడు'. వీరిలో ఎంతోమంది 1950వ సం||లో బి.సి. జాబితా నుండి కాపుల్ని తొలగించిన నాటి నుండీ 1960వ సం॥ వరకూ తిరిగి కాపుల్ని, తెలగల్ని, బలిజల్ని, తూర్పు కాపుల్ని, మున్నూరు కాపుల్ని ఒకే శీర్షికగా వెనుకబడిన తరగతులలో చేర్చాలని ఎన్నోసార్లు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు, అయితే ఆ సమయాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్న డా॥ బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి ఇరువురూ తమకేమీ పట్టనట్టు నిశ్శబ్దాన్ని ఆశ్రయించారు...

1960వ సం|| జనవరి 10వ తేదీన 38 ఏళ్ళ చిన్న వయస్సులోనే దామోదరం సంజీవయ్యగారు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన భారతదేశంలోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి. దామోదరం సంజీవయ్యగారి మంత్రి మండలిలో 'కాపులు' నుండి మల్లిపూడి పల్లంరాజుగారికి స్థానం లభించింది. దామోదరం సంజీవయ్యగారి పరిపాలనా కాలంలో జరిగిన అతి ముఖ్య పరిపాలనా విశేషం “హరిజన, గిరిజన కులాలకు సంబంధించిన ఉత్తర్వును జారీ చేయడం. శతాబ్దాల తరబడి అట్టడుగున ఉన్న హరిజన, గిరిజనులకు కేటాయించిన ఉద్యోగాలలో తగిన అభ్యర్థులు లభించనప్పుడు ఆ ఖాళీలలో ఓ.సి.లను నియమించేవారు. ఈ ఉత్తర్వు ద్వారా ఆ పద్ధతికి స్వస్తి పలికి హరిజన గిరిజనులకు కేటాయించిన ఉద్యోగాలను తగిన అభ్యర్థులు లభించేంతవరకు ఖాళీగానే ఉంచాలని నిర్ణయిస్తూ ఉత్తర్వు జారీ చేశారు, అంతేగాక వెనుకబడిన కులాల జాబితాలో రాయలసీమలోని బలిజలు, సర్కారులోని తెలగలు, కాపులు, తెలంగాణాలోని కాపులు చేర్చబడ్డారు, దీనిని సవాల్ చేస్తూ కొన్ని అగ్రకులాలు హైకోర్టులో కేసు వేశారు.

1961వ సం|| అక్టోబర్ 14వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం కాపుల్ని, తెలగల్ని, బలిజల్ని, మున్నూరు కాపుల్ని, బి.సి. జాబితాలో చేరుస్తూ జి.వో. నెం. 3250గా జారీ చేశారు, 1966వ సం॥వరకూ కోర్టులో కేసు నడిచింది.

1962 మార్చిలో రెండవ సారి ముఖ్యమంత్రి అయిన నీలం సంజీవరెడ్డి తన మంత్రివర్గంలోకి మల్లిపూడి పల్లంరాజుని తీసుకున్నారు, అయితే తనకేమీ తెలియనట్లు 'కోర్టుకేసు'ని కాపులకి వ్యతిరేకంగా ఎగదోశారు, 1964 ఫిబ్రవరిలో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి అయినా శాసనసభా పక్షం కాంగ్రెస్ నాయకుడుగా నీలం సంజీవరెడ్డి కొనసాగారు, రాజీనామా చెయ్యలేదు.

బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో కాపుల నుండి ఈసారి 'తోట రామస్వామి' గారికి స్థానం లభించింది. అయితే 1966వ సం॥లో కాపు, తెలగ, బలిజల్ని వెనుకబడిన తరగతుల నుండి తొలగించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో కాపు, తెలగ, బలిజలు హతాశులయ్యారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని తూర్పు కాపులు, తెలంగాణా జిల్లాల్లోని మున్నూరు కాపులు మాత్రమే వెనుకబడిన తరగతుల జాబితాలో స్థానం పొందారు...

ఒక కులం సామాజికంగా 'విద్య'పరంగా వెనుకబడి ఉంటే ఆ కులాన్ని వెనుకబడిన కులంగా బి.సి.గా గుర్తించాలని రాజ్యాంగం నిర్దేశించింది, మిగతా అగ్రకులాలతో పోలిస్తే కాపు, తెలగ, బలిజల్లో అక్షరాస్యత చాలా తక్కువేగాక ఆర్థికంగా కూడా ఎంతో వెనుకబడి ఉన్న కులం కాపు తెలగ బలిజ కులమే. 1966వ సం|| నుండీ ఇప్పటి వరకూ అంటే 60 సం||ల పైబడి మనల్ని వెనుకబడిన తరగతులలో చేర్చడానికి ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు జరిగినా తీరని అన్యాయం జరుగుతూ వస్తుందనేది ఎవ్వరూ కాదనలేని పచ్చి నిజం.

ఉభయగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఆర్థికంగా, సామాజికంగా ఒక స్థాయికి చెందిన కొద్దిమంది కులస్తుల్ని చూసి మొత్తం ఈ కులమంతా రాష్ట్ర వ్యాప్తంగా ధనిక కులమే అనుకుంటే అది పెద్ద పొరపాటే అవుతుంది... కాపుల్ని వెనుకబడిన తరగతుల్లో చేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు, వినతి పత్రాలు అందించిన ప్రతిసారీ, పోరాటాలు ఉద్యమ రూపం దాల్చినపుడూ ఒక మురళీధరరావ్ కమీషన్, ఒక పుట్టస్వామి కమీషన్ వేయడం, “కమీషన్ నివేదికల్ని" వెల్లడి చేయకుండా దాచిపెట్టడం, అవసరమైతే ఏకంగా మాయం చేసెయ్యడం వంటి చర్యలు కాపుల్ని, తెలగల్ని, బలిజల్ని వెనుకబడిన తరగతులలో చేర్చి తీరాల్సిన అంశాన్ని పదే పదే విడమరచి చెప్పినట్టైతోంది.

ఆంధ్రప్రదేశ్లో సంతకం చేసేవారితో సహా అక్షరాస్యత 50% మించనేలేదు, ఈ మొత్తం అక్షరాస్యులలో మన అక్షరాస్యత 5% మించిలేదు, ఉద్యోగస్తుల సంఖ్యా అంతంత మాత్రమే. శూద్రులలో అగ్రకుల శూద్రులు రెడ్డి, కమ్మ, వెలమ కులస్తులు.. అగ్రకుల శూద్రులకు క్రిందిగా, వెనుకబడిన తరగతులలో కాస్త పైగా కనిపించేది కాపు, తెలగ, బలిజ కులమే. అగ్రకుల శూద్రులైన రెడ్డి, కమ్మ, వెలమ కులాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, పారిశ్రామికంగా వారి వారి వాటాల్ని వారి 'జనసంఖ్య' కంటే ఎన్నో రెట్లు అధికంగా గణనీయంగానే చేజిక్కించుకున్నారు...

ఒక్కసారి మీ చుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా పరిశీలించండి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, రియల్ ఎస్టేట్, సినిమా, ట్రాన్స్పోర్ట్, మెడికల్, ఎడ్యుకేషన్, సాఫ్ట్వేర్, పారిశ్రామిక రంగం, హోటల్, వైన్షాపులు, ఆఖరికి స్వీటాపులు, షూ మార్టులు, ఆటోమోబైల్, బట్టలకొట్లు ఏమైనాసరే రెడ్డి, కమ్మ, వెలమ, క్షత్రియ కులాలవారే 99% ఆక్రమించుకుని సమాజంలోని అన్ని కులాల నుండీ వ్యాపారాన్ని లాక్కుని అభివృద్ధి చేసుకున్నారు, ఆర్థికంగా ఎదగడానికి ఏ ఒక్క అవకాశాన్నీ వారు వదులుకోలేదు, పైన పేర్కొన్న ఏ రంగంలోనైనా సరే ఠక్కున కాపులుగానీ, ఇతర వెనుకబడిన తరగతులుగానీ, దళితులు, గిరిజనులు, ముస్లిం మైనార్టీలుగానీ శాసించే స్థాయిలో ఉన్నారా? అని ఆలోచిస్తే వచ్చే సమాధానం 'లేదు' అని..

ఈ నేపథ్యంలో కాపులు, తెలగలు, బలిజలు సామాజికంగా ఏయే వృత్తుల వ్యాపకాల్లో ఉన్నారో పరిశీలించి చూస్తే వ్యవసాయ కూలీలుగా కమతం పనులు చేయడం, గాజుల మలారాలు తగిలించుకుని గాజులు అమ్మడం, బొమ్మలు అమ్మడం, గిల్టు నగలు తయారు చేయడం, పండ్లు పూలు అమ్మడం, కిళ్ళీ కొట్లు నడపడం, సైకిళ్ళు అద్దెకివ్వడం, ఆటోరిక్షాలు నడపడం, హోటళ్ళలో సప్లయర్లుగా చెయ్యడం, సెక్యరిటీ గార్డులుగా జీవించడం, సినిమా థియేటర్లలో గేట్ కీపర్లుగా పని చెయ్యడం, వారపు సంతల్లో చిల్లర వ్యాపారాలు చెయ్యడం, టైలర్లుగా జీవించడం, లారీ డ్రైవర్లుగా, క్లీనర్లుగా పన్జెయ్యడం, పెయింటర్లుగా, ఎలక్ట్రిషియన్లుగా, గ్యారేజ్లల్లో మెకానిక్లుగా బతుకు బండి వెళ్ళదీయడం, ప్లీడరు గుమాస్తాలుగా, ప్రైవేటు స్కూళ్ళలో అటెండర్లుగా, షాపింగ్ మాల్స్ సేల్స్ బాయ్స్గా, మెస్లలో వంటవారిగా.. ఇలా ఏ ఒక్క వృత్తైనా, వ్యాపకమైనా 'భద్రత' ఉన్నది కానే కాదు.

సంఖ్యాపరంగా గణనీయమైన జనాభా కలిగి ఉండి “రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేసే నిర్ణయాత్మక ఓటర్లు”గా, అన్ని రాజకీయ పార్టీలకూ కాపు, తెలగ, బలిజల శక్తి సామర్థ్యాలు తెలుసు, అయితే 'రాజ్యాధికారం' దరి చేరని కారణంగా అటు శాసించే స్థాయినీ అందుకోక, ఇటు వెనుకబడిన తరగతులలోనూ స్థానం లేక మధ్యన ఉనికి కోసం దినదిన పోరాటం చెయ్యాల్సిన పరిస్థితి...

కాపులు, తెలగలు, బలిజలు అన్ని రాజకీయ పార్టీలలోనూ శాసించే స్థాయి నాయకులుగా ఎదగాల్సిన అవసరం ఇప్పుడు తక్షణ చర్యగా జరగాల్సిన సమయం ఆసన్నమైంది. పదవిలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు కాపు, తెలగ, బలిజ ప్రతినిధులు 'నిబంధనలననుసరించి' ఎంతో నిబద్ధతతో వ్యవహరిస్తారు, కులస్తులను కలుసుకోవడం, 'కులం' పేరు ప్రస్తావించడం 'పాపకార్యంగా' భావిస్తారు, పదవి లేకున్నా, అధికారం కోల్పోయినా వెంటనే వీరు జపించేది 'కులమే.' అసలు వీరికి పదవులూ, అధికారాలూ వచ్చి చేరేది, వీరు సాధించుకునేదీ 'కులం' ప్రాతిపదిక మీదుగానే....

ఈ సందర్భంగా కాపు ప్రజాప్రతినిధులు సభలకు, సమావేశాలకు వస్తే విన్పించే ప్రసంగాలలో “అన్ని కులాలతో సఖ్యతగా మెలగండి, సోదరభావాల్ని పాటించండి” అని... 'కమ్మ' కులానికి చెందిన మాజీ కేంద్రమంత్రిణి దగ్గుబాటి పురంధీశ్వరిగారు అమీర్పేట కమ్మ సంఘం హాలులో జరిగిన మేడసాని మోహన్ సన్మానసభలో ప్రసంగిస్తూ “కమ్మ కుల అభివృద్ధికి తను ఏం చేయమన్నా చేస్తానని, వీలైతే ఆజ్ఞాపించండని" కేంద్రమంత్రి హోదాలో సెలవిచ్చారు.... కేంద్ర మంత్రి హోదాలో ఉన్న కాపుల వరకూ అబ్ఖర్లేదు, 'కార్పొరేటర్' స్థాయిలో ఉన్న కాపులెవ్వరైనా తమ 'నాయకుడి' ఆగ్రహానికెక్కడైనా గురౌతామోనని బాహాటంగా అభిమానాన్ని ప్రదర్శించడానికి జంకడం అందరికీ అనుభవమే. కొంతమంది కాపు, తెలగ, బలిజ, తూర్పుకాపు, మున్నూరు కాపు ప్రజా ప్రతినిధులైతే కాపునాడు, ఇతర అనుబంధ విభాగాలు ఎప్పుడైనా సాంస్కృతిక కార్యక్రమాలకు ఆహ్వానించినా, వన భోజన మహోత్సవాలకు స్వాగతించినా 'ముఖం' చాటేసిన సందర్భాలు కోకొల్లలు... ఈ నేపథ్యంలో వెనుకబడిన తరగతులలో కాపు, తెలగ, బలిజల చేరిక ప్రశ్నార్థకం అవుతోంది. ఇటువంటి కొంతమంది వల్ల ఇతర కులాల్లో మనపై 'చులకన భావం' ఏర్పడ్డంలో వింతేముంది?!

'కాపులు రాజ్యాధికారం' అందుకోవాల్సిన విషయాన్ని గురించి ప్రముఖ సోషలిస్టు నేత 'రామ్ మనోహర్ లోహియా' ఆంధ్రప్రదేశ్కు వచ్చిన ప్రతిసారీ వ్యాఖ్యానించడం, రాష్ట్రానికే చెందిన రాజనీతిజ్ఞుడు కీ||శే|| తుర్లపాటి సత్యనారాయణ వంటి ఇతర కులస్తులు కాపులు, తెలగలు, బలిజలు తమ శక్తియుక్తుల్ని తెలుసుకుని రాజ్యాధికారం దిశగా కృషి చేసే అవసరాన్ని మరీ మరీ ఉద్ఘాటించడం ఇక్కడ ప్రస్తావనాంశం.

ఇక రాజకీయ విశ్లేషణల్లోకి మరో మారు తొంగి చూస్తే 1966వ సం॥ నుండీ ఇప్పటి వరకూ "కాపు, తెలగ, బలిజల్ని" వెనుకబడిన తరగతులలో చేర్చడానికి అలుపెరుగని పోరాటం జరిగింది, జరుగుతూంది. ఈ 60 సం॥ల కాలంలో ఆంధ్రరాష్ట్రానికి కాసు బ్రహ్మానందరెడ్డి, పి.వి. నరసింహారావు, జలగం వెంగళరావు, మఱి చెన్నారెడ్డి, టి. అంజయ్య, భవనం వెంకట్రామ్ రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, ఎన్.టి. రామారావు, నాదెండ్ల భాస్కరరావు, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, నారా చంద్రబాబు, వై.ఎస్. రాజశేఖరరెడ్డి, కె. రోశయ్య, ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి వంటివారు ముఖ్యమంత్రులయ్యారు. విభజిత ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు తర్వాత వైఎస్. జగన్మోహనరెడ్డి ముఖ్య మంత్రులయ్యారు. వీరిలో పదకొండు మంది రెడ్లు, ముగ్గురు కమ్మలు, ఒక బ్రాహ్మణుడు, ఒక వెలమ, ఒక వైశ్యుడు 'ముఖ్యమంత్రులుగా పరిపాలించారు. వీరు కాకుండా రెండు సార్లు నీలం సంజీవరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కాగా ఎన్.టి. రామారావు మూడు సార్లు ముఖ్యమంత్రి కాగలిగారు, కోట్ల విజయభాస్కరరెడ్డి, మఱి చెన్నారెడ్డి రెండేసి మార్లు ముఖ్యమంత్రులు కాగా రెండుసార్లు వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సుదీర్ఘకాలం రాష్ట్ర ముఖ్యమంత్రులుగా కొనసాగినవారు చంద్రబాబునాయుడు, కాసు బ్రహ్మానందరెడ్డి. వీరిలో 1964వ సం||లో ఏర్పాటైన కాసుబ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో 'తోట రామస్వామి' గారొక్కరే మన వర్గం నుండి నియమించబడ్డారు.

1964వ సం|| నుండి 69వ సం॥ వరకూ 'తోటరామస్వామి' గారొక్కరంటే ఒక్కరు మంత్రివర్గంలో ఉన్నారు, రెడ్లు ఎనిమిదిమంది, కమ్మలు ముగ్గురు, వెలమలు ముగ్గురు మంత్రులుగా ఉంటే బిక్కు బిక్కు మంటూ మనవారు ఒక్కరే. 1969 నుండి 1971వ సం॥ వరకూ బ్రహ్మానందరెడ్డి 'మూడో” మంత్రివర్గంలోనూ 'తోటరామ స్వామి'గారి కొక్కరికే స్థానం లభించిందంటే ఎంత వ్యూహాత్మకంగా అణచివేతకు బలమైన పునాదులు వేశారా అన్పించి ఆవేదన కలుగుతుంది.

ఈ మంత్రివర్గంలోనే ఎనిమిది మంది రెడ్లు, నలుగురు వెలమలు, నలుగురు కమ్మ, క్షత్రియులు ఇద్దరు మంత్రులుగా ఉన్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు, ఈ ఎన్నికల్లో గెలిచి కొమ్మూరు అప్పడు దొర, ముద్రగడ వీరరాఘవరావు, సంగీత వెంకటరెడ్డి, కె. కుసుమేశ్వరరావు, జవ్వాది లక్ష్మయ్య నాయుడు, బూరగడ్డ నిరంజనరావు, శనక్కాయల అంకమ్మ, బండారు రత్న సభాపతి, ఎ. మదన్మోహన్, జి. రాజారామ్, వంటి దిగ్గజాలు అసెంబ్లీలో అడుగుపెట్టినా ఒకే ఒక్కడు 'తోట రామస్వామి'కి మంత్రి పదవి కట్టబెట్టారు.

1971వ సం||లో బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం కూలిపోయి పి.వి. నరసింహారావు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన మంత్రివర్గంలో 'తోట రామస్వామి’గారికి తోడుగా 'ఎ. మదన్ మోహన్'గారికి స్థానం లభించింది, ఇద్దరికి 'చోటు' దొరికిందన్న మాట. తర్వాతి విస్తరణలో 'తోట రామస్వామి'గారి మరణంతో లుకలాపు లక్ష్మణదాసు, మండలి వెంకట కృష్ణారావు, జి. రాజారామ్ గార్లకు స్థానం లభించి 'నలుగురు' నాలుగు దిక్కులుగా రాజకీయ చైతన్యానికి విశేష కృషి చేశారు.

"ప్రపంచ తెలుగు మహాసభలు" తొలిసారిగా రూపొందించి నిర్వహించింది మండలి వెంకట కృష్ణారావుగారే... 'జి. రాజారామ్'గారు మంత్రి మండలిలో 'సాహసి'గా పేర్గాంచి పోరాట పటిమతో అందర్నీ ఆకర్షించేవారు. 'పి.వి. నరసింహారావు' తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జలగం వెంగళరావు మంత్రి వర్గంలో లుకలాపు లక్ష్మణదాసు, మండలి వెంకట కృష్ణారావు, జి. రాజారామ్, సంగీత వెంకటరెడ్డిలకు స్థానం లభించింది, వెంగళరావు తర్వాత 1978 మార్చిలో డా॥ మఱి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, ఎ. మదన్ మోహన్, జి. రాజారామ్, గొర్లె  శ్రీరాములునాయుడులకు కాపుల నుండీ మంత్రి మండలిలో చోటు దక్కింది...

ఈ సందర్భంగా 'జి. రాజారామ్' నాయకత్వంలో 1980వ సం॥లో చెన్నారెడ్డి ప్రభుత్వం పై పాలనాపరమైన తిరుగుబాటు జరిగింది, జి. రాజారామ్ నాయకత్వాన్ని బలపరుస్తూ 16 మంది మంత్రులు మద్దతు తెల్పడంతో మఱి చెన్నారెడ్డిపై అసమ్మతిని ఒక ఉద్యమంలా జి. రాజారామ్రు లేవదీశారు, నిజానికి ఆ ఉద్యమం సరియైనదే, సమంజసమైనదే. జి. రాజారామ్ అప్పుడు హిమాయత్ నగర్లో ఉంటూ 16 మంది మంత్రుల్ని ఒంటి చేత్తో ఆడిస్తూ రాష్ట్ర రాజకీయాల్ని విశేషంగా ప్రభావితం చేస్తున్న నేత. అంతేకాదు ఒకసారి తన స్వంత నియోజకవర్గం 'బాల్కొండ' నుండీ ఏకగ్రీవంగా కూడా ఎన్నికైన జనాకర్షణ కలిగిన నాయకుడు.

కాపులందరూ ఎంతో ఆశావహదృక్కులై 'రాజారామ్' వైపు దృష్టి సారించిన సమయమది. డా|| మఱి చెన్నారెడ్డి అధిష్టానం ఆదేశాల మేరకు రాజీనామా చెయ్యడం, ముఖ్యమంత్రి కాదగిన నేర్పరిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన జి. రాజారామ్ గారే అభ్యర్థిగా అన్ని వర్గాల్లోనూ చర్చ, పత్రికాధిపతులు, దిగ్గజాలు అందరూ హిమాయత్నగర్ తెలుగు అకాడమీకి పొరుగునే ఉన్న ప్రభుత్వ భవంతిలో నివాసముంటున్న 'జి. రాజారామ్' గారి చుట్టూ ప్రదక్షిణలు, పడిగాపులు....

అయితే అనూహ్యంగా 'టి. అంజయ్య' ముఖ్యమంత్రిగా అధిష్టానం ఆదేశించింది, అంజయ్య ముఖ్యమంత్రి కావడానికి ఇందిరాగాంధీపై విధేయత ఒక్కటేకాక రాష్ట్రంలోని రెడ్డి, కమ్మ, వెలమ వర్గాలకు చెందిన కాంగ్రెస్ వారంతా ఢిల్లీలో ఏకమై జి. రాజారామ్ గారికి వెన్నుపోటు పొడిచారు, తొలిసారిగా రాష్ట్రానికి కాపుల నుండీ ముఖ్యమంత్రి కావాల్సిన అవకాశం అలా చేజారిపోవడం దురదృష్టకరం, 'రాజారామ్'గారుముఖ్యమంత్రిఅయ్యిఉండిఉంటేతప్పకుండాకాపు,తెలగ, బలిజలకు వెనుకబడిన తరగతుల జాబితాలో స్థానం లభించేది, 'డి. శ్రీనివాస్' రాజారామ్ గారి శిష్యుడే. ముఖ్యమంత్రిత్వం చేతిదాకా వచ్చి చేజారడంతో రాజారామ్ గారు తీవ్రంగా వేదన చెందారు. అంతేకాదు కాంగ్రెస్లో రెడ్లు మాత్రమే ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి అవకాశాలు సుగమం చేసుకున్నారని 'భువనగిరి'లో జరిగిన ఒక బహిరంగ సభలో బాహాటంగానే అంజయ్య అసలు పేరు 'రామకృష్ణారెడ్డి' అని అందుకే ఆయన ముఖ్యమంత్రి కాగలిగారనీ తెలియజేయడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం. బి.సి. నేతగా అందరూ అనుకునే అంజయ్య కులం ఏమిటో సరిగ్గా జనానికి తెలియదు. అంజయ్య కుదేలైపోయారు.

1981వ సం||లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో జి. రాజారామ్ గారు మృతి చెందడంతో ఒక మహానాయకుణ్ణి కాపు, తెలగ, బలిజ, తూర్పుకాపు, మున్నూరు కాపులే కాక వెనుకబడిన తరగతులన్నీ కోల్పోయినట్టయ్యింది. అప్పటి వరకూ వాయిస్ ఉన్న నేతలుగా తెలంగాణా నుండి జి. రాజారామ్, రాయలసీమ నుండి బండారు రత్న సభాపతి మాత్రమే పేరు పొందారు. ఆంధ్ర ప్రాంతపు మన సామాజిక వర్గ మంత్రులు, శాసనసభ్యులవి లాలిత్య ప్రధాన రాజకీయాలుగా సాగేవి. ఇక అంజయ్య ముఖ్యమంత్రి అయ్యేనాటికి రాష్ట్ర రాజకీయాల్లోను, అసెంబ్లీలోనూ కాపు, తెలగ, బలిజ, తూర్పుకాపు, మున్నూరు కాపుల నుండీ 'ఆతరం'తో పోటీపడుతూ ‘యువరక్తం' కూడా వచ్చి చేరింది.

అంజయ్య మంత్రి మండలిలో మన సామాజిక వర్గం నుండీ కె. కేశవరావు, సంగీత వెంకటరెడ్డి, ఎ. మదన్మోహన్, జి. శ్రీరాములునాయుడు, సుంకరి ఆళ్వార్ దాస్లు మంత్రులు కాగలిగారు.

కలమట మోహనరావు, ముద్రగడ పద్మనాభం, వీసం సన్యాసినాయుడు, పంతం పద్మనాభం, పాటంశెట్టి అమ్మిరాజు, బూరగడ్డ నిరంజనరావు, మండలి వెంకట కృష్ణారావు, లింగంశెట్టి ఈశ్వర్రావు, జక్కంశెట్టి వెంకటేశ్వర్రావు, వర్ధినీడి సత్యనారాయణ పూల సుబ్బయ్య, సుగవాసి పాలకొండ్రాయుడు, ఎం.ఎం. రత్నం, కె.వి.పతి, శ్రీమతి జి. సుశీలాబాయి రాజారామ్ వంటి ఎందరో 'శాసనసభ్యులు' అసెంబ్లీలో అడుగుపెట్టారు. 'అంజయ్య' తర్వాత ముఖ్యమంత్రి భవనం వెంకట్రామిరెడ్డి మంత్రి మండలిలో కె. కేశవరావు, ఎ. మదన్ మోహన్, ఎస్. ఆళ్వార్ దాస్లు ముగ్గురు మంత్రులు కాగలిగారు, 'విజయభాస్కరరెడ్డి' ముఖ్యమంత్రి అయ్యాక ఎ. మదన్మోహన్, మండలి వెంకట కృష్ణారావు, కె. కేశవరావు, వీసం సన్యాసినాయుడు, వి. హనుమంతరావులు మంత్రులు కాగలిగారు. ఈ ప్రభుత్వం తరువాత 35 సం||ల సుదీర్ఘ కాంగ్రెస్ పాలనకు తెరదించుతూ ఎన్.టి. రామారావు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 'తెలుగుదేశం' పుట్టుకకు ఒక విధంగా 'కాంగ్రెస్'లో రెడ్లు తప్ప ఇంకెవ్వరూ ముఖ్యమంత్రులు కాలేరన్న సత్యాన్ని జీర్ణించుకున్న నాదెండ్ల భాస్కరరావు ప్రోద్బలమే ఎన్.టి.ఆర్. చేత తెలుగుదేశం స్థాపనకు దారి తీయించింది.

జి. రాజారామ్ ఉదంతంతో పాటు, తను కూడా ముఖ్యమంత్రి కావడానికి నాదెండ్ల భాస్కరరావు విశ్వప్రయత్నాలు చేసి విఫలుడై ఎన్టీఆర్ని ఎగదోసి, తెలుగునాట మరో కులపార్టీ పుట్టడానికి కారణభూతుడైనాడు, బి.సి.ల సంక్షేమం కోసం నిత్యం తమ పార్టీ కృషి చేస్తుందనే నినాదంతో ఇప్పటికీ ఎలాగోలా బతికి బట్టకడుతోన్న 'తెలుగుదేశం పార్టీ' వల్ల బాగుపడ్డ బి.సి.లు కొప్పుల ‘వెలమ’లు, పొలినాటి ‘వెలమ’లు అన్నదే సత్యం. ఇక ఎన్టీఆర్ మంత్రి మండలిలో 1983 నుండి 1984 వరకు ఈలి ఆంజనేయులు, చేగొండి వెంకటహరరామ జోగయ్యలకు స్థానం లభించింది.

అనంతర విస్తరణలో ఈలి ఆంజనేయులు మృతి చెంది ఉండడంతో 'శ్రీపతి రాజేశ్వర్'కు చోటు దొరికింది. 1985 మధ్యంతర ఎన్నికల అనంతరం 1985 నుండి 1989వ సం॥ వరకూ సాగిన ఎన్టీఆర్ పాలనలోని మంత్రి మండలిలో మంత్రి వర్గ మార్పులతో సహా ముద్రగడ పద్మనాభం, కిమిడి కళా వెంకట్రావు, బండారు రత్న సభాపతి, ప్రత్తి మణెమ్మ, అల్లాడి రాజ్కుమార్, సింహాద్రి సత్యనారాయణ, సి. రామచంద్రయ్య, శ్రీపతి రాజేశ్వర్, వడ్డి రంగారావు, తోట సుబ్బారావు వంటి నేతలు మంత్రులు కాగలిగారు. 'ఎన్టీఆర్' రెండుసార్లు 1983, 85వ సం||లో ముఖ్యమంత్రి కాగలిగినా 1989వ సం||లో పదవీచ్యుతుడైనా నిస్సందేహంగా రాష్ట్రంలోని కాపు, తెలగ, బలిజ, తూర్పు కాపు, మున్నూరు కాపుల ఓట్లు 'నిర్ణయాత్మక శక్తి'గా మారాయంటే అతిశయోక్తి లేదు.

కమ్మవాళ్ళు మాత్రమే ఓట్లు వేస్తే ఎన్.టి.ఆర్. ముఖ్యమంత్రి కాగలిగేవాడా? కాపులు, బి.సి.లు, దళితులు గిరిజనులు వీళ్ళంతా 'ఓట్లు' వేస్తేనే కదా ఎన్.టి.ఆర్. ముఖ్యమంత్రి కాగలిగింది, కమ్మవారంతా ఎన్.టి.ఆర్ని ఆకాశం నుండి దిగి వచ్చిన దేవుడని, తమ కులానికి హోదాని గుర్తింపుని, అధికారాన్నీ తీసుకు వచ్చాడని సంబరాలు చేసుకున్నారు, ఎన్టీఆర్ని గద్దె దింపి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే యువకుడు, దూరదృష్టి గలవాడు కావడంతో తమ ఆస్తిపాస్తుల్ని పెంపొందించుకోవడానికి అప్పటికే బలపడిన కమ్మవర్గమంతా నిశ్శబ్దంగా చంద్రబాబుకి మద్దతు ప్రకటించారు, 1989వ సం||లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోవడానికి కారణాలు మనకే కాదు మిగతా అన్ని కులాలకూ తెలుసు... జులై 10, 1988వ సం||లో విజయవాడ కృష్ణా నదీ తీరాన లక్షలాది సోదర సోదరీమణుల సాక్షిగా విజయవంతమైన 'కాపునాడు'... 1988వ సం॥ డిసెంబర్ 26వ తేదీన విజయవాడలో నిరాహార దీక్షా శిబిరంలో నిద్రిస్తున్న వంగవీటి మోహనరంగాగారి దారుణహత్య...

ఒకవైపు విజయవంతమైన 'కాపునాడు' సమరభేరి మ్రోగిస్తూ 'రాజ్యాధికారం' దిశగా రాజకీయ చైతన్యాన్ని పెంపొందించుకుని అడుగులు వేస్తుంటే ఆ పదఘట్టనలకు భయకంపితులై తమ వైభవ ప్రాభవాలు తెరమరుగు కాకూడదనే తలంపుతో, రాజ్యకాంక్షతో, పదవీ వ్యామోహంతో 'వర్గ' హత్యకు నాందిగా వంగవీటి మోహనరంగాను అత్యంత పాశవికంగా అంతమొందించడం 'రంగా' అనే ఒక్క వ్యక్తిని హత్య చేయడం కాదు, మొత్తం వర్గాన్నే సమూలంగా భయోత్పాతానికి గురి చేయడమే వారి పథకం... 1989వ సం॥లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, రంగా మరణం మన వర్గంలోని మహానాయకుడిని మనం కోల్పోయి 'సవ్యదిశ'వైపు సాగలేని అనిశ్చిత స్థితి...

ఈ ఎన్నికల్లో అవనిగడ్డ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీమంత్రి 'మండలి వెంకట కృష్ణారావు' స్వల్ప తేడాతో ఓటమి పాలు కావడం కోలుకోలేని విషయం, ఆయన గెలిచి ఉండి ఉంటే 1989-94 మధ్య కాలంలో తప్పనిసరిగా ముఖ్యమంత్రి అయ్యి తీరేవారు, అప్పటి సామాజిక రాజకీయ స్థితిగతులు అలా ఉన్నాయి....

1989-94 సం||ల మధ్య కాలంలో డా॥ మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి ఆంధ్రరాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులు... వీరి ప్రభుత్వాలలో డి. శ్రీనివాస్, చేగొండి వెంకట హరరామజోగయ్య, ముద్రగడ పద్మనాభం, పంతం పత్మనాభం, సంగీత వెంకటరెడ్డి, గుడివాడ గురునాధరావు, వి. హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మీనారాయణ, పేర్ని కృష్ణమూర్తి, బలిరెడ్డి సత్యారావు వంటి దిగ్గజాలు రాష్ట్రమంత్రులు కాగలిగారు.

కోట్ల విజయభాస్కరరెడ్డి పరిపాలించిన సమయంలో కాపు, తెలగ, బలిజల్ని వెనుకబడిన తరగతులలో చేర్చే అంశం తీవ్ర రూపం దాల్చి ఆంధ్రదేశమంతా అట్టుడికిపోయింది, 1982వ సం||లో మిరియాల వెంకటరావు, ఆకుల శివయ్యనాయుడు, బి. గోపాలక్రిష్ణయ్య, చిలంకుర్తి అంబులు గార్లు మనల్ని బి.సి.ల్లో చేర్చేందుకు మొదలు పెట్టిన ఉద్యమం 1992 నాటికి ఉధృతంగా మారింది, ముద్రగడ పద్మనాభంగారు తెలుగుదేశంపార్టీలో ఉండగా ఈ విషయంపై ఎప్పుడూ స్పందించలేదు, కాపులకు అన్యాయం జరుగుతూందంటూ తెలుగుదేశంని వీడి కాంగ్రెస్లో చేరి గెలిచి మంత్రి కూడా అయిన 'ముద్రగడ' ఇక్కడ మాత్రం కుల ప్రయోజనాల్ని ప్రభుత్వానికి హెచ్చు స్వరంతోనే కోరారు, భీకర నిరాహారదీక్ష పూనారు, కోస్తా అంతా ఉడుకెత్తిన ఆ ఏడు రోజులూ రాష్ట్ర పాలకుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి....

వెనుకబడిన తరగతుల యువకులకు ఇస్తున్న ఆర్థిక, తదితర సదుపాయాలు కాపు, బలిజ, తెలగలకు కమీషన్ నివేదికలతో నిమిత్తం లేకుండానే వర్తింపజేస్తూ జి.వో. జారీ అయింది, ముద్రగడ పద్మనాభంను దీక్ష విరమింపజేయడానికి రోశయ్య, రఘువీరారెడ్డి దౌత్యం నెరిపారు. ఒకవైపు జీ.వో. అమలు, మరోవైపు పుట్టస్వామి కమీషన్ నియామకం... దీనికి ప్రధాన నేపథ్యం తూర్పు గోదావరి జిల్లా ‘రావులపాలెం'లో 1994 ఫిబ్రవరి 26వ తేదీన ఆందోళనకారులపై జరిపిన లాఠీఛార్జి.

ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి పాల్గొన్న ఈ సభలో కాపులు నల్లబ్యాడ్జీలు ధరించినందుకు లాఠీ ఛార్జి జరపడం, ఇది ‘అన్యాయం' అని ముద్రగడ పద్మనాభం కాపులను కదిలించడం, ఆ తర్వాత జరిగినవి నాటకీయ పరిణామాలే... నిజానికి ముద్రగడ పద్మనాభం, పి. శివశంకర్, వై.ఎస్. రాజశేఖరరెడ్డి, జలగం వెంగళరావు, కె.ఇ. కృష్ణమూర్తి “కోట్ల విజయభాస్కరరెడ్డి" ప్రభుత్వంలో అసమ్మతి నేతలుగా ప్రాచుర్యం పొందారు, ఈ అసమ్మతి వాదులంతా ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ప్రదర్శిస్తూ, అధిష్టానానికి విధేయత ప్రకటించేవారే...

1989వ సం||లో తెలుగుదేశంపార్టీ ఘోరంగా ఓడిపోవడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపు, తెలగ, బలిజ, తూర్పు కాపు, మున్నూరు కాపుల మనోభావాలు దెబ్బతినడమేనని, వంగవీటి రంగా హత్య వారిని కలచివేసిందని 'ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర'లో జి. వెంకటరామారావు, 'గతం స్వగతం' పుస్తకం ద్వారా పర్వతనేని ఉపేంద్ర, 'ఒకే ఒక్కడు', ఫ్లాష్బ్యాక్ వంటి పుస్తకాలలో ఇనగంటి వెంకట్రావ్, 'రాష్ట్రంలో రాజకీయం' గ్రంథం ద్వారా కొమ్మినేని శ్రీనివాసరావు వంటి 'కమ్మవారు' తెలియజేయడాన్ని బట్టి కాపులు సాంఘికశక్తి, నిర్ణయాత్మక ప్రభంజనం అనివారు ఒప్పుకున్నట్టే...

1994వ సం||లో 2రూ॥లకే కిలో బియ్యం, సంపూర్ణ మద్యపాన నిషేధం నినాదాలతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎన్.టి.ఆర్. ముఖ్యమంత్రిగా ఉన్న ఎనిమిది నెలల కాలంలో చిక్కాల రామచంద్రరావు, డా॥ పసుపులేటి బ్రహ్మయ్య, సింహాద్రి సత్యనారాయణ, కొత్తపల్లి సుబ్బరాయుడు, మంత్రి మండలిలో మంత్రులుగా ఉండగా, ఎన్.టి.ఆర్.ని పదవీచ్యుతుడ్ని చేసి ఎన్. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాగానే 1995 సెప్టెంబర్ నుండీ 1999 అసెంబ్లీ ఎన్నికలలోపు సింహాద్రి సత్యనారాయణ, డా॥ మెట్ల సత్యనారాయణరావు, శ్రీమతి పడాల అరుణ, ఎలకోటి ఎల్లారెడ్డి మంత్రులు కాగలిగారు, 1999 నుండీ 2004 అసెంబ్లీ ఎన్నికలలోపు తిరిగి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో డా॥ శనక్కాయల అరుణ, చిక్కాల రామచంద్రరావు, కొత్తపల్లి సుబ్బరాయుడు, పడాల భూమన్న, పతివాడ నారాయణస్వామి నాయుడు, నేరెళ్ళ ఆంజనేయులు వంటివారు మంత్రులు కాగలిగారు. 2004 మే నెలలో తిరిగి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చాక ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో డి. శ్రీనివాస్, కన్నా లక్ష్మీనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, జక్కంపూడి రామమోహనరావు, బొత్సా సత్యనారాయణ, వనమా వెంకటేశ్వరరావు, మండలి బుద్ధప్రసాద్ వంటి హేమాహేమీలు రాష్ట్రమంత్రులు కాగలిగారు.

లోగడ పి.శివశంకర్, పోతురాజు పార్థసారధి, డాక్టర్ మల్లిపూడి శ్రీరామ సంజీవిరావు, డా॥ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పి.వి. రంగయ్యనాయుడు వంటివారు కేంద్రమంత్రులుగా 'కాపులు' ప్రతినిధులుగా ఒక వెలుగు వెలిగారు, పాలవలస రాజశేఖరం, శ్రీమతి చోడగం అమ్మన్నరాజ, యాళ్ళశశిభూషణరావు, శ్రీమతి వంగాగీత, మెంటే పద్మనాభం, ఎర్రా నారాయణస్వామి, సి. రామచంద్రయ్య, పి. శివశంకర్, వి. హనుమంతరావు, అల్లాడి రాజ్కుమార్, కిమిడి కళా వెంకట్రావు, డా॥ దాసరి నారాయణరావు, కె. కేశవరావు వంటి పెద్దలు, పద్మభూషణ్ చిరంజీవి అనే 'మెగాస్టార్' పెద్దల సభకు ఎదిగారు. తర్వాత ఎం.ఎం. పల్లంరాజు, డా. దాసరి నారాయణరావు, ఎ. సాయిప్రతాప్, పద్మభూషణ్ చిరంజీవి వంటివారు కేంద్రమంత్రులుగా ఒక వెలుగు వెలిగారు.

కర్రి నారాయణరావు, కెంబూరి రామ్మోహనరావు, కొండపల్లి పైడితల్లినాయుడు, కొమ్మూరి అప్పలస్వామి, గుడివాడ గురునాథరావు, గంటా శ్రీనివాసరావు, ఎం. ఎస్. సంజీవరావు, తోట గోపాలక్రిష్ణ, తోట సుబ్బారావు, ముద్రగడ పద్మనాభం, నల్లారెడ్డి నాయుడు, గిరిజాల వెంకటస్వామి నాయుడు, కొత్తపల్లి సుబ్బారాయుడు, సనకా బుచ్చి కోటయ్య, మండలి వెంకట కృష్ణారావు, మండలి వెంకట స్వామి, మేడూరి నాగేశ్వరరావు, కైకాల సత్యనారాయణ, అంబటి బ్రాహ్మణయ్య, నిశ్శంకరరావు వెంకటరత్నం, సింగం బసవ పున్నయ్య, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, పి. శివశంకర్, పోతురాజు పార్థసారథి, సుగవాసి పాలకొండ్రాయుడు, కొమ్మూరు సంజీవరావు, గునిపాటి రామయ్య, పి.వి. రంగయ్యనాయుడు, గార్లవంటివారు లోక్సభ సభ్యులుగా రాణిస్తే శ్రీమతి బొత్స ఝాన్సీరాణి, ఎ. సాయిప్రతాప్, ఎం.ఎం. పల్లంరాజు, వల్లభనేని బాలశౌరి, చేగొండి వెంకటహరరామ జోగయ్య, పప్పల చలపతిరావు, బాడిగ రామకృష్ణ, డి.కె. ఆదికేశవులు నాయుడు, తోట వెంకట నరసింహం, ముత్తంశెట్టి శ్రీనివాసరావు వంటివారు లోక్సభ సభ్యులుగా రాణించారు.

కొమ్మూరు అప్పడుదొర, త్రిపురాన రాఘవదాసు, గుడివాడ అప్పలస్వామి, గొర్లె శ్రీరాములునాయుడు, తోట రామస్వామి, పసల సూర్యచంద్రరావు, ఎనుముల సావిత్రీదేవి, టి. ముసలయ్య, ఎర్రా నారాయణస్వామి, ముత్యాల రాయుడు, వట్టి వెంకటరంగ పార్ధసారధి, ఘంటాకృష్ణమూర్తి, కమ్మిలి అప్పారావు, ఎస్. నాగేశ్వర్రావు, సింగం బసవ పున్నయ్య, వి. నాగేశ్వరరావు, గుమ్మళ్ళ రంగారావ్నాయుడు, కె. కేశవరావు, వి. హనుమంతరావు, పి.శ్రీరామమూర్తి వంటి దిగ్గజాలు శాసనమండలి సభ్యులుగా తేజోవంతమైన రాజకీయ జీవితాన్ని చూశారు. ఇక తాజాగా శాసనమండలికి ఎంతోమంది తరలి వచ్చారు, ఆసీనులయ్యారు.. ఇంతమంది రాజకీయ రంగంలో 'మన' ప్రతినిధులుగా అలరారారు.

మరి ఇన్ని సం||ల సుదీర్ఘ పయనంలో వెనుకబడిన తరగతుల జాబితాలో ప్రాంతీయ పరిమితుల్ని తొలగించి మనందర్నీ చేర్చడానికి పాలకులు ఎందుకు మిన్నకున్నారు? రాజ్యాధికారమే అంతిమలక్ష్యం కావాలి, రాజ్యాధికారం కోసం నిరంతర ప్రయత్నాలు జరగాలి, రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలి... రాజ్యాధికారమే అసలైన మజిలీ, అయితే రాజకీయాల్లో రాణించాలన్నా, ప్రవేశించాలన్నా 'ఎవరో” మన ఇంటికి వచ్చి తలుపుతట్టి సభ్యత్వాలూ ఇవ్వరు, బి-ఫారంలూ ఇవ్వరు, రాజకీయాల్లోకి ఎవరూ రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పరు...

సంఖ్యాపరంగా శ్రీకాకుళం నుండి చిత్తూరు జిల్లా వరకూ విశేషంగా జనాభా కల్గియుండి రాష్ట్ర రాజకీయాల్లో గెలుపు, ఓటముల్ని నిర్ణయించే శక్తిగా ఉండి 'రాజ్యాధికారం' దిశగా మనల్ని మనం ప్రేరేపించుకోలేక ఆశక్తులమై, నిస్సహాయులమై నిర్వేదావస్థలో నుండి బయటకు వద్దాం... 2004 ఎన్నికల్లో భీమవరం, మాడుగుల, చిత్తూరు, వేమూరు, వంటి అసెంబ్లీ నియోజకవర్గాలు, నరసాపురం, చిత్తూరు లోక్సభ నియోజకవర్గాలు, ఇలా 'కాపులు' తమ ఉనికిని, సమైక్యతని, సంఘీభావాన్ని, రాజకీయ చైతన్యాన్ని ఎలాగైతే చాటుకున్నాయో అదే 'చైతన్యం' ప్రతి జిల్లాలో రావాలి, గెలుపు ఓటముల్ని పక్కనబెట్టి ఎన్నికల్లో పోటీ చేయాలి, కనీసం అభ్యర్థిత్వాన్ని పరిశీలించమని దరఖాసైనా చేసుకోకుండా రాజకీయాల్లో వెలుగు వెలగాలనుకుని కలల్లో బ్రతికితే 'వాస్తవం'లో మన పాత్ర ఏమిటి?

“55 సంవత్సరాల ఉమ్మడి రాష్ట్ర రాజకీయ చరిత్రలో 'బొబ్బిలి' లోక్సభ నియోజకవర్గం నుండీ ఆ మధ్య ఉప ఎన్నిక ద్వారా గెలుపొందిన శ్రీమతి బొత్స ఝాన్సీరాణిగారు మన ఆడపడుచుగా పార్లమెంటు భవనంలో అడుగుపెట్టిన తొలి మహిళ" అంటే ఆనందమూ కలుగుతోంది తొలి కాపు మహిళా ఎమ్.పి., ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన కాపు మహిళ, అలాగే ఆవేదనా కలుగుతోంది, కమ్మవారు ఇద్దరు కేంద్ర మంత్రిణులుగా వెలిగాక కాపులు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

గెలవాలి, గెలిచాక ఆ స్థానాన్ని కాపాడుకోవాలి, తర్వాత 'స్పష్టత' వస్తుంది, ఇంత తతంగం జరిగేలోపు మిగిలిన అగ్రకులాలు ముందు వరసలో ఎక్కడో ఉంటాయి, మనం వెనుకబడిపోతూనే ఉంటాము, ఈ పరిస్థితి పోవాలి, మారాలి అంటే రాజకీయాల్లో అడుగిడే మన యువతని నిరుత్సాహపరచకండి, ఉత్సాహపర్చండి, అభినందించండి, ఆశీర్వదించండి... యువతరాన్ని సాదరంగా స్వాగతించండి...

'విజయవాడ' రాజకీయ చిత్రపటంలో 'వంగవీటి మోహనరంగా' ఆగమనం వరకూ కమ్మ సామాజిక వర్గానిదే కదా ఆధిపత్యం.. ఒక నాయకుడిగా రంగా అన్ని వర్గాల ఆదరాభిమానాల్నీ పొందిన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపు సామాజిక వర్గమంతా ఎంత ఆత్మ విశ్వాసంతో, ఎంతటి సామాజిక చైతన్యంతో జీవించిందో నేను మీకు చెప్పేంతటివాణ్ణికాను, ఈ దేశాన్ని బ్రిటిష్వాడు పరిపాలించిన రోజుల్లో కూడా ఏ రోజూ ఈ దేశంలో రోజులకు రోజులు జిల్లాలకు జిల్లాల్లో కర్ఫ్యూలు విధించలేదు, 14 రోజులపాటు 12 జిల్లాల్లో కర్ఫ్యూలు, 144 సెక్షన్లు విధించారంటే అది ఒక్క సత్యాగ్రహి రంగా హత్య జరిగిందనే, అంటే రాష్ట్రాన్ని దిగ్భందనం చేసిన శక్తి అదీ..

'అంబేద్కర్' రాజ్యాంగ నిర్మాత అయ్యాడు కాబట్టే దళితులకు రిజర్వేషన్లు కల్పించగలిగాడు, తద్వారా దళితుల జీవనగమనమే మారిపోయింది, దళితుడికి దేశమంతా విశాలంగా కనిపించింది, రాజ్యాధికారం హస్తగతమైతే ఒకరిని అడిగే, దేబిరించుకునే పరిస్థితి ఉంటుందా? శాసించే స్థితి వస్తుందా?... ఓట్లతో శాసించడం కాదు, పాలకులుగా శాసిద్దాం...

ఏటుకూరు బలరామమూర్తి, మల్లంపల్లి సోమశేఖరశర్మ, కంభంపాటి సత్యన్నారాయణ వంటి చరిత్రకారులు 'ఆంధ్రుల చరిత్ర' వేర్వేరుగా వారి వారి శైలుల్లో వ్రాశారు, ఫలానా రాజు ఆదివెలమ కులానికి చెందినవాడు, ఫలానావారు రెడ్డిరాజులు, ఫలానా చక్రవర్తి పద్మనాయక వెలమ కులస్తులు అంటూ వివరించారేగానీ తెలగల గురించి, బలిజల గురించి వ్రాయాల్సి వస్తే మాత్రం వారి కులాలకు ఎందుకు మన 'కులం' కనిపించలేదు, బాణరాజులని, చోళులనీ, విజయనగర సామ్రాజ్యాధీశులని, చాళుక్యులనీ వ్రాసుకుంటూ పోయారేగానీ 'కులాన్ని' ఎందుకు కప్పిపుచ్చారు? “భయం” “చైతన్యం’ వస్తుంది, ఆ చైతన్యంలో నుండీ సమైక్యత పుడుతుంది, సమైక్యత సాధికారిక పాలనకు దారితీస్తుంది... ‘సంఘీభావమే’ బలం.. సంఘమే రాజ్యం, రాజ్యమే విజయం, విజయమే నిజం...

తాజాగా రెడ్డి, కమ్మ కులాలు ఒకే పాట పాడుతున్నాయి, అదేమిటంటే తమ స్థితిగతులు, రాజ్యాధికారం, సుదీర్ఘకాలం పరిపాలించడం, భూమిపై పెత్తనం, సంపదపై పట్టు ఇవన్నీ వారికి దేవుడిచ్చాడట. దేవుడుదయ చూపాడట... అన్ని రకాలుగా అన్నీ సాధించుకున్నారు కాబట్టి వారు తిరిగి మనల్ని అమాయకుల్ని చేసే ప్రయత్నమిది, తస్మాత్ జాగ్రత్త, మనం ఇకపై మోసపోకూడదు, పట్టుబట్టి మన ఫలాలను పొందాలి... ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, నల్గొండ, మెదక్, మహబూబ్నగర్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో 'మనం' ఎన్నికల్లో పోటీచేసిన సందర్భాల్ని వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చునంటే ఆవేదన కలుగుతుంది. నెల్లూరు, కర్నూలు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో దాదాపు 'శూన్యం' అని చెప్పవచ్చు. అంటే కొన్ని జిల్లాల్లో జనం, ఓట్లు ఉన్నా 'నాయకత్వ పగ్గాలు' మన చేతికి చిక్కనేలేదు, దీనికెవరు బాధ్యులు?

రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మనవారు 'పరిశ్రమలు' నెలకొల్పడానికి, వ్యాపారాలు వృద్ధి చేసుకోవడానికీ మనవారికే 'అవకాశాలు' కల్పించాలి, ఉద్యోగావకాశాలూ మనవారికే అందించాలి, వీరంతా రాజకీయాల్లో రాణించే నాయకులకు ఎన్నికలప్పుడు సహాయం అందించాలి, నాయకుల్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి, 'మరియు' మనం అన్ని కులాలవారి దగ్గరనుండీ ఆర్థిక వనరుల్ని సమీకరించుకోవాలి, అంటే వ్యాపారం, వృత్తి, వ్యవహారం ఏదైనా కావొచ్చు, సంఘంలోని కులాలన్నింటితోనూ స్నేహసంబంధాలు పాటించాలి, మనల్ని మనవారే కాకుండా ఇతర కులాలు కూడా నాయకులుగా అంగీకరించే నేర్పు కలిగి ఉండాలి.

ఇందుకు జగ్గయ్యపేట, ఉంగుటూరు నియోజక వర్గాల నేతలు సామినేని ఉదయభాను, వట్టి వసంత్ కుమార్ గార్లను ప్రత్యక్ష ఉదాహరణలుగా పేర్కొనవచ్చును తరతరాలుగా కమ్మవారి కబంధహస్తాల్లో ఉన్న నియోజకవర్గాల్ని తమవిగా సాధించుకున్న ఘనత వారిది.

ఇదే కోవలోకి రాజమండ్రి, భీమవరం, చిత్తూరు అసెంబ్లీలు వస్తాయి... 'ప్రయత్నం'.. ప్రయత్నించడంలోనే ఉంది సగం విజయం... ఇక్కడే మనం వెనుకబడు తున్నాం ప్రయత్నం చేస్తూనే ఉందాం, ప్రయత్నించు ప్రయత్నించు కొన ఊపిరి సాగేదాకా ప్రయత్నించు ప్రయత్నించు పోరాడే ప్రతి యుద్ధంలోనూ ప్రయత్నించు ప్రయత్నించు పడిలేచేదాకా, కడతేరేదాకా చావో బ్రతుకో తేల్చుకునే వరకూ “ప్రయత్నం మానేస్తే మరణించినట్లు ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్లు”.

'రెడ్లు' రాజకీయాల్ని, కమ్మలు సినీమాల్ని నమ్ముకున్నారు, వాళ్ళు ఇప్పటివరకూ వదిలిపెట్టలేని రంగాలు ఇవి... ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడానికి సినిమా జనాకర్షణే కారణం అయ్యింది. 'రెడ్లు'' రాజకీయాల్లో నిలబడి పోటీ చేసేటప్పుడు ఆ నియోజకవర్గంలో తమ ఓట్లు ఎన్ని? తమస్థానం ఏమిటి? అని ఆలోచించరు, వాళ్ళు భూమి మీద తమ అదుపు ఉంచుకుంటారు, తద్వారా భూస్వాములుగా గుర్తింపు పొందుతారు, ఎన్నికల్లో ఏ పార్టీ అయినా సరే అభ్యర్థిత్వం కోసం ముందుకు వస్తారు, పోటీ చేస్తారు, ఎటొచ్చీ వారి మజిలీ 'అధికారం' తమ గుప్పెట్లో ఉంచుకోవడమే!

ఇక 'కమ్మవారు' తమ ఇంట్లోని ప్రతి ఒక్కర్నీ సినిమా హీరోని చేసే ప్రక్రియకు బలమైన పునాదులు వేశారు, పదిమంది కమ్మవాళ్ళు తమ పుత్రుల్ని హీరోలుగా పరిచయం చేస్తే వాళ్ళలో ఇద్దరైనా నిలదొక్కుకుంటారు కదా... ఇద్దరు నిలదొక్కుకుంటే ఇంకేముంది అభిమానులు, కలెక్షన్లు, ఇమేజ్.... 'డబ్బు' వచ్చి చేరుతుంది, ఆ 'డబ్బు' వ్యాపారాల్లో, రియల్ ఎస్టేట్లలో మదుపు పెట్టడం, తద్వారా రాజ్యాధికారం... రాజ్యాధికారం ద్వారా తిరిగి మరింత సంపదను పెంచుకోవడం... ఇదంతా ఒక 'వలయం'లా ఆంధ్రరాష్ట్రంలోని మిగతా కులాలేవీ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, పారిశ్రామికంగా ఎదగడానికి అవకాశమే లేకుండా చేసింది. ఎల్లలు దాటి ఖండాంతరాలకు వలస వెళ్ళినా కమ్మలు 'తానా' అంటూ, రెడ్లు 'ఆటా' అంటూ విడిపోయారంటే వారు 'కులం' కోసం ఎంత ప్రాకులాడుతారో ఒక్కసారి ఆలోచించండి?! కులమే బలం, బలగం.. కుల బలం పదవుల్ని, అధికారాల్ని తెచ్చి పెడుతుంది. ఎటొచ్చీ కులంపై అవగాహన, సంఘీభావం, సమన్వయం, సంయమనం వంటివి చైతన్యవంతమైన రీతిలో పెంపొందించుకోవాలి. కాపు తెలగ బలిజ ఒంటరుల్లో ఐక్యతలేదు, వెనుకబాటుతనం పెరిగిపోయింది, మనల్ని అందరూ అణగదొక్కుతున్నారు, సంవత్సరానికొకసారి “వన మహోత్సవాల్లోనే” కలుస్తున్నాం.

"మనవాడు ముఖ్యమంత్రి ఎప్పుడౌతాడో”, “మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి”, “మా అమ్మాయికి అమెరికా సంబంధం చెయ్యాలి". ఇలా ఆత్మవంచన చేసుకునే ముందు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకుందాం.

ఐక్యత, సమైక్యత, సంఘీ భావం అనేవే లేకపోతే ఈ రోజు శ్రీకాకుళం జిల్లా మొదలు చిత్తూరు జిల్లా వరకు, నెల్లూరు జిల్లా నుండి ఖమ్మం జిల్లా వరకు, కర్నూలు జిల్లా నుండి నల్గొండ జిల్లా వరకు బి.సి. జాబితాలో కాపు తెలగ బలిజల్ని చేర్చాలన్న సామూహిక గొంతుక ఉద్యమరూపాన్ని ధరించేది కాదు. “కాపులు బలిజలు తెలగలు పెట్టుకొంటున్నవి సంఘాలు కాదు, చేస్తున్నవి ఉద్యమాలు”.

ఇవ్వాళ నగరాలలో హోటల్ పరిశ్రమ, రియల్ ఎస్టేట్ వ్యాపారం రెండూ రెడ్డి, కమ్మ, క్షత్రియ, వెలమ కులాల చేతుల్లో బందీ అయిపోయింది, అసలు హోటల్ పరిశ్రమ మొత్తాన్ని నెల్లూరు రెడ్లే శాసిస్తుండగా, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఈ నాలుగు కులాలు పోటాపోటీగా సాగిస్తున్నా పెత్తనం రెడ్డి, కమ్మ కులాలదే.. దీన్ని బట్టి ఒక విషయం స్పష్టంగా అర్థమౌతుంది. "భూమి" మీద పట్టు ఎవరైతే సాధిస్తారో వారే మిగిలిన అన్నింటి మీదా పట్టు సాధిస్తారు. మనం 'సాంఘిక శాస్త్రం' (సోషల్ స్టడీస్) చదువుకునే రోజుల్లో డిమాండ్ మరియు సప్లయ్ చదువుకునే తీరతాం, అయితే ఆ పాఠాన్ని ఆచరణీయం చెయ్యం, ఇతర కులాల ఉన్నతి మనలో స్ఫూర్తిని రగిలించాలే కానీ విద్వేషాన్ని కాదు, క్యాపిటల్ (పెట్టుబడి) కావాలంటే మనం చదువుకున్న చదువుకు సంబంధించి సర్టిఫికెట్లపైన ఏ బ్యాంకులోనైనా, ఏ మున్సిపల్ కార్పొరేషన్లోనైనా పి.ఎం.ఆర్.వై. పథకం క్రిందో ఋణం మంజూరు చేయించుకోవడం, శ్రమిస్తే కష్టమైన పనేమీ కాదు, ఆ తర్వాత కుటీర పరిశ్రమతో మొదలు పెట్టి పారిశ్రామికవేత్తగా ఎదగడానికి అనువైన సోపానాల్ని మనమే అధిరోహించాలి...

ఇతర కులాలు కొన్ని రంగాల్ని గుత్తాధిపత్యం క్రింద శాసిస్తున్న సంగతి నిజమే అయినా ఆయా రంగాలలో కాలు పెట్టాలి, వేళ్ళూను కోవాలి, మొక్కగా మొదలై మహావృక్షం కావాలి.

సినిమా, విద్యాసంస్థలు, టీవీ ఛానెల్సు, రవాణా, వైద్యరంగం, పత్రికారంగం ప్రతిదాన్లోను పాదం మోపాలి, మన ఉనికిని చాటాలి, ఇక్కడొక విషయం గుర్తుంచుకోండి తాజాగా కమ్మ, రెడ్డి, క్షత్రియ, వెలమ కులాలు ఒక నినాదాన్ని నెత్తికెత్తుకున్నాయి, అదేమిటంటే "కులం లేదు, కులమంటే ఏమిటి? మాకు క్యాస్ట్ ఫీలింగా?! సామాజికంగా రాజకీయంగా పారిశ్రామికంగా ఈ కులాలు స్థిరపడిపోయాయి కాబట్టి ఇప్పుడిలాంటి కథలు ఎన్నైనా చెబుతారు, మరి అందరూ సమానం అనుకున్నప్పుడు, వీళ్ళకు క్యాస్ట్ ఫీలింగ్ లేనప్పుడు వీళ్ళ రంగాలలోకి మనం కానీ, దళితులు కానీ, వెనుకబడిన తరగతులు కానీ ప్రవేశిస్తే కరచాలనం చేసి స్వాగతించాలి కదా! ఎందుకు భయపడుతున్నారు? "సంఖ్యాబలం" చూసి, “సామూహికశక్తి”కి జడిసి...

కాపులు, తెలగలు, బలిజలు, ఒంటరులు, తూర్పు కాపులు, మున్నూరు కాపులు ఏళ్ళ తరబడి దగాకు, దోపిడీకి తెలుగు రాష్ట్రాలలో గురయ్యారనేది నిర్వివాదాంశం...

అయితే ఒకటి రెండు అదనపు ఎమ్.ఎల్.ఏ., ఎమ్.పి., టిక్కెట్లకి, కార్పొరేషన్ చైర్మన్ పదవులకి మనం సంతృప్తిపడిపోతున్నామే కానీ 1952 అసెంబ్లీ ఎన్నికల మొదలు నేటి వరకూ 'మనకు లభించిన గుర్తింపు శూన్యం...

1982 మొదలు 'విజయవాడ' కేంద్రంగా మిరియాల వెంకట్రావుగారి నేతృత్వంలో ‘మహాసభ’ గురించి పత్రికా సమావేశం ఏర్పాటు, తెలగ సంఘం కార్యదర్శి రామాయణపు దానయ్యగారు, పెద్దలు గాజుల నారాయణరావు, తోట పార్వతీశ్వరరావు, జక్కా పాపారావు, జక్కా వెంకటస్వామి, తదితరులు పత్రికా సమావేశంలో పాల్గొని ఉద్యమ పూర్వపరాల్ని తెలిపారు. ఈ సభ ఏర్పాటుకు స్ఫూర్తి అంతక్రితం కాకినాడలో జరిగిన తెలగ సంఘ సమావేశం, ఈ కార్యక్రమానికి విజయవాడలో స్వర్గీయ వంగవీటి మోహనరంగాగారి ప్రోత్సాహం ఎంతో ఉంది.

1982 నాటి మహాసభకు రాజకీయ ప్రముఖులు కె. కేశవరావు, సంగీత వెంకటరెడ్డి, బందరు మాజీ ఎం.పి. బాడిగ రామకృష్ణారావు గార్లు సహకారం అందించారు, అంతే మూడు లక్షలమందితో విజయవాడ పి.డబ్ల్యు.డి. గ్రౌండ్స్లో మహాసభ విజయవంతమైంది. ఈ సందర్భంగా తలారి అనంతబాబు, ఎ. మదన్ మోహన్, ఎల్.వి. రామయ్య, పి.కె. రామయ్య, జి.ఎస్. రావు, పసుపులేటి సాంబశివరావు వంటి వారి గురించి ప్రస్తుతించడం మన ధర్మం. జిల్లా మహాసభలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, కాకినాడ, రాజమండ్రి, ఒంగోలు, గిద్దలూరు, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, చిత్తూరులలో జరగడం, 1988 ప్రాంతంలో విజయవాడ కృష్ణా నదీ తీరాన హోరున వర్షం కురుస్తున్నా 20 లక్షల మంది సోదర సోదరీమణులు ఆనాటి సభకు హాజరయ్యారు. ఈ సంఖ్యాబలాన్ని చూసి దిమ్మెరపోయిన అరాచకశక్తులు సమ్మోహనశక్తి వంగవీటి రంగాగారిని అత్యంత కిరాతకంగా హత్య చేయించడంతో రాష్ట్రవ్యాప్తంగా మనవారిలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి... ఫలితమే 89, 94, 99, 2004, 2009, 2014, 2019 వరుసగా అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోను రాజకీయ చైతన్యంతో, రాజ్యాధికారం దిశగా అడుగులువేయడానికి ప్రయత్నించడం, ప్రతిసారీ అసెంబ్లీలో 30 నుండి 40 లోపు మాత్రమే ఎం.ఎల్.ఏ.లు అడుగుపెట్టడం జరుగుతోంది. ఎక్కడున్నాం? అంటే ఎక్కడ ప్రారంభించామో అక్కడే ఉన్నాం...

తెలుగు రాష్ట్రాలలో రెడ్లు 90 మంది, కమ్మలు 40కిపైగా 50లోపు, వెలమలు 30 మంది, క్షత్రియులు 15 మందీ వారి వారి స్థానాల కంటే ఎక్కువగానే ప్రాతినిధ్యం వహించడం జరిగింది. 2019 ఎన్నికల్లోనే కమ్మల సంఖ్య తగ్గింది.

కమ్మవారి శాతం రాష్ట్ర జనాభా మొత్తంమ్మీద 4% మాత్రమే, రెడ్లు 6%, వెలమ 1%, క్షత్రియ 1% మరి 22% ఉన్న తెలగ, బలిజ, తూర్పుకాపు, కోస్తా కాపుల స్థానాలు ఎన్ని?

‘ముష్ఠి ముఫ్ఫై’

భీమవరం, చిత్తూరు, పొన్నూరు అసెంబ్లీలు గెలిచామని ఆనందించేస్తున్నాం. పెడన, తెనాలి, గుంటూరు, ఉండి, తణుకు, నెల్లూరు, కావలి, దర్శి, గిద్దలూరు, ఒంగోలు, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాళహస్తి, మదనపల్లె, పుంగనూరు, కోవూరు, రాజంపేట, మైదుకూరు, కడప, కర్నూలు, ఆత్మకూరు, నంద్యాల, ఆదోని, అనంతపురం ఇక్కడ మిగిలిన కులాలు గెలుపొందుతూ తరతరాలుగా శాసిస్తుంటే మనం చోద్యం చూస్తూ కూర్చుంటున్నాం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ కోసం 'దరఖాస్తు' కూడా చెయ్యం... ఎందుకీ ప్రస్తావనలోకి వచ్చామంటే ‘అధికారం’ ఉంటేనే ఏదైనా చేయగలం, ఏమైనా సాధించగలం...

అధికారం కోసం ప్రయత్నించే యువ నాయకుల్ని ప్రోత్సహించక పోయినా ఫరవాలేదు, దయచేసి నిరుత్సాహ పరచకండి... అధికార పగ్గాలు చేబూనితేనే కాంట్రాక్టులు, లైసెన్సులు, పర్మిట్లు అయినవారికి ఇవ్వగలం... అధికారమే లేకపోతే అభివృద్ధి ఎప్పుడూ అందనంత దూరంలోనే ఉంటుంది. మనింట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ తయారు కావాలన్నా, మన బిడ్డల్ని అమెరికాకు పంపాలన్నా మనమే కష్టపడాలి, మనమే ప్రయత్నించాలి కానీ ఎవరో వచ్చి ఏదో చేస్తారని కలల్లో బ్రతకడం పెద్ద పొరపాటు. మనం వ్యక్తులుగా విడిపోకుండా, కుటుంబపరంగా స్థిరపడగలిగితేనే వ్యవస్థాగతంగానూ ఎదుగుతాం.....

జంటనగరాలలో 'స్వగృహఫుడ్స్' పేరిట ఎన్నో మిఠాయి కొట్లు ఉన్నాయి, మిఠాయిలు తయారు చేసే వంట పనివారందరూ కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలకు చెందిన కాపు కులస్తులైతే కొట్లు అన్నీ కమ్మ, క్షత్రియ కులాలవారివే, వారే యజమానులు. అమీర్పేట, కాప్రా ప్రాంతంలో ఉన్న ‘తాపేశ్వరం కాజా' కొట్లు ఇంకా ఆలివ్ మిఠాయి షాపులు రెండు మాత్రం కాపులవి. 'యాజమాన్యం' అనేది సంఘంలో ఒక వ్యక్తి యొక్క స్థానాన్ని పెంచుతుంది, సంఘజీవనంలో ఎన్నో శిఖరాల్ని అధిరోహించేలా చేస్తుంది.

రెడ్లు రాజకీయాల్ని గుప్పెట్లో పెట్టుకున్నారు, వెలమలు భాగస్తులయ్యారు, తర్వాత కమ్మలు వాటా పంచుకున్నారు. ఓడిపోయినా కూడా ఈ కులాలు పోటీ చేస్తూనే ఉంటాయి, రాజకీయ వృత్తి కోణాన్ని, నాయకత్వ బహు ముఖీనతను ఇది సూచిస్తుంది. అంటే ఎప్పటికీ రాజకీయాల్ని వదలకపోవడంతో వీరిలో నాయకత్వ లక్షణాలున్నాయన్న భావన ప్రజలలో కలుగుతోంది. మనలో ఓటమి భయాన్ని పెంచుతోంది, ఈ భయాలు, అపోహలు తొలగిపోవాలి. చిత్తూరులో రెండుసార్లు ఓడిపోయినా మూడోసారి గెలిచిన ఎ.ఎస్. మనోహర్ గారు, ఆరణి శ్రీనివాసులు వంటివారు బలిజలకు స్ఫూర్తిని కలిగించిన విషయం విస్మరించరాదు.

ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు అంటే యాభై, అరవై ఏళ్ళ క్రితమే రెడ్డి, కమ్మ, క్షత్రియ, వెలమ కులాలలో ఆ ‘కుటుంబ యజమాని' నలుగురు కొడుకుల్ని కని ఒకడిని వ్యవసాయానికి, ఇంకొకడిని రాజకీయానికి, మరొకడిని అత్యున్నత ఉద్యోగానికి, ఇంకొకడిని విదేశాలకూ అంకితం చేసి, ఈ నలుగురికీ ఆంధ్రప్రదేశ్లోని ఒక్కొక్క ప్రాంతం నుండి పెళ్ళిళ్ళు చేసే 'సంస్కృతి' ఉండేది, అది ఇంకా అమలులో ఉంది కూడా, అవెంతో సత్ఫలితాలనిచ్చి ఆ కులాలకు రాష్ట్రంలోని అన్ని రంగాలపైనా గట్టిపట్టు దొరకడానికి, ఏ ప్రాంతంలో భూములున్నాయి, ఎక్కడ పరిశ్రమలు నెలకొల్పచ్చు, ఎక్కడ హోటల్ వ్యాపారం నిర్వహించొచ్చు, ఎక్కడ నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి, పవర్ ప్రాజెక్టులు మొదలుపెట్టొచ్చు వంటి వాటి గురించి సమగ్రమైన అవగాహన ఏర్పడింది. మూలాలు శోధించి మనమూ అక్కడి నుండి మొదలు పెట్టాలి. తెలుగు రాష్ట్రాలలోని కులస్తులంతా సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకోవాలి.

అన్ని ప్రాంతాల వారితోనూ సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకోవాలి, కమ్యూనికేషన్ల వ్యవస్థను సక్రమంగా వినియోగించుకుని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూండాలి. అప్పుడే సంఘంలోని అన్ని రంగాలపైన ఆధిపత్యం వస్తుంది, శ్రామిక కులాలతోను, వెనుకబడిన తరగతులను, దళితులను, ముస్లిం మైనార్టీలను, గిరిజనులతోను సఖ్యతతో మెలగుతూ సోదరభావాన్ని పెంపొందించుకోవాలి. నలుగురూ మన నాయకత్వాన్ని, ఆధిపత్యాన్ని అంగీకరిస్తేనే రాజ్యాధికారం సాధ్యమౌతుందని తెలుసుకోవాలి. ఎటొచ్చీ మనవారు ఎక్కడ అభివృద్ధి చెందుతున్నా ఆనందించాలి, ప్రచారం కల్పించాలి, పఠించడం కాదు ఇవన్నీ తప్పక పాటిస్తే విజయం మనదే!!! ఈ నేపథ్యంలో 2008 ఆగస్ట్ 26వ తేదీ సుప్రసిద్ధ సినీ కథానాయకుడు పద్మభూషణ్ డా॥ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని వ్యవస్థాపించి 'సామాజిక న్యాయం' పిలుపునందించారు. 2009 ఎన్నికల్లో తలపడి 18 స్థానాల్లో మాత్రమే గెలుపొందగలిగారు. 2011 సంవత్సరం నాటికి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసి కాంగ్రెస్ నాయకుడిగా అవతరించగా, 2010వ సంవత్సరంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి పదవ ముఖ్యమంత్రిగా చిత్తూరు జిల్లాకు చెందిన ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి పీఠం అధిరోహిస్తే, 2011వ సంవత్సరంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉత్తరాంధ్రకు చెందిన బొత్స సత్యనారాయణ నియమించబడ్డారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుండి బయల్పడి వై.ఎస్. జగన్మోహనరెడ్డి వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీని నెలకొల్పి రెడ్డి సామాజిక వర్గాన్ని తనవైపుకి తిప్పుకొని కాంగ్రెస్ని రెడ్డేతర కాంగ్రెస్ రూపొందించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాగా ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీ నారాయణ, పొన్నాల లక్ష్మయ్య, వట్టి వసంతకుమార్, దానం నాగేందర్, తోట వెంకట నరసింహం, చెన్నంశెట్టి రామచంద్రయ్య, గంటా శ్రీనివాసరావు కులస్తుల నుండి రాష్ట్ర మంత్రులుగా రాణించారు.

2014 విభజిత ఆంధ్రప్రదేశ్కి ఆ ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం, నిమ్మకాయల చినరాజప్ప, పి. నారాయణ, గంటా శ్రీనివాసరావు, కిమిడి మృణాళిని మరియు కిమిడి కళా వెంకటరావులు (మంత్రివర్గ మార్పులలో), పైడి కొండల మాణిక్యాలరావు (భాజపా) రాష్ట్రమంత్రులుగా రాణించారు.

నెల్లూరు జిల్లా నుండి పసుపులేటి సిద్దయ్యనాయుడు, మాదాసు గంగాధరంల తరువాత రాజకీయాల్లో ధృవతారగా వెలుగొందినవారు నారాయణ విద్యాసంస్థల అధినేత పి. నారాయణ కావడం విశేషం. భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్న పొంగూరు నారాయణ 2014 ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. శాసనమండలికి ఎన్నికయ్యారు. అంతక్రితమే పురపాలక శాఖామంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో ముఖ్యభూమిక వహించారు. నెల్లూరు జిల్లాలో బలిజలు రాజకీయంగా చైతన్యవంతులు కావడానికి, ఆర్థికంగా ఎదగాలనుకునే ఆలోచనలకు పి. నారాయణ పునాది వేశారనడం అతిశయోక్తి కాదు. కాగా గంటా శ్రీనివాసరావు, పి. నారాయణలు వియ్యంకులు.

అధికారంలోకి వస్తే కాపులకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్న తెదేపా అధినేత ఎన్. చంద్రబాబు అధికారంలోకి రాగానే తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం వాస్తవ్యులు, పెద్దాపురం శాసనసభ్యులు అయిన వివాదరహితులు నిమ్మకాయల చినరాజప్పని ఉప ముఖ్యమంత్రిని చేశారు. కాపుల నుండి తొలి ఉప ముఖ్యమంత్రిగా నిమ్మకాయల చినరాజప్ప ఘనత వహించడమే గాక 2015వ సం||లో తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఎన్నుకోబడ్డారు. అంతేకాదు చేగొండి వెంకట హరరామజోగయ్య, కిమిడి కళా వెంకటరావుల తరువాత ఆంధ్రప్రదేశ్కు హెూమ్ శాఖామాత్యునిగా పదవీబాధ్యతలు నిర్వర్తించిన 'కాపు'గా కూడా కీర్తినొందారు.

2015 వ సం||లో తెదేపా చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకుంది, పార్టీ ఆరంభం నుండి అధ్యక్షులుగా వ్యవహరించిన ఎన్.టి. రామారావు, ఎన్. చంద్రబాబుల తరువాత తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన తెదేపా సీనియర్ నేత కిమిడి కళా వెంకటరావుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షునిగా నియమించింది.

2019 ఎన్నికలకుగాను వై.ఎస్. జగన్మోహనరెడ్డి సారధ్యంలోని వైకాపా అధికారంలోకి వచ్చింది, జగన్రెడ్డి మంత్రివర్గంలో బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, పేర్ని వెంకట్రామయ్య (నాని), ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి), దాడిశెట్టి రాజా, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ లు మంత్రులు కాగలిగారు.

2014 తెదేపా హయాంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నిమ్మకాయల చినరాజప్ప ఉపముఖ్యమంత్రిగా పదవి చేపట్టగా, 2019 ఎన్నికల ఫలితాల అనంతరం వైకాపా హయాంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్, తర్వాత కొట్టు సత్యనారాయణలని ఉపముఖ్యమంత్రి పదవి వరించింది. తెదేపా హయాంలో ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ ఛైర్మన్గా చలమలశెట్టి రామానుజయ్యని నియమించింది, వీరి పదవీకాలం ముగియగానే కొత్తపల్లి సుబ్బారాయుడిని ఆ పదవిలో నియమించింది. కొత్తపల్లి సుబ్బారాయుడు పదవీ కాలం అనంతరం వైకాపా హయాంలో ఈ పదవి 'జక్కంపూడి రాజా'ని వరించింది. జక్కంపూడి రాజా పదవీకాలం ముగియగానే కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన అడపా శేషగిరిరావు నియమించబడ్డారు.

తొలి మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులైన ప్రభుత్వ అధికారి రెడ్నెం అమరేంద్రకుమార్ హయాంలో పథకాల అమలు, మరీ ముఖ్యంగా విదేశీ విద్యాదీవెన పథకం క్రింద వేలాదిగా విద్యార్థులు విదేశాలకు వెళ్ళడం జరిగితే జక్కంపూడి రాజా చైర్మన్ గా ఉన్న హయాంలో 45సంవత్సరాల పైబడిన బహిళలకు నేస్తం పథకం పేరిట 15 వేల రూపాయల ఆసరా లభించింది. వైకాపా మంత్రివర్గ మార్పులలో భాగంగా తిరిగి బొత్స సత్యనారాయణ మంత్రిమండలిలో స్థానం పొందగా కొట్టు సత్యనారాయణని ఉపముఖ్యమంత్రిగా, దేవదాయ ధర్మాదాయ శాఖా మంత్రిపదవి వరించగా, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్ నాథ్ మరియు మన ఇంటి కోడలైన విడదల రజని మంత్రులయ్యారు.

2024 ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన పార్టీలనుండి 23 మంది శాసనసభలోకి అడుగు పెట్టగా వీరిలో సుప్రసిద్ధ సినీ కథానాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. డా. పొంగూరు నారాయణ, కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, కొండపల్లి శ్రీనివాస్ రాష్ట్ర మంత్రులుగా అలరారగా, విజయనగరం నుండి కలిశెట్టి అప్పలనాయుడు, కాకినాడ నుండి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్, బందరు నుండి వల్లభనేని బాలశౌరి లోక్సభ సభ్యులుగా గెలుపొందారు. శాసనమండలి ఎన్నికలలో విశాఖపట్టభద్రుల నియోజకవర్గం నుంచి బొత్స సత్యనారాయణ వైకాపా నుండి ఎంపికయ్యారు.

- చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్