Jammalamadugu History

Jammalamadugu History. కన్నెలూరు, జమ్మలమడుగు, నారాపురం ఈ మూడు ఊర్లకు ఆ పేర్లు ఎలా వచ్చాయో జమ్మలమడుగు చరిత్ర ని చదివి తెలుసుకోండి.

Jammalamadugu History

జమ్మలమడుగు చరిత్ర

(కన్నెలూరు, నారాపురం, సుభద్రాపురం)

కన్నెలూరు

పెన్నానది ఉత్తర దిక్కుగా అరణ్యం ఉండేది. ఆ అరణ్యం నరికి కొందరు కిరాతకులు అక్కడ కుటీరాలు వేసుకొని కాపురాలు చేసేవారు. ఆ పల్లెకు తూర్పున ఒక బావి త్రవ్వు కున్నారు. ఆ బావిలో నీరు దివ్యంగా ఉండేవి. దేవకన్యకలు ప్రతిదినము పొద్దుపొడుపుకు ముందే ఈ బావిలో స్నానం చేసి వెళ్లేవారు అపుడపుడు మనుషులకు కనిపించేవారు. చుట్టూ పొలాలు తయారయినవి. కంసాలివారు, కరణాలుగా ఉండేవారు. కన్యకలు అక్కడి బావి స్నానానికి వస్తూ ఉన్న కారణంగా ఆ గ్రామాన్ని కన్యలూరు (కన్నెలూరు) అని పిలిచేవారు.

జమ్మలమడుగు

ఈ ప్రాంతాన్ని వీర బుక్కరాయలు విద్యానగరాన్ని రాజధానిగా ఏలుతూ ఉండేవాడు. ఆయనొకసారి గండికోట దుర్గానికి వచ్చాడు. కన్నెలూరు గురించి విన్నాడు. ఇక్కడకి వచ్చాడు. గ్రామానికి దక్షిణంగా నదిగట్టున శివకేశవ దేవాలయాలు నిర్మించాడు. ఆలయాలు నడిచేందుకు భూములు ఏర్పాటు చేశాడు. గ్రామానికి ఉత్తరంగా ఒక చెరువు త్రవ్వించాడు. అది పెద్ద చెరువు అన్నారు, తూర్పున చెరువు త్రవ్వించాడు. అది చిన్న చెరువు అన్నారు. రెండు చెరువులకు నీరు చేరేందుకు వాయవ్య మూల అరపరువు దూరంలో పెన్నానది నుండి కాలువలు తీయించాడు. చెరువులకు పడమర నీరు నిలిచేది అక్కడ మడుగు ఏర్పడింది. ఆ మడుగులో జంబు (జమ్ము) అనే గడ్డి పెరిగేది అది జమ్మలమడుగు అయ్యింది.

నారాపురం

పైన చెప్పిన సంగమవంశ బలిజరాజు బుక్కరాయల వంశీయుడు ప్రౌడదేవరాయలు ఆయన కుమారుడు విజయదేవరాయలు ఆయన ఉదయగిరిని పాలించాడు. అప్పుడు ఈ ప్రాంతం ఉదయగిరి రాజ్యానికి చెల్లుతుండేది. విజయదేవ రాయలు భార్య నారాయణమ్మ. ఆమె నారాయణస్వామి పేరుమీద ఈ ప్రాంతములో విష్ణుదేవాలయము కట్టించింది. అక్కడ అగ్రహారం ఏర్పాటుచేసి బ్రాహ్మణులకు వసతి కల్పించింది. ఆ గ్రామానికి నారాయణపురము అని పేరు పెట్టింది. ప్రజల నోళ్లలో ఆ గ్రామం నారాపురం అగ్రహారం అయింది. అక్కడున్న స్వామి నారాపురం స్వామి అయ్యారు. కాలగమనంలో పెన్నలోని ఇసుకపేరుకొని నారాపురం గ్రామం శిధిలమైంది.

జమ్మలమడుగు స్థానంలో గ్రామం విస్తరించింది. అది జమ్మలమడుగు అని పిలుస్తూ వచ్చారు. ఆ ప్రాంతాన్ని బుక్కరాయలు వంశీయులు మల్లికార్జున దేవరాయలు పాలించే కాలం నాటికి జమ్మలమడుగులో మాధవస్వామి దేవాలయం, రామలింగేశ్వరస్వామి దేవాలయం ఏర్పడ్డాయి.

తానీషా గోల్కొండను పరిపాలిస్తున్న కాలంలో జంబులమడుగు ప్రాంతం వారి ఆధీనంలో ఉండేది. అక్కన్న మాదన్న వారికి మంత్రులుగా ఉండేవారు. పొదిలి లింగప్పగారు ఈ ప్రాంతపు వ్యవహారాలు చూస్తూ ఉన్నపుడు వారివైపు నుంచి కంచినపల్లె రంగరఘునాధ పంతులు, జమ్మలమడుగు, పరగణా వ్యవహారం చేస్తూ ఉన్నాడు. ఆయన నారాపురం దేవాలయాన్ని పునరుద్దరించాడు. రథం నిర్మించాడు, ఉత్సవాలు జరిపించారు.

క్రీ.శ.1709 లో ఆకనూరు నరసన్న పంతులు, జమ్మలమడుగులో కోట కట్టించాడు. ఇది రాతికోట. కోట నిర్మాణము రెండు సంవత్సరాలు సాగింది. నరసన్న పంతులు కోటకు నాయకుడిగా సిగిరిశెట్టి పెరుమాళ్లును నియమించాడు. ఈ విషయం కోట బురుజుల క్రింద ఉన్న శాసనాలద్వారా తెలుస్తుంది. నరసన్న పంతులు కోటకు ఉత్తరంగా పేట కట్టించాడు. నారాపురం వెంకటేశ్వరస్వామికి ప్రాకారాలు కట్టించాడు. తిరుపతిలో విగ్రహాలు చేయించి రథోత్సవాలకు వేంచేపు చేయించాడు. ఆయన భార్య సుభద్రమ్మ, నారాపురం దేవాలయానికి ఈశాన్యంలో దేవాలయం నిర్మించినది. బావి త్రవ్వించినది. సుభద్రాపురం అనే పల్లె కట్టించింది ఆ పల్లె శిధిలమయిపోయింది.

ఆధారం : మెకంజి కైఫీయత్తులు, కడపజిల్లా, మొదటి భాగం - జమ్మలమడుగు వృత్తాంతం.

- భట్టరుశెట్టి పద్మారావు రాయలు

Jammalamadugu History

Jammalamadugu History. కన్నెలూరు, జమ్మలమడుగు, నారాపురం ఈ మూడు ఊర్లకు ఆ పేర్లు ఎలా వచ్చాయో జమ్మలమడుగు చరిత్ర ని చదివి తెలుసుకోండి.

jammalamadugu history telugu | narapuram history | kanneluru history | warangal kings | musunuri nayakulu | kapu community