Araveeti Clan Political History

Araveeti Clan Political History (ఆరవీటి వంశం - రాజకీయ చరిత్ర). ఆరవీటి రాజకీయ చరిత్ర ని చదివి తెలుసుకోండి. Only On Kapu Community.

Araveeti Clan Political History

ఆరవీటి వంశం - రాజకీయ చరిత్ర

1. చాళుక్య ఆరవీటి సోమదేవరాజు : కళ్యాణపురం పాలకుడు చాళుక్య బిజ్జలరాజు (1157 సం) కుమారుడు. మైలపుడు కుమారుడు హెమ్మలరాయుడు అతని కుమారుడు పిన్నమరాజు (కాకతీయుల వద్ద సైనికాధికారి) అతని కుమారుడు సోమదేవరాజు (క్రీ॥శ॥ 1280-1350) ఇతడు రెండవ ప్రతాపరుద్రుని సైనికాధికారి. కాకతీయ సామ్రాజ్య పతనానంతరం కాపయ్య నాయకుని తోటి ఆంధ్ర మహావిప్లవంలో పాల్గొని కర్నూలుజిల్లా మల్యాల కేంద్రంగా పోరాటాలు సాగించిన వీరాధివీరుడు. ఆరవీటి సోమదేవరాజును గురించి దోనేరు కోనేటినాధుని ద్విపద బాలభాగవతం. అందుగుల వెంకయ్య కవి వ్రాసిన రామరాజీయం - 182 వ॥ పద్యములో వివరించారు. 1335 సం|| ఆనెగొందిని 12 లక్షల సైన్యము గల ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బీన్ తుగ్లక్ సైన్యాధిపతి మాలిక్ నబి ఆక్రమించగా ఆరవీటి సోమదేవరాజు వానిని ఎదుర్కొని ఢిల్లీకి పారద్రోలి కంపిల రాజ్యం ఆక్రమించాడు. తర్వాత అనారోగ్యంతో మరణించాడు. కడప జిల్లా వీరబలిజ శాసనములో 12 లక్షల సైన్యము గల ఢిల్లీ సుల్తానును ఎదుర్కొన్నవారు. వీర బలిజలని శాసనం చెబుతుంది. దీనిని బట్టి ఆరవీటి వారు క్షత్రియ బలిజలని తెలుస్తుంది.

2. ఆరవీటి పిన్నమశౌరి : క్రీ॥శ॥1330-1400- కర్నూలు ప్రాంతమునకు సామంత నాయకునిగా విజయనగర సంగమ వంశరాజులు నియమించారు.

3. ఆరవీటి బుక్కరాజు : కర్నూలు, నంద్యాల ప్రాంతములకు సామంత నాయకునిగా సంగమ వంశ రాజులు నియమించారు. క్రీ॥శ॥ (1400-1510) ఇతను రెండవ దేవరాయలు కాలములో 1425 సం॥ సమ్మెట తిమ్మానాయకుడు తోటి తుళునాడు. యుద్ధములో పాల్గొని తిమ్మానాయుడు తుళునాడు పాలకుడైన తర్వాత తన సోదరి బుక్కమాంబను తుళువ తిమ్మానాయుడు కుమారుడు ఈశ్వరనాయకునికిచ్చి వివాహము చేశాడు. ఆరవీటి బుక్కరాజుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య అబ్బలాదేవి వీరికి సింగరాజు అనే కుమారుడు కలిగాడు. ఇతడు కర్నూలు జిల్లా నంద్యాల పాలకుడయ్యాడు. ఇతని వంశీయులను "నంద్యాల వారు”గా పిలువబడినారు. రెండవ భార్య బల్లాలదేవి. వీరికి రామరాజు అనే కుమారుడు కలిగాడు. ఇతడు కర్నూలు ప్రాంత పాలకుడుగా ఉండేవాడు.

4. ఆరవీటి రామరాజు : బుక్కరాజు రెండవ భార్య బల్లాలదేవి కుమారుడు. ఇతనికి ముగ్గురు కుమారులు. 1. ఆరవీటి తిమ్మరాజు 2. కొండరాజు 3. శ్రీరంగరాజు క్రీ॥శ॥ 1470 - కర్నూలు ప్రాంతమునకు విజయనగర రాజుల సామంతుడుగా ఉండేవాడు.

5. ఆరవీటి తిమ్మరాజు : 14వ శతాబ్దం నాటివాడు. కర్నూలు జిల్లా అవుకు | ప్రాంతమునకు విజయనగర రాజుల సామంతుడుగా వున్నాడు. క్రీ॥శ॥ 1485లో విజయనగర పాలకుడు సాళువ నరసింహరాయలుకు సేవలందించాడు.

6. ఆరవీటి శ్రీరంగరాయలు : ఇతడు విజయనగర నగర పాలకులైన కఠారి సాళు వ వంశజుల కాలంలో విజయనగర సంస్థానములో ప్రధానమైన పదవిని నిర్వహించాడు. విజయనగర సామ్రాజ్య రక్షణలో కంకణబద్ధులైన, వారి బంధువులుగా, సామంతులుగా విజయనగర పాలకులు చేసిన ప్రతి యుద్ధములో పాల్గొన్నారు - తళ్ళికోట యుద్ధానంతరం ఇతనికి ఐదుగురు కుమారులు. 1. కోనరాజు (కోనేటి కొండమరాజు) కర్నూలు జిల్లా “ఆధోని” పాలకుడు. 2. తిమ్మరాయలు - కర్నూలు జిల్లా అవుకు పాలకుడు ఇతని వారసులు అవుకు వారుగా పిలువబడి ప్రసిద్ధి చెందారు. 3. రామరాయలు విజయనగర సామ్రాజ్యాదీశుడు శ్రీకృష్ణ దేవరాయలు పెద్దల్లుడు ఆనెగొంది సంస్థానాధీశుడు ఉన్నారు. 4. తిరుమల రాయలు - శ్రీకృష్ణదేవరాయలు రెండవ కుమార్తె వెంగమాంబ భర్త - అనంతపురం జిల్లా పెనుగొండ రాజధానిగా విజయనగర సామ్రాజ్యాన్ని పాలించాడు. 5. వెంకటాద్రిరాయలు - వెంకటాద్రిరాయలు - కర్నూలుకు రాజయ్యాడు.

7. స్వతంత్ర్య పాలకులుగా : క్రీ॥శ॥ 1570లో పెనుగొండ రాజధానిగా శ్రీకృష్ణదేవరాయలు అల్లుడు అరవీటి తిరుమల రాయలు సింహాసన మధిష్టించి తర్వాత వారి వారసులు - 1570 నుండి 1680 వరకు దాదాపు - 110సం|| విజయనగర మహాసామ్రాజ్యమును పాలించారు.

8. ఆరవీటి తిరుమలరాయలు : క్రీ॥శ॥ 1570-1572 వరకు పెనుగొండ రాజధానిగా విజయనగర సామ్రాజ్యం పాలించాడు. ఇతను ఆరవీటి శ్రీరంగరాజు రెండవ (1485) కుమారుడు. క్రీ॥శ॥ 1565లో జరిగిన తళ్ళికోట (రక్కసి తంగడి) యుద్ధంలో అళియ రామరాయ రాయలు మరణానంతరం ముస్లిం సైన్యాలు విజయనగర హంపి నగరం ఆరునెలల పాటు ధ్వసం చేశారు. ఆ సమయంలో ఆరవీటి తిరుమల రాయలు మరియు విజయనగర సామ్రాజ్యాధీశుడు తుళువ సదాశివరాయలు ఇద్దరూ అంతఃపుర స్త్రీలను, అక్కడ వున్న సంపదను పెనుగొండకు తరలించారు. హంపి నగర ధ్వంసం పూర్తయిన తర్వాత తుళువ సదాశివరాయలు ఆరవీటి తిరుమలరాయలు, విజయనగరం వచ్చి నగరాన్ని పునర్నిర్మించి, పూర్వ ప్రతిష్టను సంపాదించడానికి ప్రయత్నించారు. చెల్లాచెదురైన ప్రజలు, పోర్చుగీసు వర్తకులు, విజయనగరంలో సదాశివరాయలును, ఆరవీటి తిరుమలరాయలును దర్శించి వాణిజ్యం యధాప్రకారం సాగించేటట్లు అంగీకరించారని తెలుస్తుంది. కాని కుటుంబ కలహాల వల్ల (అళియ రామరాయలు వారసులు) తిరుమల రాయలు ప్రయత్నాలు కొనసాగలేదు - పెనుగొండలో కూడా ఆరవీటి తిరుమల రాయలుకు ఇక్కట్లు తప్పలేదు. ఆరవీటి అళియ రామరాయలు కుమారుడైన పెద తిమ్మరాజు. పినతండ్రి తిరుమల రాయలు (పెనుగొండ) ను నిరసించి అతనిని అధికారమునుండి తొలగించడానికై సుల్తానుల సహాయము అర్థించడానికి గూడా వెనుకాడలేదు. కుటుంబ కలహాల ఫలితంగా, ఆధోని, బంకాపుర, మధుర రాజ్యాల సామంతులు స్వాతంత్రులయినారు. నిరాశతో నిస్సహాయుడైన ఆరవీటి తిరుమలరాయలు. విజయనగరాన్ని విడిచి పెనుగొండలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు.

తుళువ సదాశివరాయలు క్రీ॥శ॥ 1576 వరకు - శిథిలమైన విజయనగర సామ్రాజ్యానికి నామమాత్రపు రాజుగా ఉన్నాడని శాసనాలు చెబుతున్నాయి. అతని కుమారుడు తిరుమల రాయలు అతని పెంపుడు కుమారుడు కుమార రాము - కంపిలరాజ్య పాలకులుగా ఉన్నారు. ఆనెగొంది పాలకుడైన కుమార రాముడు తండ్రి కునిబి రాజుగా జానపద కథలలో కలదు. కొందరు కాపు కుటుంబమైన ఒక్కళిగలుగా కొందరు బలిజ కాపులుగా వ్రాశారు. అంతటితో తుళువ వంశం అంతమయినది.

ఆరవీటి అళియ రామరాయలు కుమారుడు పెదతిమ్మరాజు (ఆనెగొంది సంస్థానాధీశుడు) బీజాపూర్ అదిల్షా సాయంతో పెనుగొండనాక్రమించాలని “బిజరాఖాన్, నాయకత్వంలో ప్రయత్నించాడు. కాని పెనుగొండ దుర్గ పాలక సైన్యాధ్యక్షుడు సవరం చెన్నప్ప ఆ దాడిని తిప్పికొట్టాడు. రాక్షసతంగడి యుద్ధానంతరం బహమనీ సుల్తానులు ఐదుగురు కలహించుకోసాగారు. అది అదనుగా ఆరవీటి తిరుమల రాయలు గోల్కొండ ఇబ్రహీం కుతుబ్షా, అహమ్మద్ నగర్, నిజాం షాలు కలిసి, బీజాపూర్ అదిల్షాతో చేసిన యుద్ధములో తిరుమల రాయలు, గోల్కొండ అహమ్మద్ నగర్ నవాబుల కూటమిలో చేరాడు. ఇందుకు ఆగ్రహించి బీజాపూర్ అదిల్షా 1568లో దండెత్తిరాగా ఆధోని పాలకుడైన ఆరవీటి కోనరాజు ఓడిపోయి బీజాపూర్ సామంతుడైనాడు. ఆధోని రాజ్యం బీజాపూర్ రాజ్యంలో చేరింది. పెనుగొండ పట్టాభిషేకం నాటికి తిరుమల రాయలుకు 90 సం|| వృద్ధుడుగా ఉన్నాడు. తిరుమల రాయలు గొప్ప సాహితీవేత్త. గొప్ప పండితుడు. ఇతడు జయదేవుని “గీత గోవిందం”నకు చక్కని వాఖ్యను రచించాడు. వసుచరిత్ర వ్రాసిన రామరాజ భూషణుడు. ఇతని ఆస్థానములో కూడా కొనసాగాడు. వసుచరిత్రను తిరుమల రాయలుకు అంకితమిచ్చాడు.

ఆరవీటి తిరుమలరాయలు తన రాజ్యాన్ని మూడు భాగాలుగా విభజించి పెనుగొండ (తెలుగు ప్రాంతం) కేంద్రంగా ఆరవీటి మొదటి శ్రీరంగరాయలు - కన్నడ ప్రాంతాన్ని శ్రీరంగపట్నం కేంద్రంగా మొదటి రామదేవరాయలును, తమిళ ప్రాంతానికి చంద్రగిరి కేంద్రంగా రెండవ వెంకటపతి రాయలును తన ముగ్గురు కుమారులకు అప్పగించాడు. వారిలో పరస్పర సహకారం లోపించడంతో అలా చేయడం జరిగింది.

9. మొదటి శ్రీరంగరాయలు : క్రీ॥శ॥ 1572-1585 పెనుగొండ కేంద్రంగా విజయనగర సామ్రాజ్యాన్ని పాలించాడు. క్రీ.శ. 1576లో బీజాపూర్ అదిల్షా దండెత్తి రాగా, గోల్కొండ నవాబు సహకారాన్ని తీసుకొని తంజావూర్ సైన్యాన్ని పారద్రోలాడు. అచిర కాలంలోనే తమ సామంత రాజులు, సారెరాజు, మట్లిరాజులు, హండెరాజులు, శ్రీరంగరాయలును వ్యతిరేకించి గోల్కొండ నవాబును ఆహ్వానించారు. క్రీ.శ. 1580 కొండవీడు రాజ్యాన్ని కోల్పోయారు. ఆ సమయంలో పాలెగార్ల మధ్య అంతర్యుద్ధాలు జరిగినవి. మొదటి శ్రీరంగరాయలు తోటి సంధిని విస్మరించి గోల్కొండ నవాబు కర్నూలు రాజ్యము మీదకు అతని సేనాని మురహరిరావును సైన్యంతో పంపాడు. అతను అహోబిల దేవాలయము, పరిసర ప్రాంతాలను దోచుకొని ప్రజలను హింసించాడు. అహోబిల శ్రీనివాస మఠ జియ్యర్ కోరికపై మొదటి శ్రీరంగరాయలు సమ్మెట కొండరాజు సమ్మెట వెంకటరాజులను పంపి మురహరిరావును ఓడించి పారద్రోలారు. దీనితో ఆగ్రహించిన గోల్కొండ నవాబు కొండవీడు రాజ్యంపైకి హైదర్ ఉల్ ముల్కును పంపాడు. అతడు ఉదయగిరి మొదలు అనేక గిరిదుర్గాలను ఆక్రమించి కొండవీటిని ముట్టడించాడు. గొబ్బూరు తిమ్మరాజు (బలిజ) వెలిగోటి తిమ్మరాయుడు (వెలమ), కొండవీటి ప్రాంతపాలకులుగా ఉండి, ఎదిరించారు. ముట్టడి చాలాకాలం సాగింది. వెలిగోటి తిమ్మరాయుడు - ముర హరిరావు వద్ద కొంత ధనం లంచంగా తీసుకొని దుర్గాన్ని గోల్కొండ నవాబు కుతుబ్షా స్వాధీనం (1580)లో చేశాడు. కొండవీడు రాజ్యాన్ని విజయనగర రాజులు కోల్పోయారు. శ్రీరంగరాయలు భార్య రాణా జగదేవరాయలు సోదరి - వీరి కుమార్తెను - రాణా జగదేవరాయలు కుమారుడు ఇమ్మడి జగదేవ రాయలు కి ఇచ్చారు.

10. రెండవ వెంకటపతి రాయలు : క్రీ॥శ॥ 1585-1614, పెనుగొండ కేంద్రంగా వున్న మొదటి శ్రీరంగరాయలుకు పురుష సంతానం లేని కారణంగా చంద్రగిరి కేంద్రంగా పాలిస్తున్న అతని తమ్ముడు రెండవ వెంకటపతి రాయలు అధికారంలోకి వచ్చాడు. శ్రీరంగపట్నం కేంద్రంగా పాలిస్తున్న వీరి అన్న మొదటి రామదేవ రాయలును కాదని ఇతనిని విజయనగర సంస్థానములో సేనాధిపతులైన, సవరం చెన్నప్ప, రాణాజగదేవరావు మొదలగు వారు బలపరిచి రెండవ వెంకటపతి రాయలును సింహాసనంపై అధిష్టింప చేశారు ఇతను సమర్థవంతుడైన రాజు. వెంటనే ముస్లీం రాజులు ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి కైవశం చేసుకోవాలని ప్రయత్నించాడు. 1589 సం॥ నాటికి ఉదయగిరి వశమయింది. నంద్యాల, కర్నూలు, గుత్తిపాలెగాళ్ళను జయించి గండికోట నాక్రమించాడు. మట్లె అనంత భూపాలుడు, తంజావూరు రఘునాథ నాయకుడు, గుర్రంగశెట్టి (బలిజ) మొదలగు వారి నాయకత్వంలో రెండవ వెంకటపతి రాయలు గోల్కొండ నవాబు సైన్యాన్ని తరిమి తరిమి కొట్టి ఆ ప్రాంతాలను వశపరుచుకున్నారు. కొండవీడు రాజ్యం మినహా తెలుగు ప్రాంతాలన్నీ వెంకటపతి రాయలు వశమయి పెనుగొండ రాజ్యంలో చేరాయి. బీజాపూర్ సుల్తాన్ రెండవ ఇబ్రహీం అదిలాషా దాడులను తిప్పికొట్టి అతడు ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. 1598 సం॥ ఈ తిరుగుబాటును అణిచిన రెండవ వెంకటపతిరాయలు, నంద్యాల కృష్ణమరాజును కందనవోలు ఆరవీటి గోపాలరాజును బంధీలుగా పట్టుకున్నారు. తెలుగు ప్రాంతాలు అణగినంతనే, తమిళ భూమిలో "రాయవెల్లూరు" లింగమ నాయకుడు తిరుగుబాటు చేశాడు. దిండివనం, తిరువాడి, వందవాసి, ఆర్కాటు నాయకులు తిరుగుబాటు చేశారు. వెలుగోటి యాచమ నాయకుడు పెనుగొండ సవరం చెన్నప్ప సైన్యముతో ఉత్తరమల్లూరు యుద్ధములో తిరుగుబాటు దార్లను ఓడించారు. తిరిగి లింగమనీడు వెంకటపతిరాయలును ధిక్కరించాడు. మట్లె అనంతరాజు, దామెర్ల చెన్నప్ప అతనిని మిన్నూరు, గుడలాటూరు యుద్ధములలో ఓడించి లింగమనీడును బంధీగా పట్టుకొని పదవీ భ్రష్టుని చేశాడు. మైసూరు, రాయలసీమ, తమిళనాడు సామంతుల తిరుగుబాటును అణచివేసి వారిని ఎల్లపుడూ అదుపులో ఉంచడానికి తన రాజధానిని క్రీ॥శ॥ 1606లో పెనుగొండ నుండి “వేలూరు”కు మార్చాడు. రాక్షసితంగడి యుద్ధంలో దక్షిణ దేశంలో హిందూరాజుల ప్రాబల్యం నశించలేదనడానికి రెండవ వెంకటపతిరాయలు పాలన నిదర్శనం మొఘల్ చక్రవర్తి అక్బర్ తన సార్వభౌమాధికారాన్ని అంగీకరించవలసిందిగా ఆరవీటి రెండవ వెంకటపతి రాయలుకు రాయబారం పంపగా "నేను మహమ్మదీయుల పాదాలను ముట్టను అక్బరేస్వయంగా దండెత్తి వస్తే యుద్ధం తప్పనిసరి అని రాణాప్రతాప్ వలె వీరోచితంగా బదులుచెప్పి విజయనగర గౌరవాన్ని, సాంప్రదాయాన్ని, స్వాతంత్ర కాంక్షను నిలబెట్టిన ధీరుడు. వెంకటపతిరాయలు, రెండవ వెంకటపతి ఆస్థాన విద్వాంసులు అప్పయ దీక్షితులు, చెన్నభసవ పురాణ గ్రంథకర్త అయిన విరూపాక్ష పండితుడు, జైన వ్యాకరణ కర్త అయిన భట్టలంకదేవుడు మొదలగు సుప్రసిద్ధ కవులుండేవారు. ఇతను రెండవ ఆంధ్రభోజుగా ప్రసిద్ధి. ఇతని ఆస్థానంలో భోజరాజీయం రచించిన అనంతామాత్యుడు, ప్రభావతీ ప్రద్యుమ్నం, కళాపూర్ణోదయం వ్రాసిన పింగళి సూరన, పాండురంగ మహత్మ్యం వ్రాసిన తెనాలి రామకృష్ణుడు చివరి రోజులలో వీరివద్ద ఉన్నట్లు కొందరు చరిత్రకారుల అభిప్రాయం. రెండవ వెంకటపతి రాయలును రెండవ శ్రీకృష్ణదేవరాయలుగా పోల్చేవారు.

11. రెండవ శ్రీరంగ రాయలు : క్రీ॥శ॥ 1614-1616లో వేలూరు కేంద్రంగా పరిపాలించాడు. ఇతను రెండవ వెంకటపతిరాయలు అన్నగారయిన శ్రీరంగం కేంద్రంగా పాలించిన ఆరవీటి రామదేవ రాయలు కుమారుడు, రెండవ వెంకటపతిరాయలుకు సంతానం లేదు. అతని పట్ట మహిషి బాయమ్మ అళియ రామరాయలు మనుమరాలు, గొబ్బూరి ఓబరాజు కుమార్తె బాయమ్మ వారి దాసి కుమారుని పెంచి అతనిని తన కొడుకుగా ప్రకటించి పెద్ద చేసి అతనిని సింహాసమెక్కించాలని ఆమె ఆశయం. ఈ విషయం తెలుసుకున్న రెండవ వెంకటపతిరాయలు తనకు సంతానం లేని కారణంగా తన తర్వాత రాజుగా తన అన్నగారయిన రామరాయలు కుమారుడు రెండవ శ్రీరంగరాయలును వారసుడిగా ప్రకటించి మరణించాడు.

రెండవ శ్రీరంగరాయలు రాజ్య సింహాసనమెక్కాడు కాని వెంకటపతిరాయలు మరణంతో సింహాసనంకోసం ఆరవీటి వంశంలో అంతర్యుద్ధం జరిగింది - విజయనగర రాజ్య సామంతులు రెండు భాగాలుగా చీలి కలహించుకోసాగారు. రెండవ వెంకటపతి రాయలు భార్య బాయమ్మ సోదరుడు గొబ్బూరి జగ్గరాయలు (వెంకటగిరి పాలకుడు) సేనాధిపతి సాళువ మాకరాజు సాళువ తిమ్మరాజులను కూడకట్టుకొని రెండవ శ్రీరంగరాయలును తొలగించి తన మేనల్లుడు సింహాసనమెక్కించేందుకు కుట్రపన్నాడు. రెండవ శ్రీరంగరాయలు కుటుంబమును బంధీలుగా చేశాడు. వారి సైన్యాధిపతి వెలుగోటి యాచమనాయకుడు (వెలమ) రెండవ శ్రీరంగ రాయలు కుమారుడు రామదేవ రాయలును తప్పించి అతనిని తంజావూరు రఘునాథ నాయకుడి వద్దకు తీసుకెళ్ళి ఇక్కడ జరిగిన సంగతులన్నీ వివరించాడు. గొబ్బూరి జగ్గరాయలుకు మధుర, జింజి నాయకరాజులు సహాయము చేశారు. తంజావూరు రఘునాథ రాయలు రామదేవరాయలును సింహాసనముపై కూర్చుండబెడతానని హామీ ఇచ్చాడు. తోపూరు గ్రామం వద్ద యుద్ధం జరిగింది. రఘునాథరాయలుకు విజయం లభించింది. గొబ్బూరు జగ్గరాయలును యుద్ధంలో సంహరించాడు. మధుర, జింజినాయక రాజులు, రఘునాథ రాయలు వియ్యంకులు | కాబట్టి క్షమించి వదిలేశాడు. అది క్రీ॥శ॥ 1616లో జరిగింది. దక్షిణ భారతం పెద్ద ఎత్తున ఫిరంగులువాడిన యుద్ధము అదే!

12. ఆరవీటి రెండవ రామదేవరాయలు : క్రీ॥శ॥ 1616-1630 పాలించాడు. ఆరవీటి రెండవ శ్రీరంగ రాయలు కుమారుడు. వేలూరు కేంద్రంగా పాలించాడు. గొబ్బూరి జగ్గరాయలు సోదరుడు గొబ్బూరు యతిరాజు. బలాన్ని కూడగట్టుకొని యుద్ధానికి వచ్చాడు. రెండవ రామదేవరాయలు సైన్యాధిపతి వెలుగోటి యాచమ నాయకుడు (వెలమ) చేతిలో పరాజయం పాలయి సంధి చేసుకొని ఆరవీటి రెండవ రామదేవ రాయలుకు తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. అంతర్యుద్ధం అంతటితో ముగిసింది. మరలా, మధుర, జింజి, నాయకరాజులు రెండవ రామదేవరాయలును ధిక్కరించారు. కాళహస్తి సామంతుడైన దామెర్ల వెంకటపతి, బలవంతుడై తిరుగుబాటు చేశాడు. ఆరవీటి రామదేవరాయలు, గొబ్బూరి యతిరాజుల బంధుత్వము. వెలుగోటి యాచమనాయకుడు కొడుకు కస్తూరి రంగప్ప తిరుగుబాటు చేశారు. క్లిష్టపరిస్థితులలో గొబ్బూరి యతిరాజు సహకారంతో ఆరవీటి రెండవ రామదేవరాయలు. తిరుగుబాటు దార్లతో పలు యుద్ధాలు చేసి ఓడించాడు. దామెర్ల వెంకటపతి (వెలమ) లొంగిపోవుటచే 1629 లో శాంతి ఏర్పడి ఆరవీటి రామదేవరాయలు అధికారం సుస్థిరమయింది.

13. ఆరవీటి వెంకటపతి రాయలు - 3 : (క్రీ॥శ॥ 1630-1642) ఆరవీటి రెండవ రామదేవరాయలుకు సంతానం లేని కారణంగా తన పినతండ్రి పెద వెంకటపతిరాయలు) (అళియ రామరాయలు మనుమడు ఆరవీటి మూడవ వెంకటపతిరాయలు) తనకు వారసుడిగా నిర్ణయించాడు. ఈ నిర్ణయాన్ని ఆరవీటి రామదేవ రాయలు పినతండ్రి ఆరవీటి తిమ్మరాజు ధిక్కరించి యుద్ధానికి దిగాడు. తిమ్మరాజు చర్యను మధుర, జింజి, తంజావూరు నాయకరాజులు ఇష్టపడక వారి సాయంతో ఆరవీటి మూడవ వెంకటపతిరాయలు ఆరవీటి తిమ్మరాజును ఓడించి సింహాసమెక్కాడు. 1635లో ఆరవీటి తిమ్మరాజు మరణంతో అంతర్యుద్ధం ముగిసింది. బీజాపూర్ సుల్తాన్తో సుదీర్ఘంగా యుద్ధం జరిగింది. దానికి కారణం విశ్వాసఘాతకులయిన విజయనగర సామంతులు ముఖ్యంగా మూడవ శ్రీరంగరాయలు బీజాపూర్ సేనానితో చేతులు కలిపాడు. 3వ వెంకటపతిరాయలకు తమ్ముని కుమారుడు అందుచే మూడవ శ్రీరంగరాయలు వెల్లూరు సింహాసనము ఆశించాడు. ఆర్వీటి మూడవ వెంకటపతిరాయలు కర్నూలు ఆరవీటి గోపాల రాజు దత్తపుత్రుడు 1624 సం॥ నుండి అతను బీజాపూర్ నవాబు సామంతుడు. ఆరవీటి తిమ్మరాజు యుద్ధంలో మూడవ వెంకటపతిరాయలుకు అండగా మూడవ శ్రీరంగరాయలున్నాడు. అనంతరం ఉభయుల మధ్య అభిప్రాయ భేదాలొచ్చినవి.

కర్ణాటకలో అధిక భాగాన్ని బీజాపూర్ సుల్తాన్ ఆక్రమించడాన్ని గోల్కొండ సుల్తాన్ సహించక 1642లో తెలుగు ప్రాంతాలమీదికి దండయాత్ర కొచ్చాడు. వెంకటగిరి సామంతుడు వెలుగోటి తిమ్మనాయకుడు, కాళహస్తి సామంతుడు, దామెర్ల వెంకటపతి సహాయంతో మూడవ వెంకటపతిరాయలు వారినెదిరించాడు కాని పరాజయం పొంది అడవులలోకి పారిపోయి రాజ్య భ్రష్టుడయ్యాడు.

14. మూడవ శ్రీరంగరాయలు : (క్రీ॥శ॥ 1642-1680) మూడవ వెంకటపతి రాయలు అనంతరం మూడవ శ్రీరంగరాయలు బీజాపూర్ సైన్యాధిపతి రణదౌలఖాన్ను వీడి “వెల్లూరు” చేరి క్రీ॥శ॥ 1642లో వెల్లూరు సింహాసనమధిష్టించాడు. ఇతడే విజయనగర రాజులలో చివరివాడు. సామంతులలో ద్రోహబుద్ధి, స్వార్థచింతన పెరిగిపోయాయి.

రాజ్యంపై గోల్కొండ సైన్యాలు దండెత్తాయి. మూడవ శ్రీరంగరాయలు ఉదయగిరిని ముట్టడిస్తున్న గోల్కొండ సైన్యాలను తరిమివేయడానికి చేసిన ప్రయత్నంలో కాళహస్తి పాలకుడు దామెర్ల వెంకటపతి తిరుగుబాటు వల్ల విఫలమైంది ఇక్కిరి (మలనాడు) తిరుగుబాటును అణచే ప్రయత్నంలో బీజాపూర్ సైన్యాలు నిమగ్నమైనందున మూడవ శ్రీరంగరాయలుకు సహాయమందలేదు. కర్ణాటకాన్ని గోల్కొండ సుల్తాన్ జయించడం, బీజాపూర్ సుల్తాన్ సహించలేక మలినాడు తిరుగుబాటు అణిగినంతనే మూడవ | శ్రీరంగరాయలుకు సహాయంగా సైన్యాన్ని పంపినాడు. ఆ సైన్యముతో శ్రీరంగరాయలు ఉదయగిరి నాక్రమించి వెంగల్లు యుద్ధములో గోల్కొండ సైన్యాల నోడించి ప్రకాశం | జిల్లా కందుకూరు వరకు తరిమినారు. ఈ విజయాలతో తన శక్తి సామర్థ్యాలపై విశ్వాసం కుదిరి, మధుర, తంజావూరు, జింజి నాయక రాజులను అదుపులో పెట్టాలని శ్రీరంగరాయలు ప్రయత్నించాడు. కాని సామంతులు సహించలేదు - శ్రీరంగరాయలు బలవంతుడవుతున్నాడని భావించి భయంతో, బీజాపూర్, గోల్కొండ సుల్తాన్లు ఏకమయి, “వెల్లూరు” పై దండెత్తారు. శ్రీరంగరాయలు వారితో సంధి చేసుకున్నాడు. 1642 వెల్లూరు వద్ద జరిగిన యుద్ధంలో మూడవ శ్రీరంగరాయలు పూర్తిగా పరాజయం పాలయినాడు - మూడవ శ్రీరంగరాయలు రాజ్యాన్ని రాజధానిని కోల్పోయి - మైసూరు రాజ్యములో శరణార్థి అయ్యాడు. మహారాష్ట్ర నాయకుడు శివాజీ విజృంభణతో బీజాపూర్ అల్లకల్లోలమయింది. ఈ పరిస్థితులలో మూడవ శ్రీరంగరాయలు క్రీ॥శ॥ 1665లో పెనుగొండ నాక్రమించి 1680 వరకు పాలించినట్లు తెలుస్తుంది. ఇతనితో ఆరవీటి వంశపాలన అంతమయింది.

araveeti rajakiya charitra | araveeti clan political history | nandyala clan araveeti | araveeti vamsham | araveeti bukkaraju | tuluva dynasty | Kapu Community