Jakkampudi Rammohan Rao
Jakkampudi Rammohan Rao was born On August 6th, 1953, to the pious couple Mrs. Sitaratnam and Mr. Pedda Veriyya in the village of Adurru.

Name | Jakkampudi Rammohan Rao |
Born | 6 August 1953, Adurru, Andhra Pradesh |
Died | 9 October 2011 (age 58 years), Rajamahendravaram |
Wife | Vijayalakshmi |
Parents | Jakkampudi Pedda Veriyya, Sitaratnam |
Siblings | Jakkampudi Srinivas |
Children | Jakkampudi Raja, Jakkampudi Ganesh, Sridharma Sindhu Sahasra |
Occupation | Politician |
జనయోధుడు జక్కంపూడి రామ్మోహనరావు
1953వ సం॥ ఆగస్ట్ 6వ తేదీన పవిత్ర గోదావరి తీరాన గల రాజోలు తాలూకా ఆదుర్రు గ్రామం నందు శ్రీమతి సీతారత్నం, శ్రీ పెద వెర్రియ్య పుణ్య దంపతుల నోములపంటగా 'జక్కంపూడి' వారి వంశంలో శ్రీ రామమోహనరావు గారు జన్మించారు. తాటిపాకలో ప్రాథమిక విద్య, రాజమండ్రి మున్సిపల్ హైస్కూల్, దానవాయిపేట మున్సిపల్ హైస్కూల్ లలో ఉన్నత పాఠశాల విద్య, వి.టి. కాలేజి లో ఇంటర్, బి.కామ్ లు పూర్తి చేశారు. 'కొమ్ముల' వారింటి ఆడపడుచు విజయలక్ష్మి ని వివాహం చేసుకున్నారు.
రాజకీయ ప్రస్థానం
జక్కంపూడి రామమోహనరావు వి.టి. జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా 1970-72 సం॥ల మధ్య, 1972- 75 సం॥లనడుమ రాజమండ్రి కళాశాలల N. S. U I. విభాగాల అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. 1981 లో సంజయ్ గాంధి జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ గా గుర్తింపు పొంది 1984 వ సం॥ ఫిబ్రవరి 11న జిల్లా యువజన కాంగ్రెస్ కన్వీనర్ గా పి.సి.సి. అధ్యక్షులచే నియమించబడ్డారు. 1985 నవంబర్ 23న ఇందిరా గాంధి ఉత్సవకమిటీ కన్వీనర్ గా నియమించబడ్డారు, 1985 సెప్టెంబర్ 9న జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా అప్పటి పి.సి.సి. అధ్యక్షులు జలగం వెంగళరావు గారిచే నియమింపబడి బహుళ వ్యాప్తిలోకి వచ్చారు.
ప్రాంతీయ రాజకీయాల్లో భవిష్యత్
రాజమండ్రి నగర ఐ.ఎన్.టి.యు.సి. అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షులు సంజీవరెడ్డి గారిచే నియమితులయ్యాక 1989 మే 2న పి.సి.సి. మెంబర్ గా మర్రి చెన్నారెడ్డి గారిచే నియమించబడి, జులై 13న ఐ.ఎన్.టి.యు.సి జిల్లా అధ్యక్షునిగా కూడా నియమించబడి ఆయా పదవులకే వన్నె తెచ్చారు. పూర్తిస్థాయి రాజకీయ కార్యకర్తగా, ట్రేడ్ యూనియన్ లీడర్ గా తను నమ్మిన న్యాయం కోసం నిరంతర పోరాటం చేసే లక్షణం జక్కంపూడి రామమోహన రావు ని ప్రత్యేకంగా నిలిపింది. అనునిత్యం వార్తల్లోని వ్యక్తిగా నిలవడం, ప్రత్యర్థిపై కయ్యానికి కాలు దువ్వడం, నిత్యం నవ్వుతూ నవ్విస్తూ ఉండే మిత్రులతో స్నేహం, వ్యసనాలు లేకపోవడం, ఆపదలో ఉన్నవారికి సహాయపడడం, ఆవేశంతో కొన్నిసార్లు కష్టాలు కొని తెచ్చుకోవడం, తన క్రేజ్, ఇమేజ్ లను కాపాడుకుంటూ రాజకీయంగా ఎదగాలన్న పట్టుదల, మధ్య తరగతి తిరుగుబాటు మనస్తత్వం, సంఘసేవకుడిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలన్న ఆకాంక్ష… ఇవీ స్థూలంగా జక్కంపూడి రామమోహనరావు గారి విలక్షణ వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనాలు.
1989 శాసనసభ ఎన్నికలకు గాను 'కడియం' (2024 రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గం) నుండి సమీప తెలుగుదేశం అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే వడ్డి వీరభద్రరావుపై స్వతంత్ర అభ్యర్థిగా 630 ఓట్ల ఆధిక్యత తో గెలిచి సంచలనం సృష్టించారు. కాంగ్రెస్పార్టీ చివరి నిముషంలో రామమోహన రావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయక వేరొకరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో అభిమానుల కోరికపై ' స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించడంతో కాంగ్రెస్ అధిష్టానం దిమ్మెరపోయి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించింది. నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత ఎస్టిమేట్స్ కమిటీ సభ్యునిగా నియమించబడ్డారు. 1992 ఫిబ్రవరి 12న జిల్లా కో- ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ డైరక్టర్ గా విజయం సాధించారు. 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఓటమిచెందినా మొక్కవోని దీక్షా దక్షతలతో ముందుకు సాగారు.
ముఖ్యమైన ఉద్యమాలు, పోరాటాలు
తెలుగుదేశం పార్టీ హయాంలో జిల్లాలో పోలీసులు వేధింపు చర్యలపై నిరంతర పోరాటం, కాంగ్రెస్ పార్టీలో వై.యస్ రాజశేఖర్ రెడ్డి వర్గీయుడిగా ప్రత్యర్థి వర్గాల నాయకులతో అంతర్గత పోరాటం, ఎమ్మెల్యేగా ఉంటూనే మధ్యపాన నిషేధ ఉద్యమంలో చురుకైన పాత్ర, కోస్తా జిల్లాల మద్యపాన వ్యతిరేక పోరాటానికి సారథ్యం, అంతకు ముందు వంగవీటి మోహన రంగారావు గారితో కలిసి పోలీసు, ప్రభుత్వ దమన నీతిపై ఉద్యమం, 1988 కాపునాడు ఉద్యమంలో కీలక పాత్ర ఇవన్నీ కూడా జక్కం పూడి రామమోహనరావు గారిని నాయకుడిగా తీర్చిదిద్దాయి. మరింత రాటు దేల్చాయి.
1996 మార్చి 3 న తూర్పుగోదావరి జిల్లా ప్రచార కమిటీ ఛైర్మన్ గా రాష్ట్ర ఛైర్మన్ ద్రోణం రాజు సత్యనారాయణ గారి చే నియమింపబడి, 1999 ఎన్నికల్లో అప్పటి TDP ప్రభంజనంలో శాసన సభ్యునిగా రెండోసారి BJP అభ్యర్థి గిరిజాల వెంకట స్వామి నాయుడు ని 804 ఓట్ల తేడాతో ఓడించి, తిరిగీ అసెంబ్లీలో అడుగుపెట్టి కాంగ్రెస్ విప్ గా నియమింపబడ్డారు. 2001 సెప్టెంబర్ 17న ఐ.ఎన్.టి.యు.సి. రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఎన్నికై 2001 నవంబర్ 10న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారు. 2002 డిసెంబర్ 9 న ప్రివిలేజస్ కమిటీ సభ్యునిగా నియమించబడ్డారు.
2004 శాసనసభ ఎన్నికలకు గాను ప్రత్యర్థి అయిన BJP అభ్యర్థి సోము వీర్రాజు 38,560 ఓట్ల భారీ ఆధిక్యత సాధించి ముచ్చటగా మూడోసారి అసెంబ్లీలో అడుగుపెట్టడమే గాక డా॥ వై. ఎస్. రాజ శేఖర్ రెడ్డి మంత్రి వర్గం లో 2004 జూన్ 22న ఎక్సైజ్ శాఖామాత్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. పూర్తి టరమ్ కేబినెట్ మంత్రిగా కొనసాగిన రికార్డుని జక్కంపూడి రామమోహనరావు గారు స్వంతం చేసుకున్నారు.
కుటుంబం మరియు వారసత్వం
అనారోగ్యకారణాలతో 2009 ఎన్నికలో పోటీ చేయకపోయినా అర్ధాంగి, శ్రీమతి జక్కంపూడి విజయలక్షిని పోటీ చేయించారు, 2009 ఎన్నికలకుగాను కడియం నియోజకవర్గం రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గంగా మారింది. 2011 అక్టోబర్ 11న తిరిగిరాని లోకాలకు తరలి వెళ్ళిన జక్కంపూడి రామమోహనరావు గారు జనహృదయాల్లో జగజ్జేతగా నిలిచి పోయారు. జక్కంపూడి రామమోహన రావు, విజయలక్ష్మి పుణ్యదంపతుల సంతానం శ్రీధర్మ సింధు సహస్ర, రాజాఇంద్ర వందిత్, విజయమోహన గణేష్.
రాజకీయ సమీకరణలలో భాగంగా జక్కంపూడి కుటుంబం 'YSRCP' లో చేరాక 2014 ఎన్నికలకు గాను 'రాజానగరం' నియోజక వర్గం నుండి శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి YSRCP అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందినా, 2019 ఎన్నికలకు గాను 'యువకుడు, ఉత్సాహవంతుడూ అయిన పెద్ద కుమారుడు 'జక్కంపూడి రాజా' ని నించోబెట్టి సమీప TDP అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ పై 31772 ఓట్ల భారీ ఆధిక్యత ఘన విజయం సాధించేలా చేశారు..
తండ్రీ తనయులిద్దరి రాజకీయ ప్రవేశంలో ఒక పోలిక ఉంది, ఇరువురూ మొదటి ఎన్నికలోనే విజయం సాధించడం… 2019 ఆగస్ట్ 11 వ తేదీన ' జక్కంపూడి రాజా ' ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులై అర్హులైన పేద, దిగువ మధ్య తరగతి కాపు, తెలగ, బలిజ, ఒంటరి మహిళలకి కాపునేస్తం పథకం క్రింద కోట్లాది రూపాయలు అందించి చరితార్ధులయ్యారు.
- చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్
End
Jakkampudi Rammohan Rao
Jakkampudi Rammohan Rao Rao was born On August 6th, 1953, to the pious couple Mrs. Sitaratnam and Mr. Pedda Veriyya in the village of Adurru.
jakkampudi rammohan rao | jakkampudi rama mohana rao | vangaveeti mohana ranga | kapu community