“హాస్య కులానికి దళపతీ
హాస్య దళానికి కులపతీ”
తెలుగు సినిమా చరిత్రలో భావి తరాల వారిని ప్రభావితం చేయగలిగిన నటీనటులు వేళ్ళమీద లెక్క పెడితే అందులో తప్పనిసరిగా నిలిచే పేరు అల్లు రామలింగయ్య… హాస్యంలోంచి విలనీ, విలనీ లోంచి హాస్యం సాధించిన విశిష్ట నటుడు అందుకే ఎన్ని తరాలు మారినా తరగని కీర్తిని సొంతం చేసుకుని ప్రేక్షక హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
1953 లో తొలిచిత్రం పుట్టిల్లు లో పోషించిన ‘శాస్త్రులు’, వద్దంటే డబ్బులో టీచరు, దొంగరాముడు లో హాస్టలు వార్డెను పాత్రల్ని పునాదులుగా చేసుకుని భాగ్యరేఖ, మాయాబజార్ చిత్రాలతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని అప్రతిహతంగా 2004 వరకూ 1000 కి పైగా చిత్రాల్లో విలక్షణ భూమికల్ని పోషించిన ఈ పాలకొల్లు ప్రతిభాపరాయణుడ్ని 1990 లో భారతప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
పుట్టిల్లు, మాయాబజార్ లలోని శాస్త్రులు పాత్ర ప్రభావం ఇటు ప్రేక్షకుల్లోను, అటు
పరిశ్రమలోను పడింది. అందుకే 90వ దశకంలో వచ్చిన ‘గ్యాంగ్ లీడర్ ‘ వరకూ అలాంటి పాత్రలకు అల్లు వారే కేరాఫ్ అడ్రస్, అయితే బలిపీఠం, కమలమ్మ కమతం, విప్రనారాయణ, చక్రపాణి, భద్రకాళి ఇలా ఒక్కో చిత్రంలో ‘శాస్త్రి’ పాత్ర ఒక్కోలా ఉండడమే ‘అల్లు’ వారు సాధించిన పరిపూర్ణత, పాత్ర లో పరిక్వత. ఆ పాత్రకు తాను నిజ జీవితంలో చూసిన సూరి భొట్ల నారాయణమూర్తి గారు స్ఫూర్తి అని, అయితే ఆయా చిత్రాల్లో పాత్రా చిత్యాన్ని బట్టి రసాల కూర్పు చేసుకునేవాడినని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. అలాగే హాస్యపాత్రలు పోషించాల్సి వచ్చినప్పుడల్లా మునిమాణిక్యం నరసింహరావులు, భమిడిపాటి కామేశ్వరరావు గార్ల రచనలు చదివి స్ఫూర్తి చెందేవాడినని, ఆ ఇద్దరూ తన అభిమాన రచయితలుగా అల్లు పేర్కోన్నారు..
నాటి కె.వి.రెడ్డి మొదలు ఇ.వి.వి. సత్యనారాయణల వరకూ దర్శకులకు ఏం కావాలో? అది మాత్రమే తగుమోతాదులతో అందించి అందర్ని ఆనందపారవశ్యుల్ని చేసిన ఒకే ఒక్క ఆర్టిస్టు కూడా అల్లు వారే కావడం గమనార్హం. తెలుగు సినీ స్వర్ణయుగంగా పేర్కొనే 1950 – 1970 లలో వచ్చిన వజ్రతుల్యమైన చిత్రాలలో దాదాపుగా అల్లు రామలింగయ్య నటించారంటే నటుడిగా ఆయన ఎంత లోతైన వారో తెలుస్తుంది. సమకాలిన నటుల ఎస్.వి. రంగారావు, రేలంగి వెంకట్రామయ్యగార్లని అభిమానించిన అల్లువారు 60 దశకం మలినుండీ రాజబాబు, రమాప్రభలతో కలసి రెండొందల చిత్రాలు చెయ్యడం ఒకెత్తు కాగా, 70వ దశకం తొలినాళ్ళు మొదలు 90వ దశకం వరకూ రావుగోపాలరావు కలయికలో సుమారు రెండొందల చిత్రాలు చెయ్యడం ఆషామాషీ విషయం కాదు, అంతకు కొన్నేళ్ళ ముందు నాగభూషణం కలయికలో ఇలా వరుసపెట్టి చిత్రాలు చేసిన అల్లు వారు, After నాగభూషణం modern polished ప్రతినాయకుడిగా అవతరించిన రావుగోపాలరావుతో, వారి తర్వాత కోట శ్రీనివాసరావు వరకూ కూడా ‘అల్లు’ వారి ప్రక్కనే ఉంటూ నక్కజిత్తుల్ని నూరి పోసే పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చెయ్యడం ‘అల్లు’ కి replacement లేదు అని చెప్పడమే…
కె. విశ్వనాథ్ పాఠశాలలో ఆత్మ గౌరవంతో మొదలు పెడితే చెల్లెలికాపురంలో పిసినిగొట్టు పబ్లిషరు, కాలం మారిందిలో ఎమ్మేల్యే దేనికవే సాటికాగా శంకరాభరణంలో స్నేహితుడంటే వీడూ అనిపించడం కూడా అల్లుకే సాధ్యం. సప్తపదిలో రాజుగారి తర్వాత తిరిగి ఆపద్భాందవుడులో మరోసారి రాజుగారిగా అపార్థం చేసుకుని చిరంజీవిని విమర్శించే సన్నివేశంలో అల్లు నటన ఇప్పటి పరిభాషలో next level లో ఉంటుంది..
డి.వి. నరసరాజు రచన చేసిన యమగోలలో ఎన్టీఆర్, సత్యనారాయణ, రావుగోపాల్రావు, జయప్రద ఇంతమంది ఉండగా ద్వితీయార్థంలో వరుసబెట్టి scenes అన్నీ అల్లు రామలింగయ్య మీదే వస్తూంటాయి అంటే అది చిత్రగుప్తుడి గొప్పదనం కాదు. ఆ పాత్ర
పోషించిన అల్లు రామలింగయ్యది మాత్రమే. మరీ ముఖ్యంగా “తాళము వేసితిని గొళ్ళెము
మరిచితిని” మరిచిపోగలమా?
బాపు, ముళ్ళపూడి వెంకటరమణల పాఠశాల లో ‘బుద్ధిమంతుడి’ తో మొదలైన ప్రయాణం మంత్రిగారి వియ్యంకుడి వరకూ సాగింది, ఎప్పుడో దొంగ రాముడు’ షూటింగ్ సమయం లో అల్లు వారి వెంట అప్రయత్నంగా డైలాగ్ మరిచి పోవడం వలన వెలువడిన ‘ఆమ్యామ్యా’ ని, బుద్ధిమంతుడు, బాలరాజు కథ, అందాలరాముడు చిత్రాల్లో చెప్పగా చెప్పగా ‘ఆమ్యామ్యా కాస్తా తెలుగు నాట లంచానికి పర్యాయపదంగా స్థిరపడి పోయి దినపత్రికల్లో పతాక శీర్షిక అయ్యింది, ముళ్ళపూడి వెంకట రమణ గారిని ఓ జర్నలిస్ట్స్ “ఆమ్యామా” సృష్టికర్త మీరే కదా?! అని ప్రశ్నస్తే ఆమ్యామ్యా సృష్టికర్త అల్లురామలింగయ్యగారు, ఆమ్యామా మీద పేటెంట్ హక్కులన్నీ వారివే అని ధృవీకరించారు.. ముత్యాల ముగ్గులో దివాన్ జోగినాధం గొప్పగా నటించాడా?! లేక కోతి కరిచాక కోతిలా గొప్పగా నటించాడా ?! అంటే చెప్పడం తేఅక కాన్నే కాదు,
ఎందుకంటే ముత్యాల ముగ్గు ఎలా తెలుగు వారి ఆస్తుల్లో ఒక్కటో అలా కోతిలా
అభినయించిన దివాన్ జోగినాధం కూడా తెలుగు వారి ఆస్తే, మనవూరి పాండవుల్లో ‘కనెక్షన్ కన్నప్ప, Modern శకుని లాంటి పాత్ర కాకపోతే స్వామిభక్తి పరాయణుడు, అందులోంచి మళ్ళీ క్రూరత్వం, తిరిగీ భయం ఇన్ని రసాల్ని ఒలకిస్తూనే హిందీ నైనై తెలుగు హైహై అని నవ్వించడం. మాత్రం ఒక్క అల్లురామలింగయ్య వల్లనే అవుతుంది. Titles లో ఎక్కడో పదిమంది Artists తో పాటు తన పేరు కూడా పడిన రోజుల నుండీ wall Poster పై ముచ్చటగా మూడో విలన్ గా తన ఫోటో కూడా పెద్ద తలకాయంత వేసుకునే -స్థాయికి ఎదగడం వెనుక నిర్నిద్రరాత్రులు, నిర్విరామ కృషి దాగి ఉన్నాయి…..
కె.వి.రెడ్డి తో దొంగరాముడు తో మొదలైన ప్రయాణం మాయాబజార్, వెళ్ళినాటి ప్రమాణలతో బంధంలా ఏర్పడి శ్రీకృష్ణార్జనయుద్ధం తో అల్లు రామలింగయ్య, సురభి బాలసరస్వతులపై డ్యూయెట్ పెట్టే వరకూ వెళ్ళింది, మాయాబజార్ తర్వాత సూపర్ స్టార్లు ఎన్టీఆర్, ఏఎన్నార్లను కె.వి.రెడ్డి Direct చేస్తున్న శ్రీకృష్ణార్జునయుద్ధంలో చినముని’ అల్లు రామలింగయ్య అంచెలంచెలుగా లేని మోక్షము చాలా కష్టమే భామినీ’ అంటూ ప్రత్యేకగీతం చాలదూ.. అల్లు వైదుష్యాన్ని అంచనా వేయడానికి..
తోడికోడళ్ళు”తో ఆదుర్తి సుబ్బారావు తో మొదలైన ప్రయాణం మూగమనసులు తో తారాస్థాయికి వెళ్ళింది, అప్పటివరకూ పాత్రలకోసం ప్రొడక్షన్ హౌస్ లకి ర్యాలీ సైకిలు (అవును సైకిలుమీదే) మీద తిరిగిన అల్లు రామలింగయ్య ”మూగమనసులు’ తో ‘ట్యాక్సీ లో తిరిగే దశ కొచ్చారు. వెయ్యి రూపాయలు పారితోషికం కాస్తా రెండువేల ఐదొందలు అయ్యింది, అత్యధిక పారితోషకంగా అల్లువారు అందుకున్నది 2003 నాటికి లక్ష రూపాయలు మాత్రమే అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఏ నిర్మాతని ఏనాడూ నా పారితోషికం ఎంత? అని అడగలేదు. నా పాత్ర ఏమిటి? అని మాత్రమే అడిగిన నిర్మాతల Artist కావడంతోనే వెయ్యి చిత్రాలవైపు విల్లు ఎక్కు పెట్టగలిగారు అల్లు రామలింగయ్య.
తొలి తరం దర్శకుల తర్వాత కె. బాలచందర్, దాసరి నారాయణరావు, కె. రాఘవేంద్రరావుల చిత్రాల్లో గమ్మత్తైన పాత్రల్ని పోషించి, వారి తర్వాత ఎ. కోదండ రామరెడ్డి, విజయ బాపినీడు, కోడి రామకృష్ణ, రవిరాజా పినిశెట్టి లతో కూడా జట్టు కట్టి గొప్ప
పాత్రాల్ని చేజిక్కించుకుని తనదైన మేజిక్కు, ఇమేజిక్కులతో వాటిని పండించడం తరాలు మారేకొద్ది గతాన్ని ఇంధనంలా వాడుకుని వర్తమానంలో జీవించమనే సూత్రాన్ని నటులకు అందించిన బహుముఖీన పాత్రధారి.
అల్లు. బాలుమహేంద్ర, ప్రియదర్శన్, శంకర్ లు కూడా అల్లు రామలింగయ్యని Direct చేయడం గౌరవంగా భావించారు. నటుడిగా ఇది ఒక కోణం అయితే పాలకొల్లులో నాటకాలాడే రోజుల నుండి, స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని జైలు శిక్షలనుభవించిన రాజకీయ ఖైదీ వరకూ వారి జీవితం ఓ మజిలీ కాగా, ప్రజా నాట్య మండలితో పరిచయం, ప్రవేశం, నాటక ప్రదర్శనలతో ఊరూ, వాడా అట్టుడికించడం మరో మజిలో… ఈ నేపథ్యంలో భక్త ప్రహ్లాద నాటకంలో బృహస్పతి పాత్రని ‘ఆమ్యామ్యా తీసుకుని అల్లు రామలింగయ్య కిచ్చిన నాటకాల కాంట్రాక్టర్ మహంతి హనుమంతరావు మొదలుకుని నాటిక ప్రజానాట్య మండలి సహచరుల డా|| గరికపాటి రాజారావు (అల్లురామలింగయ్య పుట్టిల్లుతో పరిచయం చేసిన దర్శక నిర్మాత, పుచ్చలపల్లి రామచంద్రా రెడ్డి, పినిశెట్టి శ్రీరామమూర్తి (దిగ్దర్శకుడు, రవిరాజా పినిశెట్టి తండ్రి, ఆది పినిశెట్టి తాతగారు) అనిశెట్టి సుబ్బారావు, ఆచార్య ఆత్రేయ, డా|| మిక్కిలినని రాధాకృష్ణ మూర్తి, చదలవాడ కుటుంబరావు, చుండ్రు సూర్యనారాయణ గార్లను స్మరించుకుని తీరాలి..
అల్లు జననీ జనకులు అల్లు వెంకయ్య, సుత్తెమ్మ పుణ్య దంపతులకు ఏడుగురు సంతానమైతే వారిలో ఆ శ్రీరారామలింగేశ్వరుడి పేరు రామలింగయ్యకే ఎందుకు పెట్టాలి?!
ఆ ఏడుగురిలో ఈయనొక్కరే నాటకాల్లోకి, అక్కడనుండి సినమాల్లోకి ఎందుకు రావాలి?! అది తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం, ప్రేక్షకులకు దక్కిన మహద్భాగ్యం…
40 ఏళ్ళని Birth certiflate తీసుకువస్తే ప్రవేశ పరీక్ష రాయక్కర్లేదని RMP certificate ఇస్తామని చెబితే. లేదు నాకు 39 ఏళ్ళే, నేను పరీక్ష రాస్తానని చెప్పి రాసి ఉత్తీర్ణుడై హోమియోపతి డాక్టరుగా అల్లు వారు సాధించిన కీర్తి తరగని ఆస్తి… అల్లు వారి నుండి. వైద్యసేనలు అందుకున్నవారిలో శ్రీమతి నందమూరి బసవతారకంతో పాటు నూతన నటీనటుల వరకూ ఉండేవారంటే అతిశయోక్తిలేదు. రాజమండ్రిలో బోడా వెంకటరత్నం, చింతవారి జానకి రామయ్య తదితర ప్రముఖుల తో స్థాపించబడిన హోమియో కళాశాల ఆర్ధిక అస్థిర పరిస్థితుల్లో ఉంటే అల్లు రామలింగయ్య కృషి తో ఆంధ్రదేశంలో పేరెన్నిక గన్న కళాశాలగా ఎదిగింది, ఇప్పుడది డా|| అల్లురామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి కళాశాల. ఆంధ్రప్రదేశ్ లో మూడే మూడు హమియోపతి కళాశాలలుంటే ఇది ఒకటి కావడం గర్వకారణం, గత ఏడాది ఇక్కడ.. అక్టోబర్ ఒకటిన వారి అల్లుడు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా కాంస్య విగ్రహ ప్రతిష్ట జరగడం ఓ మధురఘట్టం.
సంపాదించుకున్న సినీ పరిశ్రమలోనే రూపాయి ఖర్చు చెయ్యడమన్నది అల్లు పాటించిన సిద్ధాంతం ఈ సిద్ధాం తంలోంచే ‘గీతాఆర్ట్స్ ‘ స్థాపించి దాసరి దర్శకత్వంలో బంట్రోతు భార్య, దేవుడే దిగివస్తే వంటి వరుస విజయాలు సాధించి తనయుడు అల్లు అరవింద్ ని నిర్మాతగా పరిచయం చేస్తే అగ్ర నిర్మాణ సంస్థగా జాతీయస్థాయిలో అవతరించడం చరిత్రకే చరిత్ర… చాలా మందికి తెలియని విషయం. ‘గీతాఆర్ట్స్’ ఎత్తుకు పైఎత్తు అనే ద్విభాషా చిత్రాన్ని నిర్మిస్తే రజనీకాంత్, కమల్ హాసన్ లు కథానాయకులుగా నటించడం… (తెలుగు వెర్షన్ కి నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్, తెలుగులో కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్యలు కూడా నటించారు)
చిరంజీవి కుటుంబ సభ్యుడిగా ఆగమనంతో గీతాఆర్ట్స్ ఉత్థాన స్థితికి వెళ్ళింది, చలం, కృష్ణంరాజు, రామకృష్ణ లతో మొదలైన గీతాఆర్ట్స్ చిరంజీవితో యమకింకరుడు, విజేత, పసివాడి ప్రాణం, ఆరాధన, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, ప్రతి బంధ్ (హిందీ), వంటి చిత్రాలతో తెలుగుసినిమా వాణిజ్య పరిధిని విస్తరించింది. ‘గీతా ఆ నిర్మాణరంగంలోనే కాక పంపిణీ రంగంలో 500 పై చిలుకు చిత్రాల్ని పంపిణీ చేసి గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ గా, గీతా ఆర్ట్స్ – 2, అల్లు ఎంటర్ టైన్ మెంట్స్, అల్లు స్టూడియోస్ వరకూ విస్తరించడం వెనుక అల్లు రామలింగయ్య వేసిన తొలి అడుగులే పునాదులయ్యాయి.
హీరోలలో ఎన్టీయార్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవిలతో అత్యధిక చిత్రాల్లో అల్లు రామలింగయ్యతో కలిసి నటించారు, 90లలో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇస్తే, ఆ తర్వాత 2002 నాటికి కానీ ఆం॥ ప్ర॥ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య నాయ్యడు ‘పురస్కారం ప్రకటించలేదు, మధ్యలో తమిళనాడు ప్రభుత్వం ‘కళై సెల్వమ్’ పురస్కారంతో గౌరవించింది, 2003 లో అల్లు రామలింగయ్య గారు జీవించి ఉండగానే స్వస్థలం పాలకొల్లులో కాంస్య విగ్రహ ప్రతిష్ట జరగడం ఆయన అభిమానులకి ఊరటనిచ్చేవిషయం, అరుదైన గౌరవం. అయితే స్థానిక సంస్థలు, సాంస్కృతిక సంస్థలు చేసిన సన్మానాలు, సత్కారాలుకు లెక్కకు చిక్కవు. పాలకొల్లు రాజమండ్రి, కాకినాడ, భీమవరం, ఏలూరు, గుడివాడ, గుంటూరు, హైదరాబాదు, తెనాలి, కర్నూలు ఇలా రాసుకుంటూ పోతే అన్ని ప్రధాన పట్టణాల పేర్లు రాయాల్సిస్తుంది. తొలి సారి స్వర్ణ కంకణ ప్రదానం హైదరాబాద్ లో PSRK భగవాన్ గారు చేస్తే రవీంద్రభారతిలో వెయ్యి చిత్రాలు పూర్తైన సందర్భంగా వంశీ రామరాజు గారు చేసిన సన్మానం, దుబాయ్ లో జరిగిన స్వర్ణకిరీట ప్రధానం, భీమవరంలో జరిగిన పౌరసన్మానం, పద్మశ్రీ’ వచ్చాక చెన్నై లో సినీ పరిశ్రమ యావత్తూ తరలిరాగా కళాసాగర్ సుభాన్ గారు చేసిన సన్మానం చెప్పుకోదగ్గవి.
ప్రతి కార్యక్రమానికి అర్ధాంగి అల్లు కనక రత్నంగారితో, పెద్దకుమార్తె అల్లు నవ భారతిదేవిగారు తప్పని సరిగా వచ్చేవారు, జాతీయోద్యమంలో నూలు వడకడంలో జిల్లాలోనే మొదటి బహుమతి పొందిన కారణంగా కనకరత్నం గారిని కోరి మరీ పెళ్ళాడారు రామలింగయ్య. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చార కలిగిన సంతానం కావడం తో తమకుమార్తెకు నవభారతి అని అల్లు దంపతులు పేరు పెట్టుకున్నారంటే దేశంపట్ల దేశభక్తి పట్ల అది నిబద్దతకు తార్కాణం.
అల్లు అరవింద్ అగ్రనిర్మాతగా అవతరించాక “నాన్నగారూ కొంచెం మీరు విశ్రాంతి తీసుకోవచ్చు కదా! ఇంకా నటించడం ఎందుకండి, సంవత్సరం లో మీరెంత సంపాదిస్తారో అంతా మీకు ఒక్కసారిగా నేనిచ్చేస్తానంటే… నటించడం లోనే నా తృప్తి, సరదా సంతోషం అన్నీ ఉన్నాయి, కాబట్టి ఓపిక నశించే వరకూ నటిస్తా, ఊపిరి ఉండే వరకూ నటిస్తా మరణించాక కూడా నటిస్తా అన్నారు. అల్లు రామలింగయ్య.. 3
” మరణించాక నటిస్తారా?! అదెలాగ నాన్నగారూ?” అన్నారు అరవింద్.
నేను పోయాక నన్ను పాడెమీద పడుకో బెట్టాక నువ్వా దృశ్యాలన్నిటినీ Camera పెట్టి Shoot చేయిస్తావని నాకు తెలుసు, అంటే నేను పోయాక కూడా నటిస్తున్నానన్నే కదా!!” అన్నారు అల్లు రామ లింగయ్య…
That is one&only Allu Ramalingaiah…
ఇన్ని చెప్పీ, ఇంత చెప్పీ అల్లు రామలింగయ్యగారు బాల్యం నుండే అప్పుృశ్యత, అంటరాని తనం పై పోరాడారని చెప్పకపోతే తప్పే అవుతుంది..
“కుక్కను జూచి గురుతర భక్తి తో భైరవుండని ప్రేమ బరగుచుండి
పాముని జూచి సుబ్బారాయుడని మ్రొక్కి పాలుపోని పెంతురు భక్తి గల్గి
గద్దను జూచి విష్ణు వాహనం బనుచు కడుముదము తో వినుతి జేసి
కోతి హనుమంతుడనుచు కూర్మి మీర తాకెదరు గాదె
మమ్మేల తాకరయ్యా?!
జంతువుల కన్నా అధముడా సాటి నరుడు “
అని ఈ పద్యంతో ధ్వజమెత్తిన అల్లు రామలింగయ్య జీవిత పర్యంతమూ ఈ సిద్ధాంతానికే కట్టుబడిన మహర్షి మానవతా ఋషి.
నవ్వు ఇచ్చిన రోజు జులై మరై నువ్వు పుట్టినరోజు అక్టోబర్ ఒకటి మళ్ళీ ఇంకో రామలింగయ్య పుట్టలేదు,
హాస్య కులానికి దళపతీ
హాస్య దళానికి కులపతీ
అల్లు రామలింగయ్యగారు,
నువ్వు ఏడ్చిన రోజు జూలై ముప్ఫై ఒకటి
నువ్వు పుట్టినరోఝు అక్టోబర్ ఒకటి
మళ్ళీ ఇంకో రామలింగయ్య పుట్టలేదు,
పుట్టబోరు ఆయనకాయనే సాటి..
ఎందుకంటే తెలుగువారి లోగిళ్ళలో అల్లు వారు వేసిన హాస్యపు ముగ్గు ఏ కాల ధర్మానికీ
చెరిగిపోదు, కళాకారుడికి మరణం రాదు, ఈ కథకి ముగింపు లేదు.. ఎప్పటికీ
రచయిత – చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్
End
Leave a Reply