Sri Krishnadevaraya Varasulu

Sri Krishnadevaraya Varasulu

రాయలు వారసులు

శ్రీ క్రిష్ణరాయలుకు మరికొంతమంది భార్యలుండినట్లు కొన్ని శాసనాధారములు నుండి తెలియుచున్నది. కాని దురదృష్ట వశమున వారి పేర్లు తెలియవు. ఈ శాసనములు వేయించిన వారు కృష్ణరాయలు కుమారులు. ఆ శాసనములలో వారు వారి తల్లుల పేర్లు చెప్పకపోయినా మేము రాయల కుమారులమని చెప్పారు. ఈ శాసనములన్నియు మైసూరు రాజ్యమునందే కలవు.

చిన్నకృష్ణప్ప నాయకుడు:

మైసూరు ప్రాంతమునకు చెందిన హసన్ జిల్లాలోని మంజీరాబాద్ జిల్లాకు చెందిన భసవనపల్లి అను గ్రామమందు భసవేశ్వరదేవాలయము వద్ద నున్న రాతి మీద ఈ శాసనమున్నది. ఈ శాసనము వేయించినవారు చిన్న కృష్ణప్ప నాయకుడు. అతడు తాను కృష్ణరాయులు కుమారుడనని ఈ శాసనములో చెప్పియున్నాడు. కాని తల్లిపేరు చెప్పలేదు. కాబట్టి ఈ చిన్న కృష్ణప్ప నాయకుడి తల్లి రాయలు 12 మంది భార్యలలో ఒకామె అని తెలియుచున్నది.

శాసనము :

||శ్రీగ్రణాధిపతి యేనమః విక్రమ సంవత్సర ద బాద్రపద శుద్ధ పంచమి (5)లు క్రిష్ణరాయ కుమార శిన్నియ కృష్ణప్ప నాయకరిగె సర్వ రసయ్యనవరు బిన్న హమాడి మళెలెయ చిక్కన్న గౌడనమగ వీరణ్ణ గౌడగె శాఖా హళ్లియ చతుస్సీమెయ గద్దె బెద్దలు సలువహణ భక్తవను నినగె కొడెగి యాగి సూర్యచంద్ర నుళలిపరియంతర సాలిసిద ఈ శాసనము కన్నడ భాషలో ఉన్నది.

సర్వరసయ్యయను వాడు చేసిన విన్నపము నంగీకరించి కృష్ణరాయలు కుమారుడైన శిన్నియ (చిన్న) క్రిష్ణప్పనాయకుడు మళెలె అను గ్రామమునకు చెందిన చిన్నన్న గాని మనుమడు వీరన్నగౌనికి శౌభహళ్లి (శౌభపల్లి) అను గ్రామములోని మెట్ట, మాగాణి భూముల నుండి రాబడి, డబ్బు మరియు వడ్లును కొగిగెగా నొసగెనట.

ఈ శాసనము విక్రమనామ సంవత్సరము బాద్రపద శుద్ధ పంచమి నాడు ఇవ్వబడినది. ఇందు శక॥సం॥ 1442 అగును. దీనికి క్రీ.శ.18-8-1520 సం॥ సరియగును. ఈ శాసనమును బట్టి రాయలు కుమారుడైన చిన్ని కృష్ణమనాయకుడు మంజీరా బాదు ప్రాంతములో అధికారము కలిగియుండెనని తెలుస్తుంది. ఇతని పేరు చిన్న కృష్ణయ్య ఉండుటను బట్టి ఇదే పేరుగల మరొక క్రిష్టప్ప అనువాడు అతనికంటే పెద్దవాడుండవచ్చును. అతడు పెద్ద క్రిష్ణప్ప కావచ్చును.

సాక్షి చిన్నమ నాయకుడు:

క్రిష్ణరాయలుకు సాక్షి చిన్నమనాయకుడు అను కుమారుండెనని మైసూరు శాసన సంపుటము నుండి తెలియుచున్నది. అతని తల్లిపేరు తెలియదు ఆ శాసనము కన్నడ భాషలో నున్నది.

||స్వస్తిణ విజయాభ్యుదయ శాలివాహన శక వరుష ౧౪౬౮
నెయ తారణ సంవత్సరద పుష్య శుద్ధులు శ్రీమన్ మప్ప
శ్రీకృష్ణరాయ మహారాయరు ప్రుతువీరాజ్చయంగెయ ఉత్తిన్ ర
శ్రీకృష్ణరాయర మహారాయర కుమార సాక్షిచింనమనాయకెరిగె
పాల్సిద ములువాగిలి సీమె యొళగణ పట్టహళ్లియ కళదొళన
సీమెయబెట్ట హళ్లియ హోసకెరెయ మూడణ దెసెయలి
పురవాగి…….

ఈ శాసనమునుండి కృష్ణరాయలకు “సాక్షి చిన్నమ నాయకుడు” అనునొక కుమారుండెననియు తెలియుచున్నది. అతని తల్లిపేరు తెలియదు. అతడు మళువాయి రాజ్యములోని ఒక రాజ్యము పాలించుచుండెను. బహుశ అతడు నేటి హోసకోట (కొత్తకోట) తాలూకా పరిసరాలు పాలించుచుండెనని తెలియుచున్నది.

ఈ శాసనం శా॥శ॥ 1428 సం॥ (క్రీ.శ.1525) తారణనామ సంవత్సర పుష్య శుద్ధ అష్టమినాడు వేయబడినది. ఈ శాలివాహన శకము సరికాదు దీనియందివ్వబడిన తారణ నామ సం|॥ బట్టి ఇది 1446గా ఉండవలెను. అపుడు క్రీ.శ.1525 సం॥ సరిపోవును. మైసూరు శాసన పరిశోధకులు చెప్పారు.

క్రిష్ణరాయలు మనుమలు :

శ్రీ క్రిష్ణదేవరాయలుకు పెక్కుమంది కుమారులేకాక కొందరు మనమలు కూడా వున్నారని తెలుస్తుంది. ఆ వివరములు మైసూరు శాసన సంపుటిలో నివ్వబడింది.

సింగప్ప నాయకుడు :

క్రిష్ణరాయలకు సింగప్ప నాయకుడను మనుమడుండెనని తెలియుచున్నది. ఇతని తండ్రిపేరు వెంకటాద్రినాయుడు. ఇతని గురించి శాసనము.

||శ్రీమతే రామానుజాయనమః| స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహన
శకవర్ష ౧౪౫౦ నెయవర్తమానక్కె సలువ సర్వదారి సంవత్సరద శ్రావణ
బహుళ ౭ లు శ్రమన్ మహారాజాధిరాజు రాజపరమేశ్వర క్రిష్ణరాయర
పౌత్ర వెంకటాద్రి పుత్రురు సింగప్ప కర …నాయకరు ముత్తట్టియ శ్రీమాధవ
దేవగిరె సంక్రాంతి పుణ్యకాలదలు శ్రీమాదవ దేవరిగె ముత్తట్టి స్థళద పొన్నప్ప
హళ్లి
యన్ను శ్రీ మాధవ నాపన్ ణ వెందు కొట్టెవాగి హోన్నె హళ్లిగె సలువ
చతుస్సీమెగె ఒళగాద నిధి నిక్షేపజల పాషాణ స్థల సామ్యవెంబ అష్టబోగద
దొళగాగి ……

ఈ శాసనము శక సంవత్సరం 1450 సర్వదారి శ్రావణ బహుళ పంచమినాడు వేయబడినది. దీనిని క్రీ.శ. 5-8-1528 బుధవారము సరియగుచున్నది. పై శాసనమును “పొన్నప్పపల్లి” గ్రామమును సంక్రాంతి పుణ్యకాలమున దానమొసగెనని తెలియుచున్నది. కాని సంక్రాంతి శ్రావణ మాసమున రాదు. కాని దానిని మాస సంక్రాంతియని చెప్ప వలయును. ఆ సంవత్సరం మాస సంక్రాంతి శ్రావణ బహుళ పంచమినాడు వచ్చినది అది యొక పుణ్యదినమైనందున రాయలు మనుమడైన సింగప్ప మాధవాలయమునకు పొన్నపల్లి గ్రామంను దానమొనర్చెను. ఇది అతని దైవభక్తికి, దానగుణమును తెలియచేస్తుంది.

పై సంవత్సరముకు నాలుగు సంవత్సరముల ముందు క్రిష్ణదేవరాయలు తారణ నామ సం|| ముత్తటి గ్రామమున, హంపిలోని విరూపాక్ష స్వామి సన్నిధిలో రంగనాధ దీక్షితుడు మనుమడును, నంజనాధ దీక్షితుడు కుమారుడునగు క్రిష్ణదీక్షితుడునకు ఆ గ్రామము కృష్ణ పురమమని ప్రతినామమొసగి దానము చేసెనని క్రీ.శ. 1524 సం|| నాటి యొక్క శాసనము నుండి తెలియుచున్నది. (Vide E.C. Vol. No: V. Hassan Taluka No. 94)

దీనినిబట్టి సింగప్పనాయకుడు వారి తాతగారివి కొన్ని గుణములు కలిగి యున్నట్లు తెలియుచున్నది. మరియు తన పితామహుడికి తన అభిప్రాయము తెలిపి ఆయన అనుమతి మీదనే తన పరిపాలన క్రింద నుండిన ఒక గ్రామమును మాధవాలయమునకు దాన మొసగినని చెప్పవచ్చును. సింగప్ప నాయకుడు వేయించిన పై శాసనములో మొట్టమొదటి “శ్రీమతే రామానుజాయనమః అని చెప్పియుండుటను బట్టి సింగపనాయకుడు వైష్ణవ మతాభిమాని అని తెలుస్తుంది.

సంగప్ప నాయకుడు :

సంగప్ప నాయకుడు శ్రీకృష్ణదేవరాయలు మరొక మనుమడు అని తెలుస్తుంది. ఇతని తండ్రి పేరు మంచప్ప నాయకుడు, తల్లిపేరు తెలియదు. మంచప్ప నాయకుడి తల్లిపేరు కూడా తెలియదు ఇతను వేయించిన కన్నడ శాసనము.

॥శ్రీ గణాధిపతయేనమః స్వస్తశ్రీ జయాభ్యుదయ శాలివాహన శక
వరుష ౧౪౪౨ నెయ విక్రమ సవచ్చరద కాతిన్క బహుళ ౨లు బుద
వారద శ్రీమన్మహా రాజాధిరాజ రాజపరమేశ్వర శ్రీకృష్ణరాయ రూ హంపెయ
హస్తినావతియ నెలె వీడినలు సుఖసంకథా వినోద దిండ రాజ్యంగైవు తిరల్లి
శ్రీకృష్ణరాయం ప్రియకుమార మంచప్ప నాయకర మక్కళు సంగ్యప్ప నాయకరు
గోళియ బీడస్థలక్కె సల్లువ మల్లవ తీనాడ దేవ వృందద శ్రీ రామేశ్వర దేవరిగె
స…. నెయసావిరద కళిచూర గ్రామ ౧ నూ అ…. మా నక్కె… చవూవన్ ద
హో హున …. తారవకిత్తరు.

క్రిష్ణరాయలు మనుమడు మంచప్పనాయకుని పుత్రుడును నగు సంగప్ప నాయకుడు దేవవృందయను గ్రామము నందుండు రామేశ్వర దేవస్థానమునకు కలిచూరు అను గ్రామము దానం చేసెనని తెలియుచున్నది.

ఈ శాసనము శా॥శ॥1442 విక్రమ సంవత్సరం కార్తీక బహుళ సప్తమినాడు వేయబడింది. దీనికి క్రీ.శ. 31-10-1520 బుధవారం సరియగును. పై శాసనములలో చెప్పియుండు గోణిబీడు హోబళి (ఫిర్కా) మరియు దేవవృంద గ్రామము నేడు చిక్కమగుళూరు జిల్లాలో నున్నది. గోణిబీడు గ్రామము సంఖ్య-1, దేవ వృంద గ్రామం సంఖ్య-12, కలిచూరు గ్రామము సంఖ్య-13, (Vide list of Villages in the Mysore State, P.301).

క్రిష్ణరాయలు మనుమడైన సంగప్ప నాయకుడు నేటి చిక్కమగుళూరు (పూర్వము కడూరు) జిల్లాలో పరిపాలకుడిగా నుండెనని చెప్పవచ్చును. మంచప్ప నాయకుడు తాను కృష్ణ రాయలకు “ప్రియ కుమారుడనని” చెప్పుకొని యుండుటను బట్టి అతని తల్లి రాయలు మరొక దేవేరి అయి నుండెననియు ఆమె కుమారుల యెడ రాయలు ప్రేమాభిమానములు కలిగి యుండెననియు తెలియుచున్నది. దీనినిబట్టి రాయలు భార్యల నందరి యెడ సమానమైన ప్రేమ కలిగి ఆదరించుచుండెనని చెప్పవచ్చును. ఈ మంచప్ప అతని కుమారుడు సంగప్ప కడూరు జిల్లా ప్రాంతము పాలించుచుండిరని తెలియుచున్నది.

పేరు తెలియని రాయలు మరొక కుమారుడు :

క్రిష్ణదేవరాయలు మరణించు నప్పటికి అతనికి సుమారు ఒకటిన్నర సంవత్సరముల వయస్సుగల (బాలుడు) కుమారుండెనని కీ.శే. శ్రీ హయవదనరావుగారు వ్రాసియున్నారు. ఇతడు తిరుమలదేవి కుమారుడు కాదు, చిన్నాదేవి కుమారుడు కాదు. ఇతడు ఏ రాణి కుమారుడో తెలియదు. ఇతనికి “హుచ్చు తిరుమల” (పిచ్చి తిరుమల) అను పేరుగల మేనమామ యొకడుండెనట. ఈ హచ్చు అను కన్నడ శబ్దమును బట్టి ఇతని తల్లి శ్రీరంగ పట్టణముగాని లేక బేలూరు ప్రాంతమునకు చెందినదని చెప్పవచ్చును.

క్రిష్ణరాయలు మరణించిన పిదప సింహాసనముకై అచ్యుత రాయలుకు ఈ బాలుని పరంగా వచ్చిన అతని మేనమామ “హచ్చు తిరుమల” కును తగువులేర్పడి అది యుద్ధంగా మారి సుమారు నాలుగు సంవత్సరాలు సాగినది. పిదప ఆ బాలుడు చంపబడెను. అచ్యుత దేవరాయలు రాజ్య భారము వహించి క్రీ.శ.1542 వరకు పరిపాలించెను.

రాయలు మరణానంతరం తిరుమలదేవి, చిన్నాదేవియు ఈ బాలుని పక్షము వహించక తమ పెద్దల్లుడు అళియ రామరాయలే, సింహాసనమునకు రావలయునని అతని సోదరుడు తిరుమలరాయలు అతనికి తోడ్పడి రాజ్యపాలన సాగించవలెనని తీవ్రముగా ప్రయత్నము గావించిరట. ఈ ఇరువురు రాణులు ఆ బాలుని పక్షం వహించలేదట. హండే అనంతపుర చరిత్ర నుండి ఈ విషయము తెలియుచున్నది. ఆ బాలుడు మేనమామ “హచ్చు తిరుమల” సోదరి రాయలను వివాహమాడి ఉండవచ్చును. ఆ రాణి పేరు తెలియదు – ఆ బాలుని పేరు గోవిందరాజు అని కొందరు రచయితలు వ్రాశారు.

శ్రీకృష్ణదేవరాయలు భార్యలు, కుమారులు, కుమార్తెలు, మనుమలు :

  1. చిన్న మహాదేవి – కుమార్తె – వెంగమాంబ (బేలూరు)
  2. తిరుమలదేవి – కుమార్తె – తిరుమలాంబ, కుమారుడు తిరుమల రాయలు
  3. సుభద్ర – గజపతి కుమార్తె – కటక్ నగరం (ఒరిస్సా)
  4. జగన్మోహిని – సాళువ వారి ఆడపడుచు – రాయవేలూరు.
  5. క్రిష్ణమాంబ – కుమార్తె – మోహనాంగి (కఠారి వారి ఆడపడుచు) (రచయిత)
  6. కొండమాంబ – అళియపడయితాంగి పట్నం (విరంచిపురం)
  7. వరదరాజమ్మ – కుమారుడు – మంచప్ప నాయకుడు. అతని కుమారుడు సంగప్ప నాయకుడు.
  8. లక్ష్మీదేవి – కుమారుడు – చిన్న క్రిష్ణప్ప నాయకుడు మంజీరాబాదు.
  9. భద్రాదేవి – కుమారుడు, సాక్షి చిన్నమనాయకుడు మళువాయి రాజ్యం (హోస్పేట)
  10. లూక్కాదేవి – కుమారుడు – వెంకటాద్రినాయకుడు ఇతని కుమారుడు సింగప్ప నాయకుడు.
  11. తుక్కాదేవి – గజపతిరాజు రెండవ కుమార్తె (ఆమె ఇష్టపడి రాయలును వివాహ మాడింది.
  12. అన్నపూర్ణ – కుమారుడు – గోవిందరాజు – శ్రీరంగపట్టణం.

End

Sri Krishnadevaraya Varasulu

శ్రీ క్రిష్ణరాయలు వారసుల గురించి తెలుసుకోండి. Legacy of Sri Krishnadevaraya Varasulu, the esteemed rulers and successors of the Vijayanagaram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *